Nov 08,2022 17:51

ఇంటర్నెట్‌డెస్క్‌ : చలికాలంలో న్యూమోనియోతో బాధపడేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ కాలంలో.. న్యూమోనియో సమస్య ఉన్నవారు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా చిన్నారులు ఎక్కువగా బాధపడతారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో మన దేశంలో ఐదేళ్లలోపు చిన్నారులు మృతి చెందడం చాలా సాధారణ విషయమని డా.రాజీవ్‌ ఛబ్రా తెలిపారు. బ్యాక్టీరియా, వైరల్‌ ఇన్ఫెక్షన్‌ల వల్ల న్యూమోనియా వచ్చినా.. అపరిశుభ్రత, వాయు కాలుష్యం, సరైన పోషకాహారం లేకపోవడం వంటి కారణాల వల్ల కూడా.. చిన్నారులకు న్యూమోనియా వస్తుంది. ఈ సమస్య ఉన్న చిన్నారులు, జ్వరంతో బాధపడినా, శ్వాసతీసుకోవడం ఇబ్బంది పడినా, ఆహారం సరిగ్గా తీసుకోకపోయినా, చిరాకుగా ఏడుస్తున్నా వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. సమస్య తీవ్రం కాకముందే. వైద్యుల సలహామేరకు చికిత్స తీసుకుంటే ప్రమాదం ఉండదు. ఆలస్యం జరిగితే.. యాంటీబాయాటిక్స్‌ ద్వారా చికిత్స నందించాల్సి ఉంటుందని డా. ఛబ్రా అంటున్నారు.

- 60 ఏళ్లు పైబడిన వారందరూ ఫ్లూ వ్యాక్సిన్‌లు వేయించుకోవాలి. అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు కూడా వ్యాక్సిన్‌లు తీసుకోవడం తప్పనిసరి.
- ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడేవారు వైద్యుల సలహామేరకు క్రమం తప్పకుండా ఇన్హేలర్లతో డోసుల ప్రకారం మందులు తీసుకోవాలి
- చలికాలంలో.. చిన్నారుల్ని బయట ప్రదేశాల్లో ఆడుకోనివ్వకూడదు. నోటికి, ముక్కుకి, చల్లగాలి తగలకుండా.. గుడ్డను అడ్డుపెట్టుకోవాలి.
- న్యూమోనియాతో బాధపడేవారు వేడిఆహారమే తీసుకోవాలి. కాచిన నీరే తాగాలి. శరీరానికి వెచ్చగా ఉండే దుస్తుల్నే ధరించాలి.
- బిపి, షుగర్‌ కంట్రోల్‌లో లేకపోతే త్వరగా.. ఛాతి ఇన్ఫెక్షన్‌లకు గురవుతారు. అందుకే బిపి, షుగర్‌లు నియంత్రణలో ఉండేలా మందులు తీసుకోవాలి.
- చిన్నారులకు స్కూల్‌లో, ఇంట్లోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లోకి పిల్లలను తీసుకెళ్లకూడదు. జలుబు, దగ్గుతో బాధపడేవారికి చిన్నారుల్ని దూరంగా ఉంచాలి.