ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో ఫిజియోథెరపీ సేవలను బలోపేతం చేసేందుకు అధునాతన ఫిజియోథెరపీ పరికరాలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని జిల్లా కలెక్టర్ కృతికాశుక్లా తెలిపారు. మంగళవారం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి ఫిజియోథెరపీ బ్లాక్‌లో జెమిని ఎడిబుల్ ఆయిల్ సంస్థ సీఎస్‌ఆర్ నిధులు రూ.3.75 లక్షలతో సమకూర్చిన ఫిజియోథెరపీ నూతన పరికరాలను కలెక్టర్ కతికా శుక్లా జీజీహెచ్ వైద్య అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి రోజూ ఆరోగ్య అవసరాల నిమిత్తం వేలాదిమంది ప్రజలు వస్తుంటారని ఫిజియోథెరపీ విభాగం ద్వారా మరింత మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ఈ నూతన ఫిజియోథెరపీ పరికరాలు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఈ సదుపాయాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎముకలు విరిగిన కేసుల్లో చికిత్స చేసిన తర్వాత ఫిజయోథెరపీ సేవలతో పాటు ఫ్రోజెన్ సోల్డర్, సర్వికల్ స్పాండిలోసిస్ తదితర సమస్యలతో బాధపడుతున్న వారికి అవసరమైన ఫిజియోథెరపీ సేవలను ఈ పరికరాలతో అందించవచ్చని జీజీహెచ్ వైద్యులు తెలిపారు. కార్యక్రమంలో సీపీవో పి.త్రినాథ్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డా డి.హేమలతా దేవి, ఆర్‌ఎంవోలు డా.అనిత, డా.రాహుల్, సీఎస్‌ఆర్ ఎంవో డా.పుష్కరరావు, డా.యమున, ఫిజియోథోరపీ విభాగ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










