అమరావతి: తప్పుడు కేసులు బనాయించడంలో కొంతమంది పోలీసులు గిన్నిస్ బుక్‌లో స్థానం కోసం పోటీ పడుతున్నట్లుగా కనిపిస్తోందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం రొంపిచర్లకు చెందిన తెలుగు యువత ప్రధాన కార్యదర్శి గంగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డిని సోషల్ మీడియాలో పోస్టుల కేసు విచారణకంటూ తీసుకెళ్లి అక్రమ మద్యం కేసులో ఇరికించారని ఆరోపించారు.
గత నాలుగున్నరేళ్లుగా టిడిపి కార్యకర్తలు, నాయకులపై రాష్ట్రవ్యాప్తంగా 60వేల తప్పుడు కేసులు బనాయించారని లోకేశ్ మండిపడ్డారు. సైకో సీఎం కళ్లలో ఆనందం కోసం న్యాయదేవత కళ్లకు గంతలుకట్టి టిడిపి కేడర్‌ను ఇబ్బందుల పాల్జేస్తున్న కొంతమంది పోలీసులు త్వరలో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని లోకేశ్ హామీ ఇచ్చారు.