Apr 30,2023 07:14

పనిదీ, పాటదీ విడదీయలేని బంధం. శ్రమలోంచి పుట్టిన పాట కాలక్రమేణా ఒక ప్రజా సాంస్క ృతిక వైభవంగా విరాజిల్లింది. పనులు ఉమ్మడిగా, ఉత్సాహవంతంగా జరగటానికి తోడ్పడింది. ఆపై అనేక సామాజిక మార్పులు రావటానికి, చైతన్యం వెల్లువెత్తటానికి సాధనంగా ఉపయోగపడింది. మనుషులను కలిపి ఉంచటానికి, మనసులను రంజింప చేయటానికి ఉపకరణమైంది. పనీపాటలు రెండూ కవల పిల్లల్లాగ, జంటకవుల్లాగ సహవాసం చేస్తూ .. సమాజం ఇంతగా అభివృద్ధి చెందటానికి ఎంతగానో దోహదపడ్డాయి. ప్రపంచ ప్రగతికి పని సారథి అయితే, పాట వారధి! మే ఒకటవ తేదీ 'మే దినోత్సవం' సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.
ఒక కొత్త తోవ నిర్మించాలి. అడ్డుగా ఉన్న చెట్టంత బండరాయిని పక్కకు తొలగించాలి. అప్పుడు అనేకమంది చేతులు ఒక్క పట్టుగా, ఒక్క పెట్టున దాని మీద ప్రయోగించాలి. ఆ అందరిలో ఉమ్మడి ఉత్తేజం కలిగించటానికి సాధనంగా సాయపడుతుంది ఒక లయబద్ధమైన శబ్ద సందోహం!
అద్దంలా తయారైన మడిలో నాట్లు వేయాలి. అప్పుడు నడినెత్తిన సూరీడు చిటపటలాడుతుంటాడు. మడిలో మునుం మున్ముందుకు కదలాలి. అప్పుడూ ఉత్సాహంగా కదలటానికి 'నోమినోమన్నాల నోమన్నలారో..' వంటి జానపదాలు కదం తొక్కుతాయి. ఒకరు పాడుతూ ఉంటే.. మిగతావాళ్లు బృందగానం చేస్తూ ఉంటే.. క్షణాల్లో బురదమడి నిండా పచ్చని నాట్లు పరుచుకొని, కలకల్లాడుతూ ఉంటాయి. అది పనీపాటలు రెండూ ఉమ్మడిగా సాధించే అద్భుతం!
జీవనోపాధి కోసం మైళ్లకు మైళ్లు నడిచిపోవటం ఒకనాడు అనివార్య ప్రయాణం. గుంపులు గుంపులుగా నడుస్తున్న జనం.. అలసట తెలియకుండా, దూరాభారం అనుకోకుండా అనుసరించే దగ్గరి దారి - పాటల కచేరి. పాడుకుంటూ, పరాచికాలు ఆడుకుంటూ సాగిపోతే... గమ్యం దానికదే దగ్గరవుతుంది. ఆ పాటల్లో, మాటల్లో అపరిచిత బాటసారులు సైతం దగ్గరవుతారు. మిత్రులవుతారు. అది సాంస్కృతిక సమ్మేళనం ఏర్పర్చే సౌభ్రాతృత్వ సంబంధం!
సమూహంగా కదిలిన మనిషి ఏ పని చేసినా, ఆ పని వెనకనే ఉత్సాహమై ఉరకలేసింది పాట. పని ఒక పద్ధతి ప్రకారం జరగటానికి మనుషుల మధ్య మాట్లాట ఎంత అవసరమైందో ... ఆ పని ఒక పండగలా, వేడుకలా, జాతరలా సాగటానికి అంతే అనుసంధానంగా ఉపయోగపడింది పాట. మండే ఎండలో పనిచేస్తున్నప్పుడు చల్లని చలువ ధారగా ఉప్పొంగింది. ఏకధాటి వానలో ప్రయాణమైనప్పుడు తలలను కాచే గొడుగు అయింది. వణికించే చలిలో నులి వెచ్చని స్పర్శ నందించింది. ఇత్యాది, అనేకనేక కారణాల చేత పనిదీ, పాటదీ మానవ సమూహాలు ఏర్పడినంత పురాతన కాలపు సంబంధం. ఎప్పుడూ విడివిడిగా మనలేని, ఎల్లప్పుడూ కలివిడిగా సాగేంతటి అనుబంధం.

