పెసలు భారతీయుల ఆహారం. మన దేశంలో పూర్వీకుల నుంచి వీటి వాడకం ఎక్కువ. ఇపుడు ప్రపంచమంతా 'మూంగ్‌దాల్' అని పిలిచే ఇష్టమైన స్నాక్ ఐటమ్ పెసలే. ప్రొటీన్లు, క్యాల్షియం, ఫాస్ఫరస్, ఇంకా కొన్ని విటమిన్లు కలిగిన మంచి పోషకాలున్న ఆహారం పెసలు. చైనాలో దీన్ని 'లుడౌ' అని పిలుస్తారు. మనకన్నా చైనా వాళ్లు వీటిని ఎక్కువ ఉపయోగిస్తారు. ఆహారంలో విష దోషాలు ఏర్పడినప్పుడు ఇది విరుగుడుగా పనిచేస్తుందని చైనీయులకు ఒక నమ్మకం. ఇంత ఆరోగ్యాల పెసలతో పులగం, దోసెలు, గారెలు, డోక్లేలు, ఇడ్లీలు, పునుగులు అబ్బో చాలా చాలానే రుచికరంగా వెరైటీలు చేసుకోవచ్చు. వీటిల్లో కొన్ని వెరైటీలను ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.
గుంట పునుగులు
కావలసిన పదార్థాలు: పెసరపప్పు - కప్పు, మినపప్పు - రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు - రుచికి సరిపడా, కొత్తిమీర తరుగు - అరకప్పు, పచ్చిమిర్చి తరుగు - 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర - టీ స్పూను, అల్లం - రెండంగుళాల ముక్క, నూనె - వేగించడానికి సరిపడా.
తయారీ విధానం: పెసరపప్పు, మినప్పప్పు కలిపి మూడు గంటలు నానబెట్టి, నీరు వడకట్టాలి. తర్వాత పప్పుల్లో అల్లం ముక్కలు వేసి గట్టిగా పేస్టు చేసుకోవాలి. ఈ పేస్టులో ఉప్పు, ఉల్లి తరుగు, జీలకర్ర, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. తర్వాత బాగా కాగిన గుంటపెనంలో కొద్దికొద్దిగా నూనె వేసీ, తడి చేత్తో పిండిని పునుకులుగా వేసి, మూతపెట్టి వేగనివ్వాలి. తర్వాత మళ్లీ తిప్పి కాసేపు వేగనివ్వాలి. ఆ తర్వాత ప్లేట్‌లోకి తీసుకుని, నిమ్మకాయ పచ్చడితో సర్వ్ చేస్తే.. ఆహా రుచి అదిరిపోతుంది.
గారెలు
కావలసిన పదార్థాలు: పెసరపప్పు - కప్పు, బియ్యప్పిండి - మూడు టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి, - మూడు, అల్లం - చిన్నముక్క, ఉల్లిపాయ - ఒకటి, కొత్తిమీర - కొద్దిగా, జీలకర్ర - ఒక టీస్పూన్, ఉప్పు - రుచికి తగినంత, బేకింగ్ సోడా - పావు టీస్పూన్
తయారీ విధానం : పెసరపప్పులో నీళ్లు పోసి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత నీళ్లు తీసేసి పప్పును మిక్సీలో వేసి మెత్తగా పట్టుకోవాలి. ఈ పప్పును ఒక బౌల్‌లోకి తీసుకుని, అందులో బియ్యప్పిండి, పచ్చిమిర్చి, దంచిన అల్లం, తరిగిన ఉల్లిపాయ, కొత్తిమీర, జీలకర్ర, తగినంత ఉప్పు, బేకింగ్ సోడా వేసి చిక్కటి మిశ్రమంలా కలుపుకోవాలి. స్టవ్‌పై పాన్ పెట్టి, నూనె పోసి వేడి అయ్యాక, మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుని గారెల్లా ఒత్తుకుంటూ నూనెలో వేసుకోవాలి. డీప్ ఫ్రై అయ్యాక తీసి సర్వ్ చేసుకోవాలి.
స్వీట్ పొంగలి
కావలసిన పదార్థాలు: పెసర పప్పు - కప్పు, బియ్యం - అరకప్పు, బెల్లం - కప్పు, యాలకుల పొడి - అర టీస్పూన్, బాదం, జీడిపప్పు, కిస్‌మిస్ - పావుకప్పు, నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు.
తయారీ విధానం : ముందుగా పెసర పప్పు, బియ్యం బాగా కడిగి నాలుగు కప్పుల నీళ్లు పోసి ప్రెషర్ కుక్కర్‌లో నాలుగు విజిల్స్ వచ్చేవరకూ ఉడికించి పెట్టుకోవాలి. పాన్‌లోని నెయ్యి వేడయ్యాక బాదం, జీడిపప్పు, కిస్‌మిస్ వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో తరిగిన బెల్లం వేసి, అర కప్పు నీళ్ళుపోసి, కరిగేంతవరకు బాగా కలుపుతూ ఉండాలి. బెల్లం పాకం మరుగుతుంటే యాలకుల పొడి, ఉడికించిన కొర్రల మిశ్రమం, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి, బాగా కలుపుకొని మరో రెండు నిమిషాలు ఉడికిస్తే వేడివేడి స్వీట్ పొంగలి రెడీ. తినేటప్పుడూ కాస్త నెయ్యి జోడించి వడ్డిస్తే అలా జారిపోతుంది.
