
ప్రజల శాస్త్రవేత్తగా పేరొందిన డాక్టర్ యలవర్తి నాయుడమ్మ శాస్త్ర సాంకేతిక రంగంలో మన దేశానికి...మరీ ముఖ్యంగా తెలుగు జాతికి...ఎనలేని ఖ్యాతిని ఆర్జించి పెట్టారు. గుంటూరు జిల్లా యలవర్రు గ్రామంలో ఓ సామాన్య రైతు కుటుంబంలో 1922 సెప్టెంబరు 10న జన్మించారు. 1943లో కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో రసాయన టెక్నాలజీలో ఉన్నత విద్యనభ్యసించి, మద్రాసు చర్మ టెక్నాలజీ సంస్థలో ప్రత్యేక విద్యను అభ్యసించారు. అదే సంస్థలో అంచెలంచెలుగా ఎదిగి డైరెక్టరు అయ్యారు. ఆయన ఆధ్వర్యంలో చర్మ పరిశోధనా సంస్థ అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది.
అమెరికాలో చర్మాన్ని పరిశుభ్రం చేసే పరిశ్రమలో పరిశోధనలు చేసి, అద్భుత విజయాలను సాధించారు. తిరిగి మాతృ దేశానికి వచ్చి, 1951లో సెంట్రల్ లెదర్ రీసెర్చ్ యూనివర్సిటీలో శాస్త్రవేత్తగా చేరారు. నూతన లాభదాయక ప్రణాళికలను రూపొందించి చర్మకార పరిశ్రమను అభివృద్ధి చేశారు. కేంద్ర చర్మ పరిశోధనా సంస్థను సాటిలేని పరిశోధనా సంస్థగా రూపొందించారు. ఈ సంస్థ జాతీయ స్థాయికి ఎదిగి పారిశ్రామిక అభివృద్ధి లోనూ, గ్రామీణ అభివృద్ధి లోనూ గణనీయమైన పాత్ర పోషించింది. 1956లో అదే సంస్థకు డైరక్టర్‌గా పదోన్నతి పొందారు.
ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ, ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇండియన్ స్టాండర్డ్ ఇన్‌స్టిట్యూట్ సంస్థల ఫెలోషిప్ లను 1975లో అందుకున్నారు. దేశ, విదేశ ప్రఖ్యాత సంస్థలలో గౌరవ సభ్యత్వాన్ని అందుకున్నారు. అమెరికన్ లెదర్ కెమిస్ట్స్ అసోసియేషన్, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్‌లెదర్ ట్రేడ్ కెమిస్ట్స్, సొసైటీ ఆఫ్ లెదర్ ట్రేడ్ కెమిస్ట్స్ (బ్రిటన్) మొదలగు సంస్థలలో గౌరవ సభ్యులుగా ఉన్నారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమిస్ట్స్, అసోషియేషన్ ఆఫ్ లెదర్ కెమిస్ట్స్ మొదలగు ప్రసిద్ధి చెందిన సంస్థలకు అధ్యక్షులుగా వ్యవహరించారు.
నాయుడమ్మ పరిశోధనా కృషి ఫలితంగా మన దేశపు చర్మ తయారీ వస్తువులకు విదేశాలలో విశేషమైన ఆదరణ, గిరాకీ ఏర్పడ్డాయి. అలీన దేశాలకు, ఇతర దేశాలకు మధ్య స్నేహ వారధిగా నాయుడమ్మ ప్రఖ్యాతిగాంచారు. ప్రారంభం నుంచి ఆయనకు మద్రాసు సి.ఆర్.ఆర్.ఐ తో సన్నిహిత సంబంధాలు వుండేవి. దాని అభివృద్ధికి అహర్నిశలు శ్రమించారు. సంస్థ లోని వివిధ ప్రయోగశాలలకు నూతన రూపురేఖలు దిద్దారు. నూతన లాబరేటరీలకు ప్రణాళికలు వేసి, డిజైన్ రూపకల్పన చేసి వాటి స్థాపనకు కృషి చేశారు. అత్యాధునిక శైలిలో తోళ్ళ పదునుకు, శుద్ధికి పైలట్ ప్లాంట్లను దేశ స్థాయిలో తొలిసాగిగా నెలకొల్పడానికి దోహదపడ్డారు. ''లెదర్ సైన్స్'' మాస పత్రికకు చాలాకాలం సంపాదకులుగా ఉన్నారు. ఐక్యరాజ్యసమితి సలహాదారుగా పలు ఆఫ్రికా దేశాలలో తోళ్ళ పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడ్డారు.
ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్‌గా (1981-82), భారత శాస్త్ర సాంకేతిక పరిశోధనా సంస్థకు డైరెక్టరు జనరల్‌గా పని చేశారు. 1965లో ఎం.ఎస్.యూనివర్సిటీ (వడోదర) వారు డాక్టర్ కె.జి.నాయక్ గోల్డ్ మెడల్ ప్రదానం చేశారు. 1971లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారం, రాజాలక్ష్ష్మి సంస్థ నుండి శ్రీ రాజాలక్ష్మి పురస్కారం పొందారు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ శాస్త్ర సంస్థలలో సభ్యులుగా ఉన్నారు. 1986 నుండి ప్రఖ్యాత శాస్త్రవేత్త నాయుడమ్మ సంస్మరణార్థం స్థాపించిన అవార్డును సైన్స్, టెక్నాలజీ, రంగాలలో అపూర్వ ప్రతిభను చూపిన వారికి ప్రతి సంవత్సరం అందిస్తున్నారు.
- డా|| తన్నీరు కళ్యాణ్ కుమార్,
తెలుగు లెక్చరర్, తెనాలి.
(నేడు డా|| నాయుడమ్మ శత జయంతి)