Feb 12,2023 09:16

పచ్చిమిర్చి అనగానే రోటి పచ్చళ్ళు గుర్తొస్తాయి. స్టఫ్డ్‌ కూర కూడా చేసుకుంటాం. కానీ నిలువ పచ్చడి.. అదీ ఆవకాయ పచ్చిమిర్చితోనే అంటే కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది మనకు. ఎందుకంటే 'ఆంధ్ర' ఆవకాయకు పెట్టింది పేరు. అదీ కాలానుగుణంగా వచ్చే మామిడి, చిక్కుడు.. ఇలా రకరకాల నిలువ పచ్చళ్ళు పెట్టుకుని, సంవత్సరమంతా భద్రపరచుకొని వాడుకోవడం అనాదిగా వస్తున్నదే. చివరకు నాన్‌వెజ్‌తోనూ నిలువ పచ్చళ్ళు పట్టుకుంటున్నాం. కానీ పచ్చిమిర్చితో నిలువ పచ్చడి అంటే మరి ఆ రుచిని ఆస్వాదించి చూడాల్సిందే..! మరి వాటి తయారీ ఎలాగో తెలుసుకుందాం!

  • తొక్కుడు నిల్వ పచ్చడి..
1


కావలసినవి : పచ్చిమిర్చి - 1/4 కేజీ, జీర - స్పూను, వెల్లుల్లి - 20 రెబ్బలు, చింతపండు - 100 గ్రా, ఉప్పు -11/2 కప్పు, నూనె - 4 స్పూన్లు
తయారీ :

  1.  తొడిమలు తీసిన పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి, తడి లేకుండా ఆరనివ్వాలి. ్క బాండీలో నూనె వేడిచేసి దానిలో పచ్చిమిర్చి, జీర, వెల్లుల్లి రెబ్బలను దోరగా వేయించాలి
  2. దానిలోనే చింతపండు అయిదు నిమిషాల పాటు వేయించాలి.
  3.  రోట్లో ఉప్పు, జీర, చింతపండు, వెల్లుల్లి నూరి, దానిలో వేయించిన పచ్చిమిర్చి వేసి కచ్చాపచ్చాగా నూరి, తాలింపు పెట్టుకోవాలి.
  4.  అంతే తొక్కుడు పచ్చిమిర్చి నిల్వ పచ్చడి రెడీ.
  • ముక్కల ఆవ..
ava

కావలసినవి : పచ్చిమిర్చి - 15, జీలకర్ర - స్పూను, మెంతులు - స్పూను, ఆవాలు - 2 స్పూన్లు, సోంపు - స్పూను, నిమ్మరసం - 4 స్పూన్లు, ఆవ నూనె - 1/2 కప్పు, పసుపు - 1/2 స్పూను, ఇంగువ - 1/2 స్పూను, ఉప్పు - 11/2 స్పూన్‌, వైట్‌ వెనిగర్‌ - 2 స్పూన్లు
తయారీ 

  1.  ముందుగా బాండీలో జీలకర్ర, మెంతులు, ఆవాలు, సోంపు దోరగా వేయించాలి.
  2.  దీనిలోనే ఇంగువ చేర్చి, కాసేపు వేయించి, చల్లార్చుకోవాలి.
  3.  ఇవి చల్లారాక అన్నింటినీ బరకగా పొడి చేసుకోవాలి.
  4.  పచ్చిమిర్చిని అరంగుళం ముక్కలుగా తరిగి, వెడల్పుగా ఉన్న గిన్నెలోకి తీసుకోవాలి.
  5.  తయారుచేసి పెట్టుకున్న పొడి, పసుపు, మెత్తని ఉప్పు, వెనిగర్‌, నిమ్మరసం, ఆవనూనె కలిపి శుభ్రమైన జాడీలో భద్ర పరచుకోవాలి.
  6.  అంతే పచ్చిమిర్చి ముక్కల ఆవ రెడీ.
  • నిమ్మకాయలతో..
1

కావలసినవి : పచ్చిమిర్చి - 1/4 కేజీ, నిమ్మకాయ ముక్కలు - 8 కప్పులు, మెంతిపొడి-1/2 స్పూను, ఉప్పు -11/2 కప్పు, కారం -11/2 కప్పు, పసుపు - తగినంత, వెల్లుల్లి - 20 రెబ్బలు (కచ్చాపచ్చాగా నూరుకోవాలి)
తయారీ :

  1.  తొడిమలతో సహా ఫ్రెష్‌గా ఉన్న పచ్చిమిర్చి, పసుపు పచ్చని రంగుతో తోలు పలుచగా ఉన్న నిమ్మకాయలను తీసుకుని శుభ్రంగా కడిగి, తడి లేకుండా ఆరనివ్వాలి.
  2.  పచ్చిమిర్చిని తొడిమ దగ్గర నుంచి విడిపోకుండా నిలువుగా గాటు పెట్టుకోవాలి.
  3. నిమ్మకాయల్ని ముక్కలుగా (ఒక కాయను 8 ముక్కలు) చేసుకోవాలి.
  4.  వీటికి ఉప్పు, పసుపు బాగా కలిపి మూడు రోజుల పాటు శుభ్రమైన జాడీలో జాగ్రత్త చేయాలి.
  5. మూడో రోజు ముక్కలను కలపాలి.
  6. అలా మూడు రోజులకొకసారి చొప్పున తొమ్మిది రోజుల పాటు కలుపుతూ ఊరనివ్వాలి. ్క తొమ్మిదవ రోజు శుభ్రమైన బేసిన్‌లోకి తీసుకొని కారం, మెంతిపొడి, వెల్లుల్లి పేస్టును ముక్కలకు బాగా పట్టేలా కలిపి, రుచి చూసి ఉప్పు సరిచూసుకొని తగ్గితే సాల్ట్‌ కలుపుకోవాలి.
  7. జాడీలో పెట్టుకుని మూడు రోజుల తరువాత నుంచి వాడుకోవచ్చు.
  8. పుల్లపుల్లగా నోరూరించే నిమ్మమిర్చి ఆవకాయ రెడీ.
  • ఆవకాయ..

కావలసినవి : పచ్చిమిర్చి - 1/4 కేజీ, నిమ్మకాయలు - 6, ఆవాలు - 4 స్పూన్లు, మెంతులు - స్పూను, వెల్లుల్లి - 20 రెబ్బలు, ఉప్పు -11/2 కప్పు, కారం - 11/2 కప్పు, నూనె - 11/2కప్పు
తయారీ :

  1.  తొడిమలతో సహా ఫ్రెష్‌గా ఉన్న పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి, తడి లేకుండా ఆరనివ్వాలి.
  2.  వాటిని తొడిమ దగ్గర నుంచి విడిపోకుండా నిలువుగా గాటు పెట్టి, శుభ్రమైన బేసిన్‌లోకి తీసుకోవాలి.
  3. దోరగా వేయించి మెత్తగా మిక్సీ పట్టుకున్న ఆవాలు, మెంతుల పొడి, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కారం పచ్చిమిర్చికి పట్టేలా కలపాలి.
  4.  వడగట్టిన నిమ్మరసం, వేరుశనగ లేదా నువ్వుల నూనె కలిపి గాజు సీసాలో భద్రపరచుకోవాలి.
  5. మూడు రోజుల తర్వాత ఉప్పుకారం సరిచూసుకోవాలి.
  6.  అంతే పచ్చిమిర్చి ఆవకాయ రెడీ.