Mar 01,2023 07:37

         ఢిల్లీ ఉపముఖ్యమంత్రిని లిక్కర్‌ పాలసీ కేసులో అరెస్టు చేయడం ముమ్మాటికీ కక్షసాధింపు చర్య! దేశ సంపదను అదానీ గ్రూపు కొల్లగొట్టడానికి బిజెపి కేంద్రప్రభుత్వం, ప్రధాని మోడీ అండదండలే కారణమని లోకం ఘోషిస్తున్న నేపథ్యంలో దాన్ని పక్కదారిపట్టించేందుకే ఈ అరెస్టు అన్నదీ సత్యదూరం కాదు. ఢిల్లీతోపాటు పంజాబ్‌లోనూ అధికారంలోకి వచ్చి, ఇటీవల ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బిజెపిని ఓడించిన ఆమ్‌ ఆద్మీ పార్టీని ఇరుకునపెట్టేందుకే కీలక నేతలను అరెస్టు చేస్తున్నారు. ఏడు నెలల క్రితం ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రజైన్‌ అరెస్టయి జైలులో ఉన్నారు. ఆప్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న విద్య, వైద్య శాఖలతోసహా 18 శాలు నిర్వహిస్తున్న ముఖ్యనేతను అరెస్టు చేయడం వేధింపు చర్యగానే భావించవలసి వుంటుంది. నిర్బంధంలోని మంత్రుల రాజీనామాలను ఆమోదించిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఇది కేవలం పరిపాలనా చర్యల్లో భాగమే తప్ప నేరాంగీకారం కాదని స్పష్టం చేశారు.
           ప్రతిపక్ష పార్టీలను ప్రత్యర్థులుగా, శత్రువులుగా చూసే సంస్కృతి గతంలోనూ ఉన్నా... అది మోడీ ప్రభుత్వ హయాంలో పరాకాష్టకు చేరింది. ఆయా పార్టీలతోపాటు వ్యవస్థలపై కూడా యుద్ధం ప్రకటించిన పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్‌ ముక్తభారత్‌... ప్రతిపక్ష ముక్తభారత్‌... అని పిలుపునిచ్చి... రాజకీయ ప్రసంగాలు చేయడం ఒక ఎత్తయితే... తెరవెనుక సాగే లావాదేవీలు... తెరముందు ఆయుధాల్లా సిబిఐ, ఇడి, ఐటి, అరెస్టులు మరో ఎత్తుగా ఉన్నాయి. ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీలాండరింగ్‌ యాక్ట్‌ (పిఎంఎల్‌ఎ)-2002కి 2009, 2012, 2019లో సవరణలు చేశారు. మొదట్లో ఆరు చట్టాల ప్రకారం 40 నేరాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకునే అధికారం ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 30 చట్టాలు-140 నేరాలకు చేరింది. యుపిఎ హయాంలో మనీలాండరింగ్‌ కేసులలో 112 ఇడి సోదాలు నిర్వహించగా, 2014 తరువాత మోడీ హయాంలో 26 రెట్లు పెరిగి 2,974కి చేరింది. యుపిఎ హయాంలో 26 మంది కీలక నేతలపై ఇడి చర్యలు తీసుకుంటే వారిలో 14 మందే ప్రతిపక్ష నేతలు. కానీ, మోడీ హయాంలో 121 మంది ప్రముఖ రాజకీయ నేతలపై ఇడి దర్యాప్తు చేస్తే.. వారిలో 115 మంది ప్రతిపక్ష పార్టీల వారే. 2011-16 మధ్య ఐటి కేసులకు సంబంధించి 7.3 శాతం శిక్షలు పడగా, 2016-20 మధ్య 2.34 శాతం మందికి మాత్రమే శిక్షలు పడటం గమనార్హం. బిజెపికి తామే ప్రత్యామ్నాయమన్న మమతాబెనర్జీ నారదా, శారదా స్కామ్‌లు ముందుకు రావడంతో ఆర్‌ఎస్‌ఎస్‌ను, మోడీని పొగడటం.. కేసులు నెమ్మదించడం... కనిపిస్తూనే ఉంది. ఆ పార్టీ నుంచి బిజెపిలో చేరగానే ఆ పార్టీ శాసన సభాపక్ష నేతగా మారిపోయిన సువేందు అధికారిపై కేసుల జాడే లేదు. ఇటీవల రారుపూర్‌లో జరిగిన ఎఐసిసి ప్లీనరీకి హాజరయ్యేందుకు బయల్దేరిన కాంగ్రెస్‌ నాయకుడు పవన్‌ఖేరాను మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న సాకుతో ఢిల్లీలో విమానం నుంచి దించి మరీ అస్సాం పోలీసులు కక్షపూరితంగా అరెస్టు చేశారు.
       ఇక... అదానీ వ్యవహారమే కాదు... బిజెపి పాలిత రాష్ట్రాలపై సిబిఐ, ఇడి, ఐటిలు కన్నెత్తిచూసిన దాఖలాల్లేవు. 40 శాతం కమీషన్లు అంటూ ప్రచారం సాగుతున్న కర్ణాటక, యడ్యూరప్ప, గాలి జనార్థనరెడ్డి అవినీతి, అసలు వారి దృష్టిలోనే లేదు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు 2014, 15లో సిబిఐ, ఇడి విచారణ ఎదుర్కొన్న హిమంత బిశ్వశర్మ బిజెపిలో చేరి, అస్సాం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రతిపక్షాల్లో ఉంటే కేసులు... కాషాయ పార్టీలో చేరితే పదవులు... అన్నట్టుగా తీరు సాగుతోంది. ఇటీవల తెలంగాణా ఫామ్‌ హౌస్‌ కేసులో ఎమ్మెల్యేల కొనుగోలు కోసం రంగంలోకి దిగిన కాషాయ పెద్దల సంగతిని లోకమంతా చూసింది. తమ పార్టీ గంగానది అని, ఆ పార్టీలో చేరితే పాపాలన్నీ పోతాయని ఇటీవల త్రిపుర సిఎం మాణిక్‌ సాహా వ్యాఖ్యానించారు. పాపాలు పోవడమేమో కానీ, అవినీతికి, అక్రమాలకూ, ఆశ్రిత పక్షపాతానికీ పరాకాష్టగా కాషాయ పార్టీ రూపాంతరం చెందింది. చట్టబద్ధ పాలనకు ఆటంకంగా ఆ పార్టీ చర్యలు పరిణమించాయి. వాటిని ప్రతిఘటించడం... ఉద్యమించడం ద్వారానే... ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం సాధ్యమవుతుంది.