2
  • ప్రజాజీవితానికి ప్రతిబింబం

ఈ ప్రపంచం ఇంత ప్రగతి సాధించటానికి మానవ మేథ, శ్రమలే అత్యంత ముఖ్య కారణం. శారీరక శ్రమ ఒక బరువులా కాకుండా అదొక ఉత్సవంగా, ఉత్సాహంగా ఉండటానికి ఆటపాటలను ఊతంగా చేసుకున్నాడు మనిషి. అందుకనే పని ఎక్కడ ఉంటే పాట అక్కడ ఉంటుంది. శ్రమలోంచే సర్వమూ పుట్టింది అన్నాడు వేమన. అలా పుట్టిన అనేకంలో బహుశా మొట్టమొదటిది పాట.. ఆ వెనువెంటనే ఆట. ఆ ఆటపాటల కలబోతే ... శ్రామిక జనులు సాధించిన తొట్టతొలి సాంస్క ృతిక సంబరం!
ఆరంభంలో శ్రమ నుంచే ఆటపాటలు పుట్టాయి. పనిపాటుల సమయాల్లోనే పాటల అల్లికలూ, పదుగురిలోకి ప్రవహించటాలూ జరిగాయి. ఒకరి వద్ద ఒకలా మొదలై.. మరొకరి వద్ద మరింత మెరుగై సమాజ సంపదలా వర్థిల్లాయి. మొదట్లో ఆటైనా, పాటైనా అందరి ఉమ్మడి సొత్తు. ఎవరు ఎలా అయినా స్వీకరించొచ్చు, మార్పులు చేయొచ్చు, మెరుగులు దిద్దొచ్చు, సందర్భానికి అనుగుణంగా జోడింపులు చేయొచ్చు. మడిలో ఒక బృందం నాట్లు వేస్తూ ఉంది. వారి నోట ఏదొక జానపద గీతం జోరుగా సాగిపోతోంది. అప్పుడే దూరంగా మల్లమ్మ వస్తూ కనిపిస్తుంది. పాట పాడుతున్న మహిళ తన పాటలోకి మల్లమ్మను లాక్కోస్తోంది. ''ఇప్పుడే తెల్లారే మల్లమ్మకు .. నత్త నడకల పొత్తు బుల్లెమ్మకు ..'' అని హాస్యమాడుతుంది. ఆ గుంపులోని ఇంకొక ఆమె ఇంకొంత జోడించవొచ్చు. లేదూ ఆ మల్లమ్మే వడివడిగా వచ్చి, మునుంలో చేరి, తన మీద పడిన విసురుకు తెలివిగా పాట కట్టి జవాబు ఇవ్వొచ్చు. జానపదుల మధ్య ఇవన్నీ చాలా అశువుగా, అలవోకగా జరిగిపోయేవి.
జానపదులు కట్టిన పాటల్లో, బాణీల్లో సమకాలీన జీవితం ఉంటుంది. సమాజం మీద వ్యాఖ్యానం ఉంటుంది. అది చరిత్రలో సామాన్యుల అభిప్రాయంగా నమోదై ఉంటుంది. ఈ కారణం వల్లనే జానపదుల పాటల్లో, కథల్లో ఒకనాటి సామాజిక జీవితం కొంతయినా కనిపిస్తుంది. ఊహాల్లోంచి, విపరీత భక్తి పారవశ్యంలోంచి వచ్చిన పురాణాల్లో, ప్రబంధాల్లో సామాన్యుల జీవితం, జీవన విధానం మచ్చుకు కూడా కనిపించవు.

