- తాజా రాజకీయ పరిణామాలపై చర్చ
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో/హైదరాబాద్ బ్యూరో : వైద్య పరీక్షల కోసం హైదరాబాద్‌లో ఉంటున్న టిడిపి అధ్యక్షులు చంద్రబాబునాయుడుతో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. తన సోదరుడు నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్ వివాహా నిమిత్తం లండన్ వెళ్లిన పవన్ శనివారం హైదరాబాద్‌కు తిరిగొచ్చారు. అనంతరం జూబ్లీహిల్స్‌్‌లోని నివాసానికి వెళ్లి చంద్రబాబును పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని ఆరా తీయడంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపైనా చర్చించారు. సుమారు 3 గంటల పాటు ఇరువురు సమావేశమయ్యారు. రాజమండ్రి జైలులో ఉన్నప్పుడు చంద్రబాబుతో ములాఖత్ అనంతరం ఆయనతో పవన్ భేటీ కావడం ఇది రెండో సారి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తెలంగాణ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించారు. టిడిపి, జనసేన విస్తృత స్థాయి సమావేశాల నిర్వహణ అంశం కూడా వీరి భేటీలో ప్రస్తావనకు వచ్చింది. క్షేత్రస్థాయిలో ఉమ్మడిగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమాలోచనలు చేశారు.
పది అంశాలతో మినీ మేనిఫెస్టో
ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనలో భాగంగా పది అంశాలతో మినీ మేనిఫెస్టో రూపొందించాని జనసేన, టిడిపి భావిస్తున్నట్లు తెలిసింది. ఉమ్మడి కనీస కార్యాక్రమం రూపొందించుకుని క్షేత్ర స్థాయిలో వైసిపికి వ్యతిరేకంగా ఇరు పార్టీల శ్రేణులను పురమాయించాలని ఇద్దరు నేతలు నిర్ణయించినట్లు తెలిసింది. కరువు, ధరలు, విద్యుత్తు ఛార్జీలు ప్రధాన అజెండా పోరాటం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. మద్యం, ఇసుకపై క్షేత్ర స్దాయిలో పోరాటాలను ఉధృతం చేయాలని కూడా ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ భేటీలో టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్, జనసేన నేత నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు.