Oct 28,2023 09:59

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పదో తరగతి పబ్లిక్‌ పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను ప్రభుత్వ పరీక్షల విభాగం విడుదల చేసింది. ఈ నెల 28 నుంచి నవంబరు 11 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా చెల్లించవచ్చునని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టరు డి దేవానందరెడ్డి శుక్రవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. రెగ్యులర్‌ విద్యార్థులు రూ.125 చెల్లించాలి. మూడు సబ్జెక్టులలోపు రాసేవారు రూ.110, తక్కువ వయసు ఉన్నవారు రూ.300 చెల్లించాలని పేర్కొన్నారు. వొకేషనల్‌ రెగ్యులర్‌ విద్యార్థులు రూ.125లతోపాటు అదనంగా రూ.60 చెల్లించాలి. రూ.50 అపరాధ రుసుంతో నవంబరు 16వ తేదీ వరకు, రూ.200 అపరాధ రుసుంతో నవంబరు 22 వరకు, రూ.500 అపరాధ రుసుంతో నవంబరు 30 వరకు చెల్లించవచ్చునని వివరించారు. ప్రధానోపాధ్యాయులకు ఇచ్చిన యూజర్‌ ఐడి, పాస్‌వర్డుతో ప్రభుత్వ పరీక్షల విభాగం వెబ్‌సైట్‌ https://www.bse.ap.gov.in/.లో లాగిన్‌ అయి చెల్లించాలన్నారు. నామినల్‌ రోల్స్‌ కూడా అప్‌లోడ్‌ చేయాలని వెల్లడించారు.