పండుగ అనగానే ఇల్లు శుభ్రం చేసుకోవడం, పిండి వంటలు వండుకోవడం పూర్వకాలం నుంచీ వస్తున్న ఆనవాయితీ. పూర్వం ఏ పండుగ ఏ ఋతువులో వస్తుందో ఆ ఋతువులో ఏ ఏ పదార్థాలు తీసుకుంటే మంచిదో ఆ పదార్థాలు కొన్ని రోజుల పాటు నిలువ ఉండేలా వండుకునేవారు. కొన్ని పదార్థాలు ఒక్కరితో పూర్తయ్యేవి కావు. సమిష్టిగా చేసుకోవలసిందే. చిన్న కుటుంబాలు ఏర్పడడం మొదలైన తరువాత సింపుల్‌గా అయిపోయేవి, ఒంటరిగా చేసుకోవడం అలవాటైంది. అయినా పండుగ పండుగే కదా. మరి దసరా పండుగకు కొన్ని పదార్థాలను ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం..
కొబ్బరి బూరెలు
కావలసిన పదార్థాలు: తడి బియ్యపుపిండి - కేజీ, బెల్లం- 750గ్రా, నువ్వులు 1/4 కప్పు, పచ్చికొబ్బరి తురుము 1కాయ, యాలుకల పొడి1/2 స్పూన్, నెయ్యి 1/4 కప్పు, నూనె డీప్‌ఫ్రైకి సరిపోయేంత.
(తడి బియ్యపు పిండి కోసం రాత్రంతా నానబెట్టిన బియ్యాన్ని శుభ్రంగా కడుక్కుని, పూర్తిగా నీరు పోయే వరకూ కాటన్ క్లాత్‌లో కానీ, వడబుట్టలో కానీ వడగట్టాలి. ఆ బియ్యాన్ని పిండి పట్టించుకుని పాకంలో కలిపే వరకూ ఆరిపోకుండా గట్టిగా అదిమి ఉంచి, తడిగుడ్డ కప్పాలి.
తయారీ: స్టౌ మీద ఒక గిన్నెలో బెల్లం తీసుకుని చిన్నగ్లాసు నీటిని పోసి తిప్పుతూ బెల్లం కరిగిన తరువాత వేరే గిన్నెలోకి వడగట్టుకోవాలి. దానిని స్టౌ మీద పెట్టి, తిప్పుతూ లేత పాకం రానివ్వాలి. పాకం కరెక్టుగా వచ్చిన వెంటనే కొబ్బరి తురుము, యాలకుల పొడి, నెయ్యి, నువ్వులు వేసి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి. తరువాత స్టౌ ఆఫ్