
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఉద్యోగ, ఉపాధ్యాయుల హక్కుల విషయంలో...ఒకే పద్ధతిని అవలంభిస్తున్నాయనేది అర్థంచేసుకోవాలి. ఏ రాష్ట్రమైనా సిపిఎస్‌ని రద్దు చేసి ఓపిఎస్ లోకి వెళితే ఇప్పటికే ఎన్.ఎస్.డి.ఎల్ లో దాచుకున్న సొమ్ము ఒక్క రూపాయి కూడా తిరిగి చెల్లించమని స్వయానా కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన విషయాన్ని మనం మర్చిపోకూడదు. మన పోరాటం పి.ఎఫ్ ఆర్.డి.ఏ చట్టాన్ని రద్దు చేయించుకునే వైపు వుండాలి. మన అడుగులు పాత పెన్షన్‌ని పునరుద్ధరించుకునే వైపు ఉండాలి.
'పెన్షన్ ఉద్యోగి హక్కు, యజమాని దయాదాక్షిణ్యాల మీద ఇచ్చే భిక్ష కాదు. ఉద్యోగి సమర్థవంతంగా పని చేసిన సర్వీస్‌కు రావలసిన ప్రతిఫలం పెన్షన్. వృద్ధాప్య దశలో నిస్సహాయంగా వదిలేయకుండా ఇచ్చే హామీ. ఒక సామాజిక భద్రతా చర్య' అని 1982లో డి.ఎస్.నకారా వర్సెస్ ది యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో అప్పటి చీఫ్ జస్టిస్ వై.వి. చంద్రచూడ్ ఇచ్చిన తీర్పు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ దేశంలో పర్మనెంట్ ఉద్యోగాల్లో పని చేస్తున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్ ఇవ్వటం ప్రభుత్వం బాధ్యత. దీనిలో ఎలాంటి మినహాయింపులు లేవు. ఆర్థిక కారణాలను సాకుగా చూపి, నిధుల లేమి అని చెప్పి పెన్షన్ నిరాకరించటం సుప్రీంకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకం. ఒంట్లో శక్తి ఉన్నప్పుడు పనిచేయించుకుని వృద్ధాప్యం వచ్చిన తర్వాత తల్లిదండ్రులు భారమని, తన ఆర్థిక పరిస్థితి సరిగా లేదని వారిని ఇంటి నుంచి బయటికి గెంటేయటం న్యాయబద్ధమైనదా? బ్యాంకు నుంచి అప్పులు తీసుకుంటున్న వారు సరిగా చెల్లించలేకపోతే పారుబకాయిల పేరుతో ప్రతి సంవత్సరం కొన్ని లక్షల కోట్లు రాయితీలు ప్రభుత్వాలు ఇస్తున్నాయి. కాని ఆర్థిక పరిస్థితి బాగాలేదన్న విషయం పెన్షన్ ఇచ్చేటప్పుడు గుర్తురావడం సరికాదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పెన్షన్ ఉద్యోగుల హక్కు. దీనిపై ఎలాంటి చర్చ ఉండకూడదనేది ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల దృఢమైన అభిప్రాయం.
పెన్షన్ సంస్కరణలు ఎందుకు ?
దేశంలో నూతన ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చిన తర్వాత అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ పెన్షన్‌పై ''వర్కింగ్ పేపర్ ఆన్ పెన్షన్ రిపోర్ట్ ఇన్ ఇండియా'' అనే డాక్యుమెంట్‌ని 2001లో తయారు చేసింది. దీనికనుగుణంగా 2002లో అప్పటి కేంద్ర ప్రభుత్వం బి.కె.భట్టాచార్య కమిటీని నియమించింది. 2003 అక్టోబర్‌లో నూతన పెన్షన్ పథకం నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ ద్వారా తాత్కాలిక పి.ఎఫ్ ఆర్.డి.ఎ ను ప్రకటించింది. 2003 డిసెంబర్ 22న అప్పటి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో విధాన ప్రకటన చేసింది. 2004 జనవరి ఒకటి నుంచి న్యూ పెన్షన్ స్కీమ్ (కంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్-సిపిఎస్) అమలు లోకి వచ్చింది. మన రాష్ట్రంలో సెప్టెంబర్ 2004 నుండి అమలులోకి వచ్చింది. పెన్షన్ ఫండులో కొన్ని లక్షల కోట్ల రూపాయల మదుపుని ప్రపంచ బ్యాంకు ద్రవ్యనిధి సంస్థ గమనించింది. ప్రభుత్వం ప్రజలకు, ఉద్యోగులకు ఇచ్చే సౌకర్యాలలో కోత విధించి, ప్రతి దానిని ప్రజలు కొనుగోలు చేయాలని, ఉచితంగా ఏదీ ఇవ్వకూడదనే సూత్రం అమలులో భాగంగానే ఈ పెన్షన్ సంస్కరణలు అమలులోకి వచ్చాయి. సంక్షేమ రాజ్యం స్థానంలో క్రయవిక్రయాల సరుకు పద్ధతులు ముందుకొచ్చిన తర్వాత ప్రతిదీ భారంగానే మారుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇచ్చేటప్పుడు ఆర్థిక పరిస్థితి గుర్తుకు రాకపోవడం. ఆర్థిక సంస్కరణలలో భాగంగా వచ్చిన ఈ పెన్షన్ సంస్కరణలను తిప్పికొట్టాలంటే ఆర్థిక సంస్కరణల మీద కూడా పోరాటం చేయాల్సి ఉంటుంది.
