Nov 27,2022 06:58

  • 28న జ్యోతిబా ఫూలే 132వ వర్ధంతి

నేటికి 170 ఏళ్ల క్రితమే మనుషులందరూ సమానులేనని...దేవుడి బిడ్డల్లో కొందరు అగ్ర వర్ణాల వారు మరికొందరు నిమ్న వర్గాల వారు ఎలా అవుతారని ప్రశ్నించాడు. ఆ రోజుల్లోనే అస్పృశ్యతా నివారణ, మహిళా విముక్తి, విద్యా వ్యాప్తి కోసం కృషి చేసిన సామాజిక ఉద్యమకారుడు జ్యోతిబా ఫూలే.
      జ్యోతిరావు గోవిందరావు ఫూలే 1827 ఏప్రిల్‌ 11న మహారాష్ట్ర లోని సతారా జిల్లా ఖట్గున్‌ గ్రామంలో జన్మించాడు. నాటి పీష్వా రాజుల దగ్గర జ్యోతిరావు కుటుంబం పూలమాలలు కట్టి అమ్మే వృత్తిని కొనసాగించిన కారణంగా ఫూలే అనే పేరు వచ్చింది. వెనుకబడిన మాలి కులానికి చెందిన ఆయన...కుల కట్టుబాట్ల కారణంగా చిన్ననాటి నుంచే అవమానాలను ఎదుర్కొన్నాడు. యుక్త వయస్సులో ఒక బ్రాహ్మణ మిత్రుని పెళ్లికి హాజరైన జ్యోతిరావును పెళ్లికొడుకు బంధువులు కులం పేరుతో అవమానించి పెళ్లి ఊరేగింపు నుంచి గెంటివేశారు. ఆ అవమానంతో రగిలిపోయిన ఫూలే కులాధిపత్యాన్ని నిర్మూలించడానికి అవిశ్రాంత పోరాటం కొనసాగించాలని ప్రతినబూనాడు. భారతీయ సమాజాన్ని మానవతా విలువల పునాదులపై పునర్నిర్మించడానికి గతంలో ఎందరో మహనీయులు కృషి చేశారు. బుద్ధుడు, కబీర్‌, గురునానక్‌, రవిదాస్‌, చైతన్య, నాందేవ్‌, వేమన లాంటివారెందరో కుల వ్యవస్థను పూర్తిగా పెకిలించివేసి ప్రత్యామ్నాయ, సమతావాద సంస్కృతిని నిర్మించడానికి పాటుపడ్డారు. ఆధునిక యుగంలో ఈ ఒరవడికి మళ్లీ జీవం పోసి...విద్య వెలుగులో కుల విష వృక్షాన్ని సమూలచ్ఛేదం చేయడానికి ఉద్యమం నడిపి మహాత్ముడై నిలిచాడు జ్యోతిబా ఫూలే. శూద్రులు, అతి శూద్రులపై అగ్రవర్ణాల వారు కొనసాగిస్తున్న దురాగతాలను నిరోధించడానికి ఫూలే 1873 సెప్టెంబరు 24న సత్య శోధక్‌ సమాజ్‌ సంస్ధను స్థాపించాడు. నిమ్న వర్గాల ప్రజలను కుల దోపిడీ నుంచి విముక్తి చేయడంతోపాటు రైతులు, కూలీలను హక్కులకోసం సంఘటితపరిచేందుకు ఈ సంస్థ ద్వారా విశేష కృషి చేశాడు. విద్యాజ్ఞానాలను అందుకోవడం ద్వారానే శూద్ర, అతి శూద్రులు తమ హక్కులను నిలబెట్టుకోగలరని గుర్తించి వారిలో విద్యా వ్యాప్తి కోసం ప్రత్యేక పాఠశాలలను ఏర్పరచాడు. దళిత వర్గాల స్త్రీలకు సైతం విద్య అందాలనే ఉద్దేశంతో వారి కోసం ప్రత్యేక పాఠశాలలను ఏర్పరిచాడు. దళిత స్త్రీలకు చదువు చెప్పడానికి అగ్రవర్ణాల స్త్రీలు ముందుకు రాని పరిస్థితుల్లో తన భార్య సావిత్రీబాయికి చదువు నేర్పి, ఉపాధ్యాయినిగా తీర్చిదిద్ది ఆమె చేత దళిత స్త్రీలకు చదువు చెప్పించాడు.
       విగ్రహారాధనను, కుల వ్యవస్థను, వేదాల పవిత్రతను ప్రశ్నించాలని ఫూలే ప్రజలకు ఉద్బోధించేవాడు. మూఢాచారాలను ఖండిస్తూ ప్రజల్లో హేతువాద ధోరణులను పెంపొందింప జేయడానికి సత్య శోధక్‌ సమాజ్‌ సభ్యులు పాటుపడ్డారు. పురాణాలు, వేదాలు దైవదత్తమైనవి కావని, మనుషులు రాసినవేనని, నేటి కాలానికి అనుగుణంగా వాటిలో మార్పులు కూడా చేసుకోవచ్చని వాదించేవాడు. కొందరు స్వార్థపరుల వికృత ఆలోచనల్లోంచే కుల వ్యవస్థ ఆవిర్భవించిందని తన సభల్లో వివరించేవాడు. పక్షుల్లో, జంతువుల్లో లేని కుల భేదాలు మానవుల్లో ఎందుకున్నాయని అగ్ర వర్ణాల పండితులను ఆయన నిలదీసేవాడు.
