Aug 07,2022 13:16

పరహితం కాంక్షించే ప్రకృతిలా
నీ మంచి కోరుతూ,
నీలోని అరిషడ్వర్గాలను కాల్చి
చీకటితెరలను తొలగించి
ఆశల ఉషస్సుల పల్లకీని
మోసుకొచ్చేదే స్నేహం.
అది... జీవనాంబరంలో మెరిసే
తారయై బతుకుబాటన
వెలుగులు నింపే చిరుదివ్వె.
జీవితేచ్ఛను కలిగించే
చైతన్య కిరణం.
హృదయవీణ మీటిన
మృదుమధుర
మంజులనాదం.

తన పారదర్శక ప్రవర్తనతో
నీ మనసు గెలిచి,
అంతరంగంలో సాగిపోతున్న
భావాల వెల్లువకు
ఆనకట్ట వేసి,
ఆలోచనలకు మెరుగులు పెడుతూ
అర్థవంతమైన
లక్ష్యాలకు, సదాశయాలకు
సహకారాన్నందించి,
నీ అణువణువునా కేంద్రబిందువై
విజయపథపు ప్రతి
మలుపులోనూ
తన వ్యక్తిత్వపు ముద్రలు
అద్దేవాడే
స్నేహితుడు.
నీ మదిలో భావం
రాగ మాలపింపగా
తన పెదవులతో పల్లవి
పలికేవాడే నేస్తం.

నీ బతుకు నావ సుడిగుండంలో
మునిగిపోతోంటే
ధైర్యపు తెడ్డుతో,
సమయస్ఫూర్తి తెరచాపతో,
బయటపడేసి
గమ్యాన్ని చేర్చగల
చక్కని నావికుడే మిత్రుడు.


- వేమూరి శ్రీనివాస్‌
99121 28967