
ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు దిగివచ్చి తన ప్రభుత్వం తలపెట్టిన న్యాయ సంస్కరణల్ని తాత్కాలికంగా నిలుపుదల చెయ్యడం అక్కడి ప్రజా ఉద్యమ విజయం. న్యాయ సంస్కరణల పేరుతో ఆయన న్యాయ పాలికను గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నం చేశారు. న్యాయ మూర్తుల నియామకం, కార్యనిర్వాహక వ్యవస్థ పైచేయిగా ఉండేలా మార్పులు, ప్రధానిని అవినీతి కేసుల్లో విచారించే అవకాశం లేకుండా చెయ్యడం లాంటి నిర్ణయాలతో శాసనాన్ని అమలుచేయాలని భావించారు. వీటిపై స్వంత కేబినెట్ లోనే విమర్శలు రాగా, ఒక మంత్రిని ఉద్వాసన పలికారు. అయితే వేలాదిమంది పౌరులు ఉద్యమాన్ని వీధుల్లోకి తీసుకువచ్చి, ఉధృతం చేశారు. కార్మిక సంఘాలు, పౌరులు ఈ ప్రతిపాదనల్ని ప్రభుత్వం విరమించక పొతే ఉద్యమ తీవ్రత పెంచనున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు అంతర్జాతీయ సమాజం నుండి ఉద్యమానికి మద్దతుగా, ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఒత్తిడి పెరగసాగింది. ప్రధాని నెతన్యాహు వెనకడుగు వేసి తాత్కాలికంగా న్యాయ సంస్కరణల ప్రయత్నాలను ఆపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇలా శాసన వ్యవస్థకు, న్యాయ వ్యవస్థకు నడుమ అధికారంలో పైచేయి కోసం ప్రయత్నాలు పలు దేశాల్లో జరుగుతున్నాయి. మన దేశంలో కూడా ఇంతకూ ముందు కన్నా ఇప్పుడు ఈ రెండు వ్యవస్థల నడుమ దూరం పెరిగింది. ఒకదానిపై ఒకటి విమర్శించుకోవడం సాధారణమై పోయింది. ప్రజాస్వామ్యపు ఆరోగ్యానికి రెండు వ్యవస్థలూ సమానాధికారంతో ఉండడం అవసరం. ఒక దానికి ఇంకొకటి చెక్‌గా ఉండాలి. ప్రజాస్వామ్య విధానాన్ని ఇష్టపడేవారు ఆ బ్యాలెన్స్ తప్పే పరిస్థితులు రానివ్వరాదు.
- డా. డి.వి.జి.శంకరరావు,
మాజీ ఎంపీ, పార్వతీపురం.