          బొంబాయితో పాటు మహారాష్ట్ర లోని ముఖ్య పట్టణాల్లో సత్య శోధక్‌ సమాజ్‌ శాఖలను స్థాపించి ఉద్యమాన్ని విస్తృతపరిచాడు. కరపత్రాలు, సభలు, చిన్న పుస్తకాల ద్వారా సామాన్య ప్రజల్లో చైతన్యం కలిగించడానికి కృషి చేశాడు. తన భావాల వ్యాప్తి కోసం ఫూలే ఎన్నో పుస్తకాలను రాశాడు. గులాంగిరీ, సత్యార్‌, ఇషారా, సార్వజనిక్‌ సత్య ధర్మ పుస్తక్‌ అందులో ప్రముఖమైనవి. గులాంగిరీ పుస్తకంలో అమెరికా లోని బానిస వ్యవస్థకు, భారతదేశం లోని కుల వ్యవస్థకు గల పోలికలను విశదీకరించాడు. ప్రపంచంలోని పీడితులంతా ఒకే జాతి వారని, ఒకరి నుంచి మరొకరు స్ఫూర్తిని పొందుతూ ఉద్యమించాలని తెలియజెప్పాడు. బావులు, చెరువులు కూడా కులాల వారీగా చీలిపోయిన ఆ రోజుల్లో ఫూలే ఇంటి బావి నీటిని దళిత వర్గాల వారు సైతం తోడుకెళుతుండేవారు. కుల వివక్షను నిరాటంకంగా కొనసాగించడానికి అగ్రవర్ణ దురహంకారులు సృష్టించిన నిచ్చెన మెట్ల వ్యవస్థను కూలదోసి వర్ణ వ్యవస్థ బాధితులందరినీ ఐక్యం చేసి ముందుకు నడిపించిన మానవతావాది ఫూలే.
           కులం కుళ్లును ఈ గడ్డపై నుంచి పూర్తిగా తుడిచివేసి భారత జాతిని సమతా శిఖరాల ఉన్నత స్థితికి చేర్చడానికి అవిశ్రాంతంగా కొనసాగించిన పోరాటం 1890 నవంబర్‌ 28న ఆయన తనువు చాలించడంతో ఆగిపోలేదు. ఫూలే రగిలించిన సాంఘిక విప్లవ జ్వాలను ఆ తర్వాత వచ్చిన అంబేద్కర్‌ అందిపుచ్చుకుని కుల వివక్ష నిర్మూలనా పోరాటాన్ని దేశవ్యాప్త విస్తృత ఉద్యమంగా మలిచాడు. తనలో ఉద్యమ జ్వాలను రగిలించిన గురుత్రయంగా బుద్దుడు, కబీర్‌, ఫూలేలను పేర్కొంటూ బాబా సాహెబ్‌ వారిని గౌరవించేవాడు. దక్షిణాదిన పెరియార్‌ రామస్వామి...ఫూలే చూపిన బాటలో అగ్రవర్ణ దురహంకారుల ఆగడాలనెదిరిస్తూ ఆత్మగౌరవ ఉద్యమాన్ని కొనసాగించి ఎన్నో విజయాలను సాధించాడు. ఆంగ్లేయుల దాస్యం నుంచి మనం స్వేచ్ఛను పొంది డెబ్భై ఐదేళ్లు గడిచాయి. కుల వ్యవస్థ దాస్యపు సంకెళ్ల నుంచి మాత్రం ఈ జాతికి ఇంకా పూర్తి విముక్తి లభించలేదు. సరికొత్త రూపాల్లో మరింత వికృతంగా ఈ నాలుగు పడగల విషసర్పం ఇంకా బుసలు కొడుతూనే ఉన్నది. మనువాద శక్తులు నేడు మరింత బలాన్ని సంతరించుకుని రాజ్యాంగాన్నే సవాల్‌ చేస్తున్నారు. ఈ అమానవీయ మను సంస్కృతిని సమూలంగా నిర్మూలిస్తేనే ఈ దేశానికి పట్టిన పీడ విరగడై...మన దేశం ప్రపంచ దేశాల సరసన సగర్వంగా, సమున్నతంగా తలెత్తుకుని నిలబడగలదు. అందుకే నేటి కాలానికి జ్యోతిబా ఫూలే జీవన సందేశం, ఆయన బోధనల ఆవశ్యకత గతంలో కంటే మరింత ఎక్కువగా ఉన్నది !

- ఆర్‌. రాజేశమ్‌,
సెల్‌: 9440443183