Dec 27,2022 07:37

సామాజిక పెన్షన్లలో పెద్ద ఎత్తున కోత పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమౌతోందన్న వార్తలు కలవరం సృష్టిస్తున్నాయి. పింఛనుదారుల్లో తీవ్ర ఆందోళనకు దారి తీస్తున్నాయి. జనవరి నుండి కొత్తవారికి కూడా ఇస్తామని చెబుతున్న ప్రభుత్వం, అదే సమయంలో ప్రస్తుతం ఇస్తున్న వారికి ఊడబెరకడానికి సిద్ధపడటంలో మతలబేంటో అర్ధం కాదు. పోనీ, అనర్హులను నిజంగా గుర్తించి, ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నారా అంటే అదీ లేదు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్ల్లాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం అనర్హతా నోటీసులు అందుకున్న వారిలో అత్యధికులు పోషణ కోసం ఇతరుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడిన వారే ! ప్రభుత్వం ప్రతి నెలా ఇస్తున్న కొద్దిపాటి మొత్తంతో వారి జీవనమంతా సాగిపోదు. కానీ, వేన్నీళ్లకు చన్నీళ్లలా కొంత మేర ఊరట కలిగిస్తుంది. గత ఎన్నికల ముందు ప్రతిపక్షనేతగా వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ కూడా అదే! కానీ, ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు దానికి అనుగుణంగా లేవు. 'అవ్వా తాతల పింఛను పెంచుకుంటూ పోతాం...' అని చెప్పిన ఆయన అసలుకే ఎసరు పెట్టే చర్యలు చేపడతారని లబ్ధిదారులు ఊహించలేకపోయారు. అందుకే, పెన్షన్ల కోత విషయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఏ ఇతర చర్యల కన్నా చర్చనీయాంశంగా మారింది.
           ప్రస్తుతం పెన్షన్‌ అందుకుంటున్న వారిలో రాష్ట్ర వ్యాప్తంగా 1.50 లక్షల మందికి పైగా లబ్ధిదారులను ప్రభుత్వం ఇప్పటికే అనర్హులుగా గుర్తించినట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ అన్ని జిల్లాల్లో అందుతున్న అనర్హతా నోటీసులు ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో 12,500 మందిని అనర్హులుగా తేల్చినట్లు సమాచారం. అనంతపురం జిల్లాలో 12 వేల మందికిపైగా, సత్యసాయి జిల్లాలో 8,500 మందికిపైగా గుంటూరు, పల్నాడు జిల్లాల్లోనే 16 వేల మందికిపైగా అనర్హతా నోటీసులు అందినట్లు సమాచారం. ప్రతి జిల్లాలోనూ కనీసం 7 వేల మందిపైన వేటు వేయడానికి రంగం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. వీరందరు ఎవరు? వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, అక్కడక్కడ కొందరు కళాకారులు! కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో, రేషన్‌ కార్డులో పేర్లున్న వారిలో ఎవరో ఒకరికి ఆదాయం ఎక్కువగా ఉందనో, నాలుగు చక్రాల వాహనం ఉందనో వీరిని లబ్ధిదారుల జాబితా నుండి తొలగించడం ఎంత దారుణం? ఏ దిక్కు లేకుండా అనాథలుగా ఉంటేనే పెన్షన్‌ ఇస్తామని ప్రభుత్వం చెబుతోందా? పోనీ, ప్రభుత్వం చేసిన నిర్ధారణలైనా ఖచ్చితంగా ఉన్నాయా అంటే అదీ లేదు. తప్పుల తడికలుగా చేసిన అనేక సర్వేలే తాజా అనర్హుల జాబితాకు ఆధారమని ఆరోపణలు వస్తున్నాయి. అదే నిజమైతే సామాజిక పెన్షన్లు ఇవ్వడంలోని అసలు లక్ష్యమే దెబ్బతింటుంది.
          ప్రభుత్వం లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలి. క్షేత్రస్థాయి దాకా ఉన్న వాలంటీర్ల వ్యవస్థను వినియోగించుకుంటూ గ్రామ, వార్డు స్థాయిలో సభలు నిర్వహించాలి. స్థానిక సంస్థల ప్రతినిధులతో పాటు, ప్రజలను, పార్టీలను, వివిధ ప్రజాసంఘాలను భాగస్వాములను చేస్తూ సభలు నిర్వహించాలి. ఆ సభలలోనే లబ్ధిదారులను గుర్తించాలి. అర్హులకు ఏ మాత్రం నష్టం జరగకుండా చూడాలి. అంతవరకు అనర్హుల పేరుతో పెన్షన్ల నిలిపివేత నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలి. కరోనా కష్టకాలంలో పెన్షన్లతో పాటు ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలు ప్రజలకు ఎంతో కొంత ఊరటనిచ్చాయి. ఇప్పటికీ, ఆ సంక్షోభ కాలం పూర్తిగా ముగిసిపోలేదు. అనేక కుటుంబాలు ఆర్థిక సంక్షోభం నుండి ఇంకా బయటపడనే లేదు. ఈ పరిస్థితుల్లో పెన్షన్ల భారాన్ని తగ్గించుకోవాలన్న పేరిట ప్రభుత్వం ఇలా చేయడం ఏమాత్రం సబబు కాదు! మ్యానిఫెస్టోలో పేర్కొన్నట్లు సాధ్యమైనంత త్వరగా మూడు వేల రూపాయలకు పెన్షన్‌ మొత్తాన్ని పెంచడంతో పాటు, లబ్ధిదారుల పరిధిలోకి మరిన్ని కుటుంబాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలి. అప్పుడే ప్రజానీకానికి పూర్తి స్థాయిలో ఊరట లభిస్తుంది.