Nov 04,2023 07:32

          భారతదేశ జనాభాలో సుమారు 2 శాతం మంది వికలాంగులు ఉన్నట్లు తెలుస్తోంది. దేశ సమ్మిళిత అభివృద్ధిలో వీరి పాత్ర సముచితంగా ఉండాలని పలు నివేదికలు చెబుతున్నాయి. చిన్న చిన్న లోపాలు, అంగవైకల్యం ఉన్నంత మాత్రాన వీరి పట్ల ఎవరూ వివక్షత చూపరాదు. పైగా వివక్షతో వ్యవహరించడం నేరమని కూడా గ్రహించాలి. అంతదాకా ఎందుకు! ఇటీవల చైనాలో జరిగిన పారా ఆసియన్‌ క్రీడలలో తమ క్రీడా నైపుణ్యాలు, సామర్థ్యాల ద్వారా మన దేశానికి 111 పతకాలు సాధించి దేశ గౌరవాన్ని ఇనుమడింపచేశారు. దేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటారు.
          దేశ ఆర్థికాభివృద్ధికి కేంద్రాలైన పరిశ్రమలు, కార్యాలయాలు, ఉద్యోగ ఉపాధి కేంద్రాలలో వీరికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. మొత్తం వికలాంగులలో కేవలం 36 శాతం మాత్రమే పనిలో భాగస్వాములుగా వున్నారు. ఈ 36 శాతంలో పురుషులు 47 శాతం కాగా, మహిళలు కేవలం 23 శాతంగా ఉన్నారు. ఇక్కడ కూడా లింగ వివక్షత స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా వికాలంగులల్లో గ్రామీణ ప్రాంతాలలో 25 శాతం ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతుండగా, పట్టణ ప్రాంతాల్లో కేవలం 16 శాతం మంది మాత్రమే ఉపాధి అవకాశాలు పొందుతున్నారని నివేదికలు చెబుతున్నాయి.
           కార్పొరేట్‌/ప్రైవేటు రంగంలో వికలాంగులకు సరైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించటం లేదు. ప్రతీ 100 మంది వికలాంగులలో నలుగురు ప్రభుత్వ రంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతుండగా, కార్పోరేట్‌ రంగంలో కేవలం 1 శాతానికి మాత్రమే ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించటం అత్యంత బాధాకరమైన విషయం. భారతదేశంలో వికలాంగుల హక్కుల పరిరక్షణ కోసం ''రైట్స్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ డిజబిలిటీస్‌ యాక్ట్‌-2016'' ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ప్రైవేటు రంగంలో, సమాజంలో వీరికి సరైన సదుపాయాలు అందుబాటులోకి రాలేదు. అవిద్య, నైపుణ్యాల లేమి, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో వెనుకబాటుతనం, చిన్నచూపు, వివక్షత వంటి కారణాల వల్ల వికలాంగులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందిపుచ్చు కోలేకపోతున్నారని 'ఆక్స్‌ఫామ్‌-2019' నివేదిక తెలుపుతోంది.
           వీరికి పని ప్రదేశాలు అందుబాటులో లేకపోవడం, రవాణా సౌకర్యాలు లేకపోవడంతో కార్మికశక్తిలో భాగం కాలేకపోతున్నారు. కార్పోరేట్‌ వ్యక్తులు తమ కంపెనీల సి.యస్‌.ఆర్‌ నిధులు కూడా సరిగ్గా ప్రాధాన్యతా క్రమంలో ఖర్చు చేయటం లేదు. వీరికి విద్యా సౌకర్యాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. మరి భవిష్యత్తులో మన దేశాన్ని మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ అండ్‌ కో గొప్పగా చెప్పుకోవడాన్ని ఏవిధంగా చూడాలి? దేశంలో రెండు శాతంగా ఉన్న వికలాంగుల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా చదువుతో పాటు నైపుణ్యాలు అభివృద్ధికి శిక్షణ ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ రంగంలో లాగా ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్‌ అమలు జరిగేలా చూడాలి. బడ్జెట్లో వీరికి నిధుల కేటాయింపులు పెంచాలి. స్టార్టప్‌, చిన్న పరిశ్రమలు స్థాపనలో వీరికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఒకేషనల్‌ కోర్సులు అందుబాటులోకి తేవాలి. వీరికి అనుకూలంగా పని గంటలు ఏర్పాటు చేయాలి. చట్టాలు సక్రమంగా అమలు చేయాలి. మీడియా, సమాజం కూడా వికలాంగులకు బాసటగా నిలవాలి. దేశ కార్మిక శక్తిలో వికలాంగులకు సముచిత స్థానం కల్పించటం ద్వారానే సమ్మిళిత అభివృద్ధి మరింత మెరుగు పడుతుంది.
- ఐ.పి.రావు,
సెల్‌ : 6305682733