మనిషి వ్యవసాయాన్ని జీవనాధారంగా ఎన్నుకున్న తర్వాత, పంటకు భూమి నుండి పోషకాలు అందుతాయని గ్రహించడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అంతేకాక పదే పదే ఒకే పంట.. లేదా వెంటవెంటనే పంటలు వేసినా భూమిలోని సారం తగ్గిపోతుందని.. దాంతో దిగుబడీ తగ్గుతుందని.. భూమికి పోషకాలను పునరుద్ధరిస్తే సారవంతమౌతుందనీ కనుగొన్నాడు. 19వ శతాబ్దంలో రసాయనశాస్త్ర పరంగా భూమిలో నత్రజని, భాస్వరం, పొటాషియం ఉంటాయని గుర్తించాడు. భూసారాన్ని పెంచడానికి కృత్రిమ ఎరువుల వాడకం జరుగుతోంది. వాటిలో భాస్వరం ఇప్పుడు మన దేశంలో ఉనికిని కోల్పోయిందని.. తద్వారా సముద్ర, నది, సరస్సులలో నీరు కలుషితమవుతుందని, వాతావరణంలోనూ కాలుష్యం చోటుచేసుకుందని అధ్యయనాలలో తేలింది. ఆ వివరాలు, భాస్వరాన్ని పునరుద్ధరించే కార్యక్రమాలను చేపట్టడం ఎలాగో తెలుసుకుందాం.

భూసారానికి మొదట చేపల అవశేషాలు, జంతు-పక్షిరెట్ట.. క్రమేపీ రసాయనిక ఎరువులు, సింథటిక్ ఎరువుల వాడకం.. 20వ శతాబ్దం మధ్యకాలంలో జరిగిన హరిత విప్లవం అధిక దిగుబడినిచ్చే పంట రకాలను, ఎరువుల వాడకాన్ని అధికం చేయడం.. క్రమంగా భూభాగంలో భాస్వరం పరిమాణం తగ్గటం... వాతావరణంలో భాస్వరం ఉనికే కనుమరుగవడంతో.. పర్యావరణ కాలుష్యంతోపాటు, జీవావరణ వ్యవస్థకూ ముప్పు వాటిల్లనుంది. భూమిలో అక్కడక్కడ ఉన్న భాస్వరం నిక్షేపాలన్నీ నీటిలో కరిగి నదులు, సరస్సులు, సముద్రాలలో ఆల్గే వేగంగా పెరుగుతోంది. దీనినే ఆల్గల్ బ్లూమ్ అంటారు. ఆల్గల్ బ్లూమ్‌లు విషపూరితమైనవి. వీటి వలన శ్వాసకోశ, వికారం, ఇతర అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి.
భౌగోళిక, రాజకీయ ఆందోళన..
నేడు, కొన్ని దేశాలలో అధిక మొత్తంలో భాస్వరం నిల్వలు ఉన్నాయి. అయితే వాటిపై ఆయా దేశాల నియంత్రణ ఉంది. దాంతో దేశాల మధ్య భౌగోళిక, రాజకీయ ఆందోళనలు కొనసాగుతున్నాయి. మొరాకో, పశ్చిమ సహారా ప్రాంతాలలో భాస్వరం.. కాడ్మియంతో కలిసి పెద్దమొత్తంలో నిల్వ ఉంది. అయితే కాడ్మియంతో ఉన్న ఎరువులు వాడినప్పుడు పంట కాడ్మియంను పీల్చుకుంటుంది. ఆహారం ద్వారా మనిషి, పశువుల శరీరంలోకి చేరి.. మూత్ర పిండాలు, గుండెకు హాని చేస్తుందని అధ్యయనాలు పేర్కొన్నాయి. కాడ్మియంను తొలగించాలంటే అధిక ఖర్చుతో కూడుకున్న పని.
ప్రస్తుతం మనదేశం ఎక్కువగానే భాస్వరాన్ని దిగుమతి చేసుకోవలసిన పరిస్థితి ఎదురైంది. భాస్వరం నిక్షేపాలను పశ్చిమ ఆఫ్రికా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. వరి, ఇతర పంటలు ఈ కాడ్మియంను శోషించుకోవడం వలన మనం అనేక వ్యాధుల బారిన పడుతున్నాం. మన దేశంలో గంగానది మిలియన్ల కొలది నివాసితులకు, చుట్టుపక్కల ప్రాంతాల పంట భూములకు ఆధారం. ఈ నదీ కలుషితమవటం వలన సమీప ప్రజల ఆరోగ్యం, పంటలకు ముప్పు కలుగుతోంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనదేశం, యూరోపియన్ దేశాలు సంయుక్తంగా రెండు ప్రాజెక్టులు చేపట్టాయి.

మురుగునీటి సేకరణ, పరిశుభ్రత, పునర్వినియోగం. దీనికోసం నిధులు సమకూర్చాయి. 'పవిత్ర' అనే స్కీము ద్వారా చెట్లు నీటిని వడబోసుకునే విధంగా ఈ ప్రాజెక్టుల ద్వారా మురుగునీటిని వనరుగా మార్చడానికి చెట్ల సహజ వడపోత శక్తిని ఉపయోగిస్తున్నామని ప్రాజెక్టు యూరోపియన్ కోఆర్డినేటర్ మిర్కో హెనెల్ అన్నారు.
ఈ ప్రాజెక్టు 2019-2024 వరకు అంటే ఐదు సంవత్సరాల పాటు నడుస్తుంది. ఇది కూడా స్థానిక పర్యావరణ, సామాజిక, ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది అంటారాయన. శుద్ధిచేసిన నీటిలోని నత్రజని, భాస్వరం వంటి పోషకాలు చెట్లు పెరగడానికి సహాయపడతాయి. మనదేశానికి చెందిన అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం ప్రాజెక్ట్ పార్టనర్‌షిప్‌లో భాగస్వామిగా ఉంది. గంగానది మురుగునీటి నుండి హానికరమైన సమ్మేళనాలను, క్రోమియంతో సహా కలుషితాలను తొలగించడానికి 'పాలిషింగ్' టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. 'ఇది మనదేశంలో మంచి ఫలితాన్నిస్తుందనీ.. ఆఫ్రికా, దక్షిణ అమెరికాల్లోనూ ఉపకరిస్తుంద'నీ పరిశోధకులు క్యాంప్లింగ్ అభిప్రాయ పడ్డారు.