3
  • సమిష్టితనం.. సమైక్య గుణం..

శ్రమలోంచి పుట్టిన పాటలు, వాటి లయలూ, దరువులూ, స్వర స్థాయులూ.. ఆ శ్రామికుల పని ప్రదేశాన్ని, శ్రమ స్వభావాన్ని, తీవ్రతనీ ప్రతిబింబిస్తాయి. ఎందుకంటే అవి అవసరాల్లోంచి పుడతాయి. వారి తక్షణ జీవన అవసరాలను తీరుస్తూ.. క్రమంగా సాంస్కృతిక కళలుగా స్థిరపడతాయి. మేకల, గొర్రెల కాపర్లు తమ మందలను మేత కోసం దూరప్రాంతాలకు తోలుకు వెళతారు. రోజుల తరబడి తమ నివాసాలకు దూరంగా జీవాలతో కలిసి ఉంటారు. రాత్రివేళల్లో క్రూర మృగాల నుంచి, దొంగల నుంచి వాటిని కాపాడుకోవడం పెద్ద బాధ్యత. అందుకోసం పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ.. తప్పెట్లు మోగించటం, అంతే తీవ్ర శృతిలో రాగాలు తీయడం.. అవసరం అయింది. తర్వాతి కాలంలో అదే తప్పెటగుళ్లు కళారూపంగా పరిణామం చెందింది. ఏ పాటకైనా ఒక నడకా, తూగూ ఉంటాయి. శరీర కష్టం చేస్తున్నప్పుడు కాళ్లూ చేతుల కదలికలకు అనుగుణంగా లయ, తాళం ఏర్పడతాయి. చేసే పనిని బట్టే ఛందస్సు ఉంటుంది. ఏ జానపద కళ పుట్టుక వెనకైనా బతుకు అవసరం ఒక్కటే కారణంగా కనిపిస్తుంది.
అనేకమంది కలసి మెలసి ఆడి పాడినప్పుడే జానపదాలకు విలువ. అనేకమంది వీక్షకులై ప్రేక్షకులై ఆనందించినప్పుడే వాటి పరమార్థం నెరవేరుతుంది. పాల్గొనటం ద్వారానో, పరవశించటం ద్వారానో అనేకమందిని మమేకం చేయడం ప్రజాకళల స్వభావం. ఓ పున్నమి వెన్నెల రాత్రి వేళ.. ఎవరో ఒక పాట అందుకుంటారు. మరో మూల నుంచి ఇంకొకరు పిల్లనగ్రోవితో సమాధానమిస్తారు. మరొకరు మద్దెల దరువై మధ్యలోకి వస్తారు. కాసేపట్లో ఊరి కూడలి కమ్మని కచేరీగా మారుతుంది. కొందరు ఉత్సాహవంతులు నృత్యమై నర్తిస్తారు. కొందరు ఔత్సాహికులు చప్పట్లతో ప్రోత్సాహం అందిస్తారు. పిల్లలూ పెద్దలూ, మహిళలూ పురుషులూ.. ప్రతి ఒక్కరూ ఆ సందళ్ల దండలో ఒక్కో పువ్వై కలకల్లాడతారు. ఒకప్పుడు గ్రామాలు గ్రామాలుగానే వర్థిల్లినప్పుడు.. అవి శుద్ధ ప్రజా సాంస్క ృతిక వైభవాలుగా వికసించినప్పుడు కనిపించిన సహజ దృశ్యాలు ఇవి.