దాల్ కచోరి
కావలసిన పదార్థాలు: గోధుమ పిండి - రెండు కప్పులు, ఉప్పు - అర టీస్పూను, నెయ్యి - పావు కప్పు.
స్టఫింగ్ కోసం: పెసరపప్పు - అర కప్పు, నెయ్యి టేబుల్ స్పూను, పసుపు - పావు టీస్పూను, కారం - అర టీస్పూను, జీలకర్ర - అరటీస్పూను, శొంఠిపొడి -అర టీస్పూను, ధనియాల పొడి - టీస్పూను, సోంపు - టీస్పూను, ఆమ్‌చూర్ పొడి - టీస్పూను, ఉప్పు - రుచికి సరిపడా, ఆయిల్ - డీప్ ఫ్రైకి సరిపడా.
తయారీ విధానం: ముందుగా పెసరపప్పుని శుభ్రంగా కడిగి రెండు గంటలపాటు నానబెట్టి, తరువాత బరకగా రుబ్బుకోవాలి. గోధుమ పిండిలో పావు కప్పు నెయ్యి, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టి అర టేబుల్ స్పూను నెయ్యి వేయాలి. వేడెక్కిన తరువాత పెసరపప్పు రుబ్బు జీలకర్ర, సొంటిపొడి, ధనియాల పొడి, సోంపు పొడి, ఆమ్‌చూర్ పొడి, పసుపు, కారం వేసి కలపాలి. నాలుగు నిమిషాలు వేగాక రుచికి సరిపడా ఉప్పు వేసి మరో ఐదు నిమిషాలు వేయించి, స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. చల్లారాక మిశ్రమాన్ని ఉండలుగా చుట్టుకుని, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని చపాతీలా వత్తుకుని మధ్యలో పెసరపప్పు ఉండ పెట్టి, పూర్తిగా కవర్ అయ్యేలా ఉండలా చుట్టుకోవాలి. ఈ ఉండని చిన్న కచోరిలా చేసి, బంగారు వర్ణంలోకి మారేంత వరకు డీప్ ఫ్రై చేస్తే దాల్ కచోరి రెడీ.
డోక్లా
కావలసిన పదార్థాలు: పొట్టు పెసరపప్పు - కప్పు, అల్లం - అంగుళన్నర ముక్క, పచ్చిమిర్చి - రెండు, కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూను, ఆయిల్ - టేబుల్ స్పూను, నిమ్మరసం - టేబుల్ స్పూను, బేకింగ్ సోడా - చిటికెడు, ఉప్పు - రుచికి సరిపడా, కొత్తిమీర తరుగు - పావు కప్పు, పచ్చికొబ్బరి తురుము -పావు కప్పు, వేయించిన నువ్వులు- టీస్పూను.
తాలింపు కోసం: ఆయిల్ - రెండు టేబుల్ స్పూన్లు, ఆవాలు - అర టీస్పూను, జీలకర్ర - అరటీస్పూను, ఇంగువ - చిటికెడు, కరివేపాకు - రెండు రెమ్మలు.
తయారీ విధానం: పెసరపప్పుని శుభ్రంగా కడిగి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి. నానిన పప్పుని నీళ్లు వంపేసి కొత్తిమీర తరుగు వేసి, బరకగా రుబ్బుకోవాలి. మందపాటి పాత్రలో రెండున్నర కప్పులు నీళ్లు పోసి, మెటల్ స్టాండ్ పెట్టాలి. ఈ స్టాండ్‌పై ఒక వెడల్పాటి పాత్రనుపెట్టి అడుగున ఆయిల్ రాయాలి. పప్పు రుబ్బులో అల్లం, పచ్చిమిర్చిని దంచి వేయాలి. కొద్దిగా ఆయిల్, నిమ్మ రసం, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. దీనిలో అరటీస్పూన్ బేకింగ్ సోడా వేసి కలిపి, ఆయిల్ రాసి పెట్టుకున్న పాత్రలో వేసి ఆవిరి మీద ఇరవై నిమిషాల పాటు ఉడికించి దించేయాలి. స్టవ్‌పై పాన్ పెట్టి, ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తరువాత ఆవాలు వేసి చిటపటలాడనిచ్చి, జీలకర్ర, ఇంగువ కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో రెండు టేబుల్‌స్పూన్లు నీళ్లుపోసి తిప్పి స్టవ్ ఆపేయాలి. ఆవిరి మీద ఉడికించిన పప్పుపైన ఈ తాలింపు వేయాలి. కొత్తిమీర తరుగు, పచ్చికొబ్బరి, నువ్వులు చల్లి, ముక్కలుగా కట్ చేస్తే.. డోక్లా రెడీ!