పాత పెన్షన్ హామీ
ఇదేదో కాకతాళీయంగా ఇచ్చిన హామీ కాదు. 2004 నుంచి దేశవ్యాప్తంగా పాత పెన్షన్‌ని పునరుద్ధరించాలని, సిపిఎస్ రద్దు చేయాలని ఎనిమిది జాతీయ సమ్మెలు జరిగాయి. దీంట్లో లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయులు, ఉద్యోగులు వివిధ పోరాటాల రూపంలో పాత పెన్షన్ కావాలి, రాజకీయ నాయకులకు పెన్షన్-మాకేమో టెన్షన్, కార్పొరేట్లకు లాభం చేసే సి.పి.ఎస్ వద్దు, ఒకటే పెన్షన్-ఒకటే సర్వీస్ అనే నినాదాలతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు, బైక్ యాత్రలు, చలో విజయవాడ కార్యక్రమాలు పెద్దఎత్తున నిర్వహించారు. 2008 ఫిబ్రవరి 28న జరిగిన సార్వత్రిక సమ్మెలో పాల్గొన్నందుకు ఉపాధ్యాయులకు, ప్రత్యేకించి యుటిఎఫ్ నాయకులకు 2 సంవత్సరాల ఇంక్రిమెంట్ రాలేదు. 2019 ఎన్నికలకు ముందు ఇదొక రాజకీయ ఎజెండాగా ముందుకు వచ్చింది. ఇలా రాజకీయ ఎజెండాగా మార్చడంలో రాష్ట్ర ఉపాధ్యాయ ఉద్యమం క్రియాశీలక పాత్ర పోషించింది. అనివార్యంగా ఆ రోజు అధికార పార్టీ కానీ, ప్రతిపక్ష పార్టీలు గాని పాత పెన్షన్ లేదా మెరుగైన పెన్షన్ ఏదోఒకటి ఇస్తామని చెప్పాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 2019 ఎన్నికలకు ముందు అధికారంలో ఉన్న పార్టీ టక్కర్ కమిషన్‌ను నియమించి కొంత చర్చ కూడా జరపాల్సిన పరిస్థితి ఈ ఉద్యమం వల్లే ఏర్పడింది.
సి.పి.ఎస్ - జి.పి.ఎస్ - ఓ.పి.ఎస్ ఏది మెరుగు ?
సిపిఎస్ లో ఉద్యోగి 10 శాతం కంట్రిబ్యూషన్, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం కంట్రిబ్యూషన్, రిటైర్‌మెంట్ తర్వాత ఎంత పెన్షన్ వస్తుందో గ్యారెంటీ లేదు. షేర్ మార్కెట్ల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి పెన్షన్ ఉంటుంది. ఉద్యోగి మరణిస్తే మాత్రమే ఫ్యామిలీకి పెన్షన్ వస్తుంది.
జి.పి.ఎస్ లో 10 శాతం ఉద్యోగి కంట్రిబ్యూషన్, ప్రభుత్వం కంట్రిబ్యూషన్ ఎంత ఇస్తుందో స్పష్టత లేదు. డి.ఆర్ చెల్లిస్తారు. కమ్యుటేషన్, గ్రాట్యుటి, హెల్త్ కార్డుల ప్రస్తావన లేదు. 10 శాతం కంట్రిబ్యూషన్‌లో ఏమైనా సొమ్ముని కొంత డ్రా చేస్తే 50 శాతం పెన్షన్ వస్తుందన్నారుగాని దానిమీద స్పష్టత లేదు.
