Feb 19,2023 07:38

తన గర్భంలో నాకు జీవం పోసి
రక్త మాంసాల సంచయం చేసి
తన రక్తాన్ని పాలుగా మార్చి
చెమట చుక్కల సేద్యం చేసి
తల్లి కోడిలా కాపుగాసి
మమకారం గోరుముద్దలు చేసి
బ్రతుకు రాయిని శిల్పం చేసింది అమ్మ

ఈ దేహానికొక హృదయాన్నిచ్చి
నా ఆలోచనలకొక రూపాన్నిచ్చి
జీవిత కీకారణ్యంలో ప్రయాణం నేర్పి
హృదయపు లోతుల అర్థాలు చెప్పి
జీవితాన్ని సప్తవర్ణ శోభితం చేసింది అమ్మ

పసితనాల లేతమొక్కకు పాదు చేసి,
తప్పటడుగుల బతుకు నడకకు
తప్పు ఒప్పులు ఎరుక పరిచి,
మంచిచెడ్డల తీరుతెన్నుల
చిక్కుముడులను విప్పదీసి,
చిమ్మచీకటి కమ్ముకున్న బతుకుదారిన
వెలుగు జిమ్మిన దీప స్తంభం అమ్మ

పాలవెన్నెల జాబిల్లి చూపి
మస్తిష్కపు అంతరాల్లో
ఆలోచనల విత్తులు నాటి
తొలి ఊహలకు రెక్కలు తొడిగి
వినీలాకాశపు అంచులు చూపి
పక్షినై నే ఎగురుతుంటే గాలి సంద్రమై
అస్తిత్వపు అసలు అర్థం విప్పిచెప్పింది అమ్మ

మట్టి నుండి సారాన్ని తీసి
పురుటి నొప్పుల కటువు బాధను
పంటి బిగువున అదిమిపట్టి
అనురాగం చనుబాల ధార చేసి,
మానవత్వ పరిమళాన్ని అద్ది
నాగరికతలకు నడకనేర్పిన ''పుడమితల్లి'' అమ్మ

జీవి'తత్వపు' అంతస్సారం అమ్మ
తన ప్రాణం పంచి ప్రాణంపోసేది అమ్మ
త్యాగం అమ్మతనపు
నిండుదనపు సందేశం
మనుగడ సారాంశం, ఉనికి పరమార్థం
సుఖదుఃఖాల బతుకు చిత్రపు
అనుభవ పాఠం అమ్మ
సుందర స్వప్నం అమ్మ

టి.హరికృష్ణ
94940 37288