4
  • శ్రామిక సంస్కృతి .. సాధించిన ఉన్నతి

పనిని సందడిగా, పండగగా స్వీకరించే పరిస్థితిని మనుషులు ఆటపాటల ద్వారా సాధించారు. తమ జీవితంలోని అన్ని సందర్భాల్లోకీ పాటను ప్రవాహంగా మళ్లించారు. శారీరక శ్రమ ఎంతున్నా సరే.. పరమానందంగా జీవించారు. పనిని ప్రేమిస్తూ, పరమానందిస్తూ సాగటమే శ్రామిక సంస్కృతి. ప్రతి పనిని అందంగా, ఆనందంగా చేయటంలోని అంతరంగ సారమే శ్రమైక జీవన సౌందర్యం. తోటి మనుషులతో కలుస్తూ, కదులుతూ, విభిన్న సమూహాల ఆటపాటలకు ఆనందిస్తూ .. మనసారా జీవించటాన్ని శ్రామిక సంస్కృతి ప్రోత్సహిస్తుంది.
నాట్లు వేస్తూ, కలుపు తీస్తూ, కోత కోస్తూ, నూర్పిడి చేస్తూ, వడ్లు దంచుతూ, నీళ్లు మోస్తూ, బట్టలు ఉతుకుతూ, పడవ నడుపుతూ, బరువులు మోస్తూ, బావి తవ్వుతూ, బిడ్డను ఆడిస్తూ, అన్నం తినిపిస్తూ, ఊయలూపుతూ, పెళ్లి వేడుక చేస్తూ, అప్పగింతలు చెబుతూ.. ఆనంద నందనంగా వర్థిల్లిన పాటలూ, ఆటలూ - అనంతర కాలంలో ఉత్పత్తి క్రమంలో లేని పండితవర్గం వద్ద మరొక రూపం తీసుకున్నాయి. ఎలా అయితే అలా సృష్టించి, ఎలా వీలైతే అలా నర్తించిన పాటలు, అభినయాలు శాస్త్రీయ సంగీతంగా, శాస్త్రీయ నృత్యంగా వేరుపడి, అభివృద్ధి చెందాయి. ఆరాధన, ఆధ్యాత్మికత అందులో హెచ్చు స్థానాన్ని ఆక్రమించాయి. అనేక నియమ నిబంధనలు వచ్చి చేరాయి. ఆ క్రమంలో కొన్ని తరగతుల్లోనే అవి ప్రవర్థమానం అయ్యాయి. శ్రమ నుంచి విడివడి సాగటం వల్ల.. వాటిలో సామాజిక జీవితాన్ని ప్రతిబించటం తగ్గి, దైవ స్తుతి, అతిశయం, ఆరాధన పెరిగాయి. రాజాస్థానాలను రంజింపచేసే ప్రదర్శనలుగా మారి, బహుమానాలతో, సత్కారాలతో పరవశించి, సామాన్యులకు దూరం అయ్యాయి.
అయినప్పటికీ జానపదం ఒక ప్రధాన స్రవంతిగా నిరంతరంగా, సజీవంగా, సమాజ ప్రతిబింబంగా వర్థిల్లుతూనే ఉంది. గ్రామీణ జీవన విధానం బలంగా సాగినంతకాలం పనీపాటలు పున్నమి వెన్నెల్లా వెలుగొందాయి. ఆబాల గోపాలాన్ని ఒక్కచోటకు రప్పించి, అమితంగా మెప్పించాయి. పట్టణాలకు సినిమా ధియేటర్లూ, ఇంటింటికీ టీవీలూ, ప్రతి చేతికీ సెల్‌ఫోన్లూ.. సమకూరిన ప్రతి సందర్భమూ ప్రజాకళలు నెమ్మది నెమ్మదిగా ప్రాభవం కోల్పోయేలా చేసింది. కళ ఏదైనా సరే.. అది ఎలాంటి నేపథ్యంలోంచి వచ్చిందో- ఆ పరిస్థితులనే ప్రతిబింబిస్తుంది. కళలో పెట్టుబడి ప్రవేశించాక, దాని అవసరాలను అందుకోవటానికే అది ఉపయోగపడ్డం మొదలైంది! అందువల్లనే ఇప్పుడు మన సినిమాల్లో ప్రజాజీవితం పెద్దగా కనిపించదు. సామాన్య వృత్తి జీవితాలు తారసపడవు. పల్లెటూళ్లు కనిపించినా అవి నగరాల నుంచి వచ్చే సంపన్న కుటుంబాలకు అందమైన విడిది ఇళ్లులాగా అనిపిస్తాయి. గ్రామాల్లోని మానవ సంబంధాలు, సమైక్య జీవనం, భిన్న సంస్క ృతులు, వాటి మధ్య వికసించాల్సిన సౌభ్రాతృత్వ, సామరస్య అనుబంధాలూ ... వ్యాపార తెరలకు అంతగా పట్టని విషయాలుగా మారిపోయాయి.