ఓ.పి.ఎస్ లో ఉద్యోగి ఎలాంటి కంట్రిబ్యూషన్ చెల్లించాల్సిన పనిలేదు. ఉద్యోగ విరమణ నాటికి ఉన్న బేసిక్ పేలో 50 శాతం గ్యారెంటీ పెన్షన్, కమ్యుటేషన్, గ్రాట్యుటి, పి.ఎఫ్., హెల్త్ కార్డ్స్, ఉద్యోగికి పెన్షన్, చనిపోతే ఫ్యామిలీకి పెన్షన్ గ్యారెంటీ. 70 సంవత్సరాల వయసు దాటిన తర్వాత అదనపు పెన్షన్ మంజూరు చేస్తారు. పి.ఎఫ్.లో దాచుకొనే అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో ఉంటుంది. 10 శాతం రాష్ట్ర ప్రభుత్వం, 10 శాతం ఉద్యోగి చెల్లించే అమౌంట్ మన రాష్ట్ర ఖజానా లోకి రాదు. షేర్ మార్కెట్ మాయాజాలం లోకి వెళ్లిపోతుంది. సిపిఎస్, జిపిఎస్ ఏదైనా ఉద్యోగులకు ప్రభుత్వానికి లాభం లేదని, పాత పెన్షన్ విధానమే ఉద్యోగులకు ప్రభుత్వానికి లాభమని తెలుస్తుంది.
ప్రశ్నలు ఎన్నో...
2013 సెప్టెంబర్ 4 నుండి అమలులోకి వచ్చిన పి.ఎఫ్ ఆర్.డి.ఏ చట్టంలో మార్పులు చేయకుండా సిపిఎస్ నుంచి జిపిఎస్ లోకి రావచ్చా? ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న చట్టానికి భవిష్యత్తులో చట్టబద్ధత ఉంటుందా? ఇప్పటికీ ఎన్.ఎస్.డి.ఎల్.లో కుదవ పెట్టిన రూ.7000 కోట్ల పైచిలుకు అమౌంట్ పరిస్థితి ఏమిటి? 2004కి ముందు నియామక ప్రక్రియ పూర్తయి 2004 తర్వాత ఉద్యోగం పొందిన వారికి పాత పెన్షన్ అమలు చేస్తారా? 2019లో ప్రభుత్వాలు 14 శాతం పెంచాలని చెప్పిన ఉత్తర్వులు అమలు కావా? ఉద్యోగులకు, ప్రభుత్వానికి లాభం చేకూర్చే పాత పెన్షన్ మీద చర్చ ఎందుకు జరపటంలేదు? సామాజిక బాధ్యతగా ఇచ్చే పెన్షన్‌ని ఆర్థిక పరిస్థితితో ముడిపెట్టడం తగునా? వంటి అనేక ప్రశ్నలకు జవాబులేవి !
ఎవరి పరిధి ?
సిపిఎస్ ను ఎవరు రద్దు చేయాలి? రాష్ట్రమా, కేంద్రమా? కేంద్రాన్ని ఒక్క మాట అనకుండా రాష్ట్రం మీదే పోరాటం చేయాలని చెప్పేవారు ...రాష్ట్రం చేతిలో ఏమీ లేదు కేంద్రమే చేయాలని, కేంద్రం మీదే పోరాడాలని చెప్పేవారు వున్నారు. ఈ సిపిఎస్ విధానాన్ని పి.ఎఫ్.ఆర్.డి.ఏ చట్టానికి అనుగుణంగా తీసుకొచ్చారు. రెండోది పి.ఎఫ్.ఆర్.డి.ఏ చట్టం చేయడానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాయి. రాజకీయాల కోసం ఒక పక్షంతో మరో పక్షం ఘర్షణ పడినట్లు అన్పించినా ఉద్యోగుల హక్కులను హరించే సందర్భంలో ఈ పార్టీలన్నీ ఒకటిగానే వ్యవహరిస్తాయని అర్ధమవుతుంది. వామపక్ష పార్టీలు మాత్రం పి.ఎఫ్.ఆర్.డి.ఏ చట్టానికి వ్యతిరేకంగా ఓటు వేసి ఉద్యోగుల పక్షాన నిలిచాయి. కనుక పి.ఎఫ్.ఆర్.డి.ఏ చట్టం రద్దు కాకుండా సి.పి.ఎస్. రద్దు కాదు. ఇప్పుడు కేంద్రమా, రాష్ట్రమా అని ఘర్షణపడి అసలు సిపిఎస్ రద్దు పోరాటాన్ని బలహీనపరుచుకొనే దానికంటే...కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఉద్యోగ, ఉపాధ్యాయుల హక్కుల విషయంలో...ఒకే పద్ధతిని అవలంభిస్తున్నాయనేది అర్థంచేసుకోవాలి. ఏ రాష్ట్రమైనా సిపిఎస్‌ని రద్దు చేసి ఓపిఎస్ లోకి వెళితే ఇప్పటికే ఎన్.ఎస్.డి.ఎల్ లో దాచుకున్న సొమ్ము ఒక్క రూపాయి కూడా తిరిగి చెల్లించమని స్వయానా కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన విషయాన్ని మనం మర్చిపోకూడదు. మన పోరాటం పి.ఎఫ్ ఆర్.డి.ఏ చట్టాన్ని రద్దు చేయించుకునే వైపు వుండాలి. మన అడుగులు పాత పెన్షన్‌ని పునరుద్ధరించుకునే వైపు ఉండాలి.
