ఎక్కడికక్కడ..
పాయలు పాయలుగా చీలిపోతూ
కళ్ళను ఏమారుస్తున్నాయి
ఒకటా రెండా
పైపూతల మాయాజాలంతో
పైరాతల పరాచకాలతో
మురిపిస్తూ మరిపిస్తున్నాయి
విడగొట్టకుండా
పడగొట్టకుండా
ఏ పునాది నిర్మాణమైందని
మెలిపెట్టకుండా
ముడిపెట్టకుండా
ఏ పథక స్తూపం స్థాపనైందని
అన్నీ విభాగాలుగా
అన్నీ విభేదాలుగా
చెల్లాచెదురైనాకనే
ఒక రూపం పుట్టుకొస్తోంది
ఏది సవ్యతను
ఏది నవ్యతను సాధించింది
మడత పడిన
నాలిక సందుల్లోంచి
ముక్కలు ముక్కలుగా
రాలిపడ్డ మాటలే
పాయలుగా విడిపోయి
పాలనగా విస్తరిస్తున్నాయి
గాలి విసురుల
వాగ్దానపు తూటాలకు కూలిన
ఏ సగటు దేహాన్నైనా స్పర్శించు
లోలోతుల్లో చీలికలైన
పీడ జీవన సత్యమే వివరిస్తుంది
ఏది సవ్యంగా సాగిందని
ఏది సవినయంగా ఒప్పుకుందని
ఒప్పందాల ఒప్పుదల కూడా
పాయలుగా పగిలిపోతూనే
ఒకచోట ఆగిపోయింది
నరెద్దుల రాజారెడ్డి
96660 16636