ఆర్నమెంటల్ మొక్కల్లో పూల కంటే.. ఆకు జాతి మొక్కలే ఎక్కువ.. పూల మొక్కలకు సీజన్ ఉంటుంది. నిరంతరం పూలు పూసే మొక్కలు తక్కువగా ఉంటాయి. చాలా వరకూ ఆయా కాలాల్లో మాత్రమే విరబూస్తాయి. కానీ ఆకు మొక్కలు నిరంతరం నిగారింపుగా ఉండి, నిత్యం పర్యాటక శోభతో వర్ధిల్లుతాయి. అందమైన ఆకులుండే వీటికి గిరాకీ ఎక్కువ. ఈ తరహా విదేశీ మొక్కలు గణనీయంగా దిగుమతి అవుతున్నాయి. విచిత్రంగా ఉండే వీటి పత్రాలు ప్రకృతి ప్రేమికుల మనసులను ఇట్టే కొల్లగొట్టేస్తాయి. అలాంటి మొక్కల గురించి తెలుసుకుందాం..
హోమలోమెనా రూబెసెన్స్..
చారెడు వెడల్పాటి ఆకుపచ్చని ఆకులతో నవనవలాడుతూ అలరించే అపురూప మొక్క హోమలోమెనా రూబెసెన్స్. దీన్ని ఇండోర్, సెమీషెడ్‌లో కూడా పెంచుకోవచ్చు. ఇది అరమ్ (అరేసి) కుటుంబానికి చెందిన మొక్క. ఆకులు కాస్త దళసరిగా ఉంటాయి. కాలాథియా, ఫిలోడెండ్రాన్ లాగా అదే జాతి నుంచి పుట్టుకొచ్చింది. ఎర్రటి కాండం, గుండె ఆకారపు ఆకులతో గుబురుగా ఉండే మొక్క. కొన్నిసార్లు అసాధారణమైన ఆకారాలు, విభిన్న రంగుల్లో ఇవి కొలువుదీరతాయి. కొద్దిగా నీటి వనరు అందిస్తే సరిపోతుంది. ఒక్కో ఆకు మూడు నెలలపాటు నిగారింపుగా ఉంటుంది. ఇది మలేషియా జాతి ఆకు మొక్క.
హోస్టా ప్లాంటేజీనియా..
చిన్ని చిన్ని ఆకులతో పొదమాదిరిగా ఎదిగే మొక్కిది. సువాసన గల 'అరటి లిల్లీ లేదా ఆగస్టు లిల్లీ' అని కూడా దీన్ని పిలుస్తారు. ఆస్పరాగేసి కుటుంబంలోని పుష్పించే జాతి మొక్క ఇది. ఆగేయ, దక్షిణ-మధ్య చైనాకు చెందినది. పచ్చటి ఆకుల మీద తెల్లటి చారలు ఉంటాయి. శీతాకాలంలో సువాసన గల తెల్లని పూలను పూస్తుంది. నాలుగు రోజులకు ఒకసారి నీటి తడి అందిస్తే సరిపోతుంది.
ఆగస్ట్ లిల్లీ ఎల్లో..
హోస్టా ప్లాంటేజీనియా జాతికి చెందిన మరో మొక్క ఆగస్టు లిల్లీ ఎల్లో. ఆకులు కాస్త పొడవుగా ఉండి, తాకితే చాలా మెత్తగా ఉంటాయి. ఆకుల మీద పొడవుగా ఒక జడలా ఉంటుంది. ఆకులు కాండం కూడా ముదురు పసుపు రంగులో ఉండి, పత్రాలు చుట్టూతా చక్కని ఆకుపచ్చని అంచు ఉంటుంది.
నియోరెజెలియా కరోలినే లేదా బ్లషింగ్..
ఆకులు అంగుళం వెడల్పు, దాదాపు అడుగు నుంచి అడుగున్నర పొడవు ఉంటాయి. ఒక రంగు ఆకు మీద మరొక రంగు చారలతో భలే అందాలు అద్దుతాయి. ఇందులో రకాలు కోకొల్లలు. మువ్వల్లో నీళ్లు దాచుకోవడం ఈ మొక్కల ప్రత్యేకత.
ఇవి బ్రెజిల్ దేశం మొక్కలు. రోజూ నీళ్లు అందిస్తే సరిపోతుంది. కుండీల్లోనూ, నేల మీదా బాగా పెరుగుతాయి. బయట వాతావరణంలో, సెమీ షెడ్ వాతావరణంలోనూ పెంచుకోవచ్చు.
చీలోకోస్టస్ స్పెసియోసస్..
ఎరుపు రంగులో ఉండే సన్నని కాండం సర్పిలాకారంగా పైకి ఎదుగుతూ ఉంటుంది. కాండం నుంచి బయటివైపుకి ఆకులు చిగురిస్తూ ఉంటాయి. ఆకుపచ్చని ఆకులకి చుట్టూతా చివర్లో తెల్లని చారలు ప్రత్యేక అందాలను అద్దుతాయి. 'క్రేప్ అల్లం, కోస్టాసీ కుటుంబంలోని పుష్పించే మొక్క' అని కూడా పిలుస్తారు. మొక్క కొంతకాలం బాగా పెరిగిన తర్వాత శీతాకాలం సీజన్లో గుత్తిలా వచ్చి, వాటి గదుల్లోంచి తెల్లటి పువ్వులు చక్కగా విచ్చుకుంటాయి. 'కోస్టస్ ఇగెస్' అనేది ఈ జాతిలో మరోరకం మొక్క. దీన్నే 'ఇన్సులిన్ ప్లాంట్' అని కూడా అంటున్నారు. కోర్సెస్ జాతిలో పది రకాల మొక్కల వరకు ఉన్నాయి.
ఫిట్టోనియా అల్బివెనిస్..
కొలంబియా, పెరూ, బొలీవియా, ఈక్వెడార్ ఉత్తర బ్రెజిల్‌లోని రెయిన్‌ఫారెస్ట్‌లకు చెందినది ఈ మొక్క. గమ్మత్తయిన ఆకులతో అలరించే మొక్క ఇది. అకాంథేసి కుటుంబంలో పుష్పించే జాతి మొక్క. ఎదురెదురుగా జంటాకులు ఒకదానిపై ఒకటి అభిముఖంగా పెరుగుతాయి. ఆకుపచ్చని ఆకులపై ఎర్రటి గీతల్లాంటి చారలు రమణీయంగా ఉంటాయి. ఇది పూర్తిగా ఇళ్ల లోపల పెంచుకునే ఇండోర్ మొక్క. పది డిగ్రీలలోపు ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో ఇది బాగా పెరుగుతుంది.
చిలుకూరి శ్రీనివాసరావు
89859 45506