Sep 01,2023 07:55

200 రోజులకు యువగళం పాదయాత్ర
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి :టిడిపి అధికారంలోకొచ్చాక ఎప్పటి నుంచో గిరిజనులు సాగుచేసుకుంటున్న భూములపై చట్టంలోని నిబంధనలు అనుసరించి సాగుదారులకు శాశ్వత హక్కులు ఇస్తామని, రాజకీయ, ఉద్యోగ రంగాల్లో వారికి మెరుగైన అవకాశాలు కల్పిస్తామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్ర గురువారం ఏలూరు జిల్లా పోలవరం నియోజకర్గం కొయ్యలగూడెం మండలంలో సాగింది. లోకేష్‌ తల్లి నారా భువనేశ్వరి, నందమూరి, నారా కుటుంబ సభ్యులు పాదయాత్రలో పాల్గని లోకేష్‌తో నడిచారు. పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సీతంపేట వద్ద పైలన్‌ను ఆవిష్కరించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే టిడిపి కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తేస్తామన్న హామీతో పైలాన్‌ను ఆవిష్కరించారు. కొయ్యలగూడెంలో గిరిజనులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ.. తాను పంచాయతీ రాజ్‌ మంత్రిగా ఉండగా 500 మంది జనాభా ఉన్న తండాలను పంచాయతీలుగా గుర్తించినట్లు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకే ఉద్యోగాలు రావాలన్నది టిడిపి విధానమని, జిఒ 3ను పటిష్టంగా అమలు చేసింది టిడిపియేనని తెలిపారు. దామాషా ప్రకారం గిరిజనుల ఉపకులాలకు సబ్సిడీ రుణాలిస్తామని హామీ ఇచ్చారు. గిరిజన ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టేవారికి ప్రత్యేక రాయితీలు కల్పిస్తామని, పోలవరం నిర్వాసితులకు న్యాయం చేస్తామని అన్నారు. ఎస్‌టి సబ్‌ప్లాన్‌ నిధులు గిరిజనులకు కేటాయిస్తామని, గిరిజనులకు ఇబ్బంది లేకుండా బోయ, వాల్మీకుల సమ్యను పరిష్కరిస్తామని, గిరిజన టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తామని, ఐటిడిఎలో లేని గ్రామాలను చేర్చే అవకాశం ఉంటే నిబంధనలు మార్పుచేస్తామని హామీ ఇచ్చారు. గిరిజనులకు నాణ్యమైన ఇళ్లు కట్టించి ఇస్తామని ప్రకటించారు.