Sep 11,2022 12:13

ఆకుపచ్చ పారాణితో
నేలంతా నవ్వుతున్నప్పుడు
గాలి గడుసు ఈల పాటల్ని
ఇప్పుడు నేను గుండెతో వింటున్నాను
ఇన్నాళ్లూ చెదిరి కరిగిన కలలు కొన్ని
మళ్లీ కొత్తగా పురుడోసుకొన్నాక
పుడమి పాడుతున్న కొంగ్రొత్త పల్లవుల్ని
నా కంటితో సరిక్రొత్తగా వీక్షిస్తున్నాను

అటుగా చెట్లు చేతులూపి
చల్లగా పిలిచి తడిమినట్టు
మరో పక్క చేమంతులతో
చట్టా పట్టాలేసి నవ్వినట్టూ
వెళ్ళే మేఘాలు ఈ దృశ్యాల్ని చూస్తూ
నిలబడి నేలపైకి వంగినట్టూ...
నా కంటి కేమెరాపై కొలువై
కమ్మని కావ్యమై నిలుస్తూ
నిక్షిప్తం అవుతున్నాయి

పారే వాగులు.. రైతు ఆశల్ని
మోసుకొస్తూ మెరుస్తున్నాయి
నీటితో నిండిన కయ్యలు
కోటి ఆశల మోసులతో
ముచ్చట్లను పంచుతున్నాయి
దిగులుని దించుకొంటున్న రైతు మోము
పరవశంతో రేపటి కలల్ని స్పృశిస్తూ
మరో ఉదయానికి స్వాగతం పలుకుతూ...!!

మహబూబ్‌ బాషా చిల్లెం
95020 00415