అమరావతి: సీఎం జగన్ పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ నుంచి దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు ఎంతో మంది దళితబిడ్డలు బలికాగా.. తాజాగా మరో దారుణం చోటుచేసుకుందని మండిపడ్డారు. ఈ మేరకు లోకేశ్ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల అంబేడ్కర్ కాలనీకి చెందిన దళిత యువకుడు కాండ్రు శ్యామ్‌కుమార్‌ను కొందరు దుండగులు నిర్బంధించారన్నారు. 4 గంటలపాటు చిత్రహింసలు పెట్టడమే కాకుండా దాహం వేసి మంచినీళ్లు అడిగితే సభ్యసమాజం తలదించుకునేలా మూత్రం పోసి అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి జగన్‌కు ఏమాత్రం మనస్సాక్షి ఉన్నా.. ఈ అమానవీయ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు. బాధిత దళితులకు న్యాయం చేసేందుకు ఏర్పాటైన చట్టబద్ధ సంస్థకు అధిపతి అయిన ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ బాబు ఈ ప్రభుత్వంలో నేనే బాధితుడ్ని అని వాపోవడం... జగన్ జమానాలో దళితులపై అణచివేత చర్యలకు పరాకాష్ఠ అని ఆయన దుయ్యబట్టారు.