పోరాటాల ఫలితమే
పాత పెన్షన్ కావాలి.. సిపిఎస్ వద్దు.. అని పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల కంటే, ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన పోరాటాలు దేశానికి దిక్సూచిగా మారాయి. మిగిలిన రాష్ట్రాల్లో కూడా సిపిఎస్ రద్దు కోసం పోరాటాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే పంజాబ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, అస్సాం, ఒరిస్సా లాంటి రాష్ట్రాలు సిపిఎస్ రద్దు కోసం ముందుకు వచ్చాయి. మరికొన్ని రాష్ట్రాలు సిపిఎస్ రద్దు చేస్తామని చెప్తున్నాయి. వీటన్నిటి ఫలితంగా ఈరోజు సిపిఎస్ రద్దయి పాత పెన్షన్ అనివార్యంగా పునరుద్ధరణ చేయాల్సిన పరిస్థితులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పాత పెన్షన్ వైపు ఉద్యోగులను వెళ్లనీయకుండా మెరుగైన విధానం అని, గ్యారెంటీ విధానమని జిపిఎస్‌ని ముందుకు తీసుకువచ్చి రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం పెన్షన్ గ్యారెంటీ అంటే...కేంద్ర ప్రభుత్వం 40 శాతం పెన్షన్ ఇస్తామని చెబుతున్నది. పోరాటాల ఫలితంగానే అసలు 20 శాతం మించి రాని పెన్షన్ నుండి 50 శాతం ఇస్తామని ముందుకు వస్తున్నారు. గతంకంటే మెరుగైనది కదా...దీనిని తీసుకుని తర్వాత మరొక డిమాండ్ పెట్టొచ్చుకదా అని సన్నాయి నొక్కులు నొక్కే వాళ్లు కూడా వున్నారు. అందుకని పాత పెన్షన్ తప్ప మరే పెన్షన్ వద్దనే నినాదాన్ని చేపట్టి మన పోరాటాన్ని ముందుకు తీసుకుపోవాలి.
పోరాటమే మార్గం
రాష్ట్ర ఉపాధ్యాయ ఉద్యమ చరిత్రలో, ఆ మాటకొస్తే ఏ రంగం యొక్క ఉద్యమ చరిత్ర చూసినా పోరాటం ద్వారా సాధించున్న హక్కులు దీర్ఘ కాలం నిలబడతాయి. సంఘాల అంతిమ లక్ష్యం పాత పెన్షన్ విధానం సాధించేదిగా ఉండాలి. పోరాటం పాలకుల విధానాలకు వ్యతిరేకంగా ఉండాలి. సంఘాలు పరస్పరం శత్రువులుగా చూసుకునే వైఖరిని విడనాడాలి. మా సమస్య మేమే పరిష్కరించుకుంటామనే మాటలతో ఉపయోగం లేదు. చరిత్రలో ఎవరూ ఎవరి సమస్యలు వారే పరిష్కరించుకోలేదు. అందరూ కలిస్తేనే ఏ సమస్య అయినా పరిష్కారమైందనే స్పృహ ఉండాలి. దిగువ స్థాయి నుంచి ఉద్యోగులు కదలాలి. పాత పెన్షన్ సాధనకు ఐక్య ఉద్యమాలను రూపొందించుకోవాలి.
/ వ్యాసకర్త యు.టి.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు /
నక్కా వెంకటేశ్వర్లు