Nov 11,2022 06:50

వృద్ధులు, ఆధారం లేని వారికేనా సామాజిక న్యాయం, పెన్షన్‌ ? వీధుల్లో తిరిగే ఆవులకూ ఇవ్వాలి కదా ! అంటున్నారు గుజరాత్‌లోని పాలకపార్టీల నేతలు. డిసెంబరులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మనుషులతో పాటు ఆవులూ పార్టీలను ప్రభావితం చేస్తాయా అని కొందరు చర్చ చేస్తున్నారు. వట్టిపోయిన (పాలివ్వని) ఆవులను గతంలో రైతులు వధశాలలకు తరలించే వారు. కొంత రాబడి వచ్చేది. కాషాయ మూకలు గో రాజకీయాలను రంగంలోకి తెచ్చిన తరువాత అలాంటి ఆవులను అమ్ముకోలేరు. గో గూండాల దాడులకు భయపడి కొనుగోలు చేసేవారూ లేరు. దాంతో రైతులు వాటిని మేపే స్తోమత లేకనో, నష్టదాయకంగా భావించో వీధుల్లోకి వదలివేస్తున్నారు. అవి ఇబ్బడి ముబ్బడి కావటంతో గుజరాత్‌ హైకోర్టు అనేక సార్లు వాటి గురించి రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలించింది. దాంతో విధిలేని స్థితిలో బిజెపి ప్రభుత్వం అలాంటి ఆవులను వదలివేసిన వారికి జరిమానా విధించే నిబంధనలతో పట్టణాలలో ఆవుల నియంత్రణ బిల్లు-2022ను తేవాల్సి వచ్చింది. ఈ బిల్లుకు నిరసనగా ఆవుల యజమానులు ఆందోళనలు చేశారు. జుమ్లా, ఉత్తినే బిల్లు తెచ్చాం తప్ప... అమలు జరపం... అని ప్రభుత్వం చెప్పినా వారు తగ్గలేదు. ఎన్నికల్లో బిజెపిని బహిష్కరిస్తాం అని అల్టిమేటం ఇచ్చారు. అనేక నియోజకవర్గాల్లో వారి ఓట్లు కీలకం, వాటికి ఎక్కడ గండిపడుతుందోనన్న భయరతో సెప్టెంబరు అసెంబ్లీ సమావేశంలో ఏకగ్రీవంగా వెనక్కు తీసుకున్నారు.
             కబేళాలకు తరలించే ఆవులను కాపాడేందుకు ఏర్పడిన గో దళాలు రక్షించిన ఆవులను సంరక్షించేందుకు ప్రభుత్వం దాతృత్వ సంస్థలు ఏర్పాటు చేసే 450 గోశాలలకు (అవి ఎవరికి కేటాయిస్తారో చెప్పనవసరం లేదు) 2022-23లో గోమాత పోషణ యోజన కింద ఐదు వందల కోట్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద గోశాలలో చేర్చిన ప్రతి ఆవుకు రోజుకు 30 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ప్రస్తుతం గుజరాత్‌లో అమల్లో ఉన్న వృద్ధాప్య పెన్షన్‌ పథకం కింద 60 ఏళ్లు దాటిన వృద్ధులకు నెలకు రూ.400, ఎనభై ఏళ్లు దాటిన వారికి రూ.700 ఇస్తున్నారు. ఎన్నికల కోసం ఈ మొత్తాలను రూ.1000-1250గా పెంచుతామని 2022-23 బడ్జెట్‌లో పేర్కొన్నారు.
        ఆవులను గాలికి వదిలేస్తే జరిమానా వేస్తామంటే ఆవుల పెంపకందార్లు ఆగ్రహించారు. ఆ బిల్లును ఎత్తివేసి గోశాలల్లో చేర్చిన ప్రతి ఆవుకు నెలకు రూ.900 ఇస్తామని ప్రభుత్వం ప్రకటించటంతో ఇప్పుడు గోశాలల నిర్వాహకులు ప్రభుత్వం మీద ధ్వజమెత్తుతున్నారు. ఈ కేటాయింపు నిధులు వెంటనే ఇవ్వాలని, ఇది ఒక ఏడాదికి పరిమితం చేయకూడదని డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్రంలో 1,700 గోశాలలు ఉండగా 450కి మాత్రమే అంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఆవుల పెంపకందార్లు వట్టిపోయిన వాటిని వదలివేస్తే...ఇప్పుడు గోశాల నిర్వాహకులు ఆందోళనకు దిగి గోశాలల్లో ఉన్న ఆవులన్నింటినీ వీధుల్లోకి వదలాలని చూస్తున్నారు. గత నెలాఖరులో వనస్కాంత జిల్లా లోని వీధులు, ప్రభుత్వ ఆఫీసుల్లోకి వదిలారు. తదుపరి ఆందోళనలో భాగంగా జిల్లా, తాలూకా ప్రభుత్వ ఆఫీసుల్లో గోమూత్రం, పేడ చల్లుతామని ప్రకటించారు.
