
వారణాసి ఒక పుణ్యక్షేత్రంగా శతాబ్దాలుగా ఉంది. మోడీ ఆ నియోజకవర్గం నుండి పార్లమెంట్‌కి ఎన్నికై ప్రధాని పదవి చేపట్టాక అది అధికార పుణ్యక్షేత్రం అయి పోయింది. అటువంటి చోట నిన్న మోడీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దాంతో పుణ్యం కోసం, కర్మకాండల కోసం వారణాసి పోయే వారికి ప్రత్యేక దినాలలో క్రీడా వినోదం కూడా అందుబాటు లోకి రాబోతోందన్న మాట. రెలిజియస్ టూరిజం (పుణ్యక్షేత్రాలను, విహార యాత్రా స్థలాలను ఒకే ట్రిప్పులో సందర్శించే ఏర్పాటు) కాస్తా ఇప్పుడు రెలిజియస్ - స్పోర్ట్స్ - టూరిజం కాబోతోందన్న మాట. అక్కడే జ్ఞానవాపి మాస్క్ వివాదాన్ని రాజేస్తున్నారు గనుక అది రెలిజియస్ - స్పోర్ట్స్ - పొలిటికల్-టూరిస్టు స్థలంగా పరిణామం చెందవచ్చు. దేశంలో రామ భక్తి 12వ శతాబ్దం నుండే వ్యాప్తి చెందినా, అయోధ్య ఒక ప్రధాన పుణ్య క్షేత్రంగా గుర్తింపు తెచ్చుకున్నది బాబ్రీ మసీదును కూల్చివేసిన తర్వాతనే కదా. మరి ప్రధాని స్వయానా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్పుడు వారణాసికి ఎంత ప్రాధాన్యత ఉండాలి? అందుచేత అక్కడ క్రికెట్టూ వస్తుంది, మరేమైనా కూడా వచ్చితీరుతుంది.
విశేషం ఏమిటంటే వారణాసిలో నిర్మించబోయే క్రికెట్ స్టేడియంలో ఫ్లడ్‌లైట్లు త్రిశూలం ఆకారంలో ఉంటాయట! స్టేడియం ఆకారం ఢమరుకం (గారడీవాళ్ళు ఉపయోగించే ఢక్క) రూపంలో ఉంటుందట! ఈ గారడీలో వీక్షకులు కూర్చునే గ్యాలరీ గంగా ఘాట్ ను తలపిస్తుందట! బహుశా అక్కడ ఆటను చూడడానికి వచ్చేవాళ్ళు తప్పకుండా కాషాయం డ్రస్ వేసుకోవాలని నిబంధన పెడతారో ఏవిుటో !
ఇన్నాళ్ళూ హిందూత్వ వాదులు ''అంతర్జాతీయ'' క్రికెట్ ఆటలో దేశభక్తిని మాత్రమే జొప్పించేరు. ఒకవేళ పాకిస్తాన్ ఆటగాళ్ళు మనవాళ్ళకన్నా బాగా ఆడి మ్యాచ్ గెలిచినా, మన వీక్షకులు మాత్రం పాకిస్తాన్‌ను మెచ్చుకోకూడదు. ఒకవేళ మెచ్చుకుంటే అది దేశద్రోహమే! ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఏకంగా హిందూత్వ సింబాలిజమ్ ని ప్రవేశపెడుతున్నారు. రేప్పొద్దున్న మూడు వికెట్లు అంటే అది త్రిశూలమే అని, బ్యాట్ కి బదులు గద ఉపయోగించాలని, బంతిని బౌల్ చేయడం మానేసి విల్లు కి తగిలించే బాణానికి చివర బంతిని తగిలించాలని...ఇలా వినూత్న (!) ప్రక్రియల్ని గాని ప్రవేశపెడతారో ఏమో మరి! వీళ్ళ బారి నుండి క్రికెట్ ఆటను ఆ మహాశివుడే రక్షించుగాక !
కొసమెరుపు : నూతన విద్యా విధానం 2020లో తమ ప్రభుత్వం క్రీడలకు తక్కిన సబ్జెక్ట్‌లతో పాటు సమాన ప్రాధాన్యత ఇచ్చిందని నిన్న మోడీగారు శలవిచ్చారు. అంటే బహుశా చరిత్రలో, సైన్స్‌లో సిలబస్‌ను మార్చేసినట్టే, వారణాసి క్రికెట్ స్టేడియం ఆకారాన్నే మార్చేసినట్టే పిల్లల ఆటల నిబంధనలను కూడా మార్చేసి సనాతన (?) ధర్మాన్ని పాటిస్తారు అనుకోవాలి మరి. క్రికెట్ స్టేడియంలలోకి స్థానిక టీమ్‌లను ఆడుకోడానికి అడుగు పెట్టనివ్వరు. కేవలం చూడడానికే, అది కూడా టిక్కెట్టు కొనుక్కుంటేనే, అనుమతిస్తారు. బహుశా నూతన విద్యా విధానంలో క్రీడల పాలసీ కూడా ఆటగాళ్ళని తయారు చేసేదానికి బదులు వీక్షకుల్ని తయారు చేయడానికి అనువుగా ఉంటుందేమో !
ఇంతకూ వారణాసి క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ఎన్ని బుల్డోజర్లను ఎన్ని ఇళ్ళ మీద ప్రయోగిస్తారో మరి ?
- సుబ్రమణ్యం