3
  • వారసత్వం కొనసాగించాలి

మన దేశ అంతరాత్మను పట్టించే ఆనవాళ్లు శ్రామిక సాంస్కృతిక కళల్లోనే దొరుకుతాయి. మనుషులను కలిపి ఉంచే మహత్తు అక్కడే ఉంది. భిన్నత్వాన్ని ఆస్వాదించే సాంస్కృతిక వారసత్వం సామాన్య ప్రజలది. శ్రమ ఆధారంగా బతికే మనుషులు చేతనకు, ఆచరణకు మాత్రమే ప్రాధాన్యమిస్తారు. మానవ సహజమైన స్పందనలతో ప్రవర్తిస్తారు. ఊళ్లో ఎవరు ఏ ఉత్సవం చేసినా అందరూ పాల్గొనటం, తాము పాటించని ఆచారాలను సైతం గౌరవించటం.. ప్రజా సంస్కృతి. దేవుళ్లను, దేవతలను తోటి మనుషుల వలే సామాన్యులు సంభావిస్తారు. సీతమ్మ కష్టాలకు కన్నీరు పెడతారు. ఆరాధించే దేవుడిని సైతం ఆచరణ ఆధారంగానే అంచనా వేస్తారు. వ్యాఖ్యలు చేస్తారు. జానపదులు అల్లుకున్న అనేక పాటలు ఇంత సహజంగానే సాగుతాయి. కృష్ణుడిని మాయలోడు అంటారు. రాముడు తన భార్యను అలా అనుమానించవొచ్చా? అని ప్రశ్నిస్తారు. దేవేంద్రుడిని దుర్మార్గుడని దూషిస్తారు. గ్రామదేవతలతో వాదనకు దిగుతారు. 'ఈ పిల్లకు ఇన్ని కష్టాలు పెట్టావు. నీకు బుద్ధుందా?' అని దేవుడిని గద్దిస్తారు. ఇంకా కోపమొస్తే తిడతారు. పాటలు కట్టి పాడతారు. ఇప్పుడు కొంతమంది ఇలాంటి సహజ సంస్కృతి స్థానే - ఉన్మాదం రగిలించే ప్రయత్నం చేస్తున్నారు. విభిన్నతను, వైవిధ్యాన్నీ గౌరవించే శ్రామిక ప్రజాసంస్కృతిని ప్రదర్శించటమే అలాంటి శక్తులకు సమాధానం.

2
  • పనికి ఊతం ..ప్రజా ఉద్యమాలకు ఉపకరణం..