        గుజరాత్‌లో ఆవుల పెంపకందార్లను మాల్దారీలని పిలుస్తారు. వారిని సంతృప్తిపరచడంలో భాగంగా, వారి ఓట్ల కోసం ప్రతి పార్టీ, నేత ఆవుల మీద ప్రేమ ఒలకబోస్తుంటారు. అసెంబ్లీ లోని 182 స్థానాలకు గాను 46 చోట్ల ఈ సామాజిక తరగతికి చెందిన వారు సమీకరణలను తారుమారు చేస్తారని అంచనా. ప్రభుత్వానికి నిరసనగా ఎక్కడైతే ఆవులను ప్రభుత్వ ఆఫీసుల్లోకి వదిలారో అదే వనస్కాంత జిల్లాలోని అంబాజీలో సెప్టెంబరు 30న నరేంద్రమోడీ 'ముఖ్యమంత్రి గోమాత పోషణ యోజన' పథకాన్ని ప్రారంభించారు. ఆగస్టు నెలలో బిజెపి ఆధీనంలోని సూరత్‌ మున్సిపల్‌ అధికారులు అనుమతి లేని ఆవుల షెడ్లంటూ 222 కట్టడాలను కూల్చివేశారు. వెంటనే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సిఆర్‌ పాటిల్‌ రంగంలోకి దిగి కూల్చివేతలను నిలిపి వేయించారు. ఎన్నికల రాజకీయమంటే ఇదే. గుజరాత్‌ ప్రభుత్వం మాల్దారీల కోసం కామధేను విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నదని, ఆవు మూత్రం, పేడ, పాలు, నెయ్యి గురించి అక్కడ పరిశోధనలు చేస్తారని బిజెపి మాల్దారీ విభాగ నేత సంజయ దేశారు చెబుతున్నారు.
        ఆవు రాజకీయాలలో కాంగ్రెసేమీ తక్కువ తినలేదు. గతంలో పశు సంవర్ధన గురించి పేర్కొన్నప్పటికీ తొలిసారిగా గో సంరక్షణ గురించి ఎన్నికల ప్రణాళికలో చేర్చారు. ఆవు పాలకు లీటరుకు ఐదు రూపాయలు అదనంగా చెల్లిస్తామని, రాజస్థాన్‌ పథకాలను అమలు జరుపుతామని పేర్కొన్నారు. బిజెపి, కాంగ్రెస్‌లను వెనక్కు నెట్టి అధికారాన్ని పొందుతామని చెబుతున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ తక్కువ తినలేదు. తమకు అధికారమిస్తే రోజుకు ప్రతి ఆవుకు రూ.40 ఇస్తామని ప్రకటించింది. ఇప్పటికే ఢిల్లీలో ఇస్తున్నట్లు అరవింద్‌ కేజ్రీవాల్‌ చెప్పారు. లంపీ వైరస్‌ కారణంగా గుజరాత్‌లో లక్షకు పైగా ఆవులు మరణించినా ప్రభుత్వం కదల్లేదని, తాము వ్యాక్సిన్లు వేస్తామని గుజరాత్‌ ఆమ్‌ ఆద్మీ నేత సుదాన్‌ గధ్వీ ప్రకటించారు. గుజరాత్‌లో రూ.40 ఇస్తామని ప్రకటించిన కేజ్రీవాల్‌ ఢిల్లీలో రూ.20 మాత్రమే ఇస్తున్నారని, మరో రూ.20 తమ ఏలుబడి లోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ చెల్లిస్తున్నదని చెప్పిన బిజెపి ఢిల్లీలో కూడా రాష్ట్ర ప్రభుత్వం రూ.40 చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నది. ఎన్నికల సిత్రాలు మరి.
- శారద