పాలకులకు..
కండ్లు నడి నెత్తికెక్కి
చాలా కాలమే అయింది !
నియామకాల్ని
ఎన్నికల ఎజెండగ నమ్మించి
ఎనిమిదేండ్లు..
హామీల్ని నెరవేర్చనప్పుడు
ఒక్కరు కూడ కుయ్యిమనలేదు !
ఇప్పుడు..
ఓ లీకేజీ దరిద్రం జరిగాక
వింత విపక్షాలు
నిరసనలు, దీక్షల గోలచేస్తున్నరు!
స్వార్థ రాజకీయ
పరమపద 'కుర్చీ'పోరాటంలో
నిరుద్యోగుల గొంతులు
కర్కశంగ మూగబోతున్నరు !
నమ్మకం లేని పాలకపక్షం
పతార తక్కువ ప్రతిపక్షం
ప్రశ్నల్లేవ్ ! సమాధానాల్లేవ్ !!
రెండూ అల్పట దాపటే ?
సమీక్షకందని
బరితెగింపు అతిబాధాకరం !
వో లోగ్ కహతా హై
ఆప్ క్యా కరేతో కర్ లో !!
లీకేజీ..
చర్చకు అర్హతలేని ముచ్చటట!
హవ్వ! విలువలేనోళ్ళకు
విశ్వసనీయత ఎట్లుంటదంటవ్ ?
నౌకరి లేనోళ్ళ
గుండె సప్పుడెట్ల వినవడ్తదంటవ్ ?
ప్రకటనల..
అతివిశ్వాసం మొదటికే ఎసరు!
ప్రగల్భాల వ్యాఖ్యల్ని
ప్రజలెప్పుడు, ఎక్కడా హర్షించరు !!
తూకానికి నిలబడని
అనవసర అంశాల ఎంపికెందుకు?
విజ్ఞతుంటే..
ముందే జోక్కోని సూసుకోవాలె !
నిత్యదోషాలు..
జరుగుద్దంటే గతానుభవాల్ని
ఒక్కసారి జల్లెడ వట్టుకోవాలె !
మెరిగెలు, ఒలిపిళ్ళు ఏరుకోవాలె !!
పార్టీలు, నాయకులు
వగైరాలు ఏంలేవ్ ?
ఇగ ఖుల్లంఖుల్లంగ
ప్రజలు గొంతెత్తితే గానీ
ప్రజాస్వామ్యం వర్ధిల్లేటట్లు లేదు !
అశోక్ అవారి
90005 76581