మానవ జీవితంలో ఓ భాగంగా కలగలిసిపోయిన పాట - ఆహ్లాదం కలిగించటానికో, అలసటను మరిపించటానికో పరిమితం కాలేదు. 'కళ కళ కోసం కాదు; ప్రజల కోసం .. ప్రగతి కోసం' అన్న స్ఫూర్తి దాకా ఎదిగింది. వామపక్ష ఉద్యమాలు ప్రారంభం కావటానికి ముందే- జానపదాల రూపంలో ప్రజల గొంతును బలంగా వినిపించింది. ఆనాటి పాలకుల దౌర్జన్యాలను నిలదీసింది. స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రజలను ఉర్రూతలూగించింది. తెలంగాణా సాయుధ పోరాటంలో సామాన్యులను కదలించి, కదం తొక్కించింది. 'బండెనక బండి కట్టి ఏ బండిన పోతవ్‌ కొడకో .. నైజం సర్కరోడా ..' అని ధైర్యంగా నిలేసింది! ప్రపంచంలో ఎక్కడ ఏ గొంతు హక్కుల కోసం నినదించినా - అది పతాక స్థాయిలో వినపడేది, ప్రభావం కలగించేది పాట రూపంలోనే!
పాటను, ప్రజాకళలను ప్రజా ఉద్యమాలకు బాసటగా కొనసాగించటంలో కమ్యూనిస్టు ఉద్యమాలు కీలకపాత్ర పోషించాయి. ప్రజల భాషలో ప్రజల సమస్యలను వివరించటానికి, ప్రజలను సమీకరించటానికి ప్రజాకళలు ఎంతో దోహదపడ్డాయి. ఒక్కోసారి వంద ప్రసంగాలు చేయలేని పనిని ఒక్క పాట అద్భుతంగా చేయగలుగుతుంది. 1930 దశకంలో తెలుగు ప్రజల ప్రాధాన్యాన్ని, వారసత్వ ప్రత్యేకతనీ చాటే గేయాలు కావాలని పుచ్చలపల్లి సుందరయ్య ఆహ్వానించారు. ఆ ప్రయత్నంలోంచే ''చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా .. గతమెంతొ ఘనకీర్తి గలవోడా..'', వంటి గేయాలు వచ్చాయి. ''విశాలాంధ్రలో ప్రజారాజ్యం'' పేరిట సుందరయ్య రాసిన రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ప్రణాళిక ప్రతి అధ్యాయం... ప్రముఖ కవుల ప్రబోధ గీతాలతోనే ప్రారంభమవుతుంది. శ్రమకు ఊతంగా పుట్టిన పాట.. ఆ శ్రమలోంచి పుట్టిన సంపద ఎవరెవరికి ఎలా చెందాలో సాగిన పోరాటాలకు ఊపిరిగా నిలబడ్డం ఓ గొప్ప సంగతి!

2
  • శ్రమను కీర్తించిన పాటలు, మాటలు

పనికి తోడుగా, జోడుగా, జోరుగా శ్రమ నుంచి పుట్టిన పాటలు తరతరాలను అలరించాయి. పనికి పాట ఒక ఆభరణం అయితే, పాటకు పని ఒక ఆలంబనం. ఈ రెంటికీ ఉన్న బంధం మీద ఎందరో ఎన్నో మంచి మాటలు చెప్పారు. ''శ్రమ తోడనే పుట్టు సర్వంబు'' అన్నాడు వేమన. ''నరుల చెమటను తడిచి మూలం ధనం పంటలు పండవలెనోరు'' అని ఆకాంక్షించాడు గురజాడ. ''శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని'' తేల్చి చెప్పాడు శ్రీశ్రీ. ''శ్రమజీవే జగతికి మూలం/ చెమటోడ్చక జరగదు కాలం/ రేపన్నది మనదే నేస్తం/ శ్రమశక్తే విశ్వ సమస్తం'' అన్నాడో ప్రజాకవి. ''కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడీ దాన/ బుగ్గమీద గులాబి రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా?/ నిన్ను మించిన కన్నెలెందరొ మండుటెండలో మాడిపోతే/ వారి బుగ్గల నిగ్గు వచ్చి నీకు చేరెను తెలుసుకో'' అన్నారు సినీ కవి ఆత్రేయ. సంపద, సౌకర్యాల వెనక శ్రమ పాత్ర గురించి ఒక్క పాటలో చెప్పేశారు. ''మా కండలు పిండిన నెత్తురు/ మీ పెళ్లికి చిలికిన అత్తరు/ మా మొహాలకు కన్నీరా/ మీ ముఖాలకూ పన్నీరా?''. ఇది దోపిడీకి గురైన శ్రమజీవి సూటి ప్రశ్న. ప్రముఖ సినీ గీత రచయిత సుద్దాల అశోక్‌తేజ శ్రమ నుంచి పాట ఎలా పుట్టిందో అద్భుతంగా రాశారు. శ్రముడు - శ్రమి ప్రధాన పాత్రలుగా శ్రమకావ్యం కూడా రాశారు. అంతర్జాతీయ కార్మిక గీతం ''ఆకలిమంటలు మలమలలాడే అనాధలందరూ లేవండోరు!'' అని శ్రమజీవుల కర్తవ్యాన్ని నిరంతరంగా ప్రబోధిస్తూనే ఉంది.

1
  • మే దినోత్సవం ..

మే డే ప్రపంచ కార్మికదినం. చికాగో అమరవీరుల త్యాగఫలం. ఒక చారిత్రాత్మక చైతన్య సందర్భం. శ్రమకు, సంపదకు ఉన్న సంబంధాన్ని చాటి చెప్పిన తరుణం. పెట్టుబడిదారులు యాంత్రిక యుగం రాకముందు కష్టజీవుల శ్రమను ఏళ్ల తరబడి విపరీతంగా దోచుకున్నారు. ఆ సమయంలో చికాగో కార్మికులు 'మేమూ మనుషులమే, మా శక్తికి కూడా పరిమితులుంటాయి. ఈ చాకిరీ చేయలేమంటూ పనిముట్లు కింద పడేసి 8 గంటల పనిదినం కోసం పోరాడారు. అనేక రోజులు అనేక రూపాల్లో ఆందోళన సాగించారు. ఈ నేపథ్యంలో మే 4, 1886న చికాగోలో కార్మికులపై పోలీసులు విరుచుకుపడ్డారు. దౌర్జన్యం చేశారు. అయినా, వెనకడుగు వేయని కార్మికులు పట్టుదలతో పోరాడి, 8 గంటల పనిదినం సాధించారు. ఈ పోరాటంలో పాల్గొన్న 8 మంది కార్మికులను పాలకవర్గం కుట్రపూరితంగా ఉరి తీసింది. ఇది ప్రపంచ కార్మికులను తీవ్ర ఆగ్రహావేశాలకు గురి చేసింది. చికాగో కార్మికుల పోరాట స్ఫూర్తి ప్రపంచమంతటా వ్యాపించింది. ఈ నేపథ్యంలో 1889లో మే 1ని అంతర్జాతీయ కార్మికుల దినోత్సవంగా ప్రకటించారు.
మనదేశంలో అంతకంటే ముందే, 1862లో కోల్‌కతాలో రైల్వే కార్మికులు నిర్ణీత పనిగంటల కోసం సమ్మె చేశారు. అప్పటివరకు వారు 10 గంటలు పనిచేసేవారు. పాలకవర్గానికి చెందిన అధికారులు ఎన్ని గంటలు పనిచేస్తారో తామూ అన్ని గంటలే పనిచేస్తామని కార్మికులు డిమాండ్‌ చేశారు. 1923లో మొదటిసారి మనదేశంలో 'మే డే'ను పాటించారు. ఆ సందర్భానికి ఇది వందేళ్ల సంబరం! చికాగో కార్మిక పోరాటం మీద, మేడే స్ఫూర్తి మీదా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది పాటలూ ప్రచారంలో ఉన్నాయి. మేడే రోజున అన్ని దేశాల్లోనూ కార్మికులు భారీ ప్రదర్శనలు చేపడతారు. శ్రామిక శక్తిని, సంస్క ృతిని ప్రతిబింబించే సాంస్క ృతిక ఉత్సవాలు జరుపుతారు.

సత్యాజీ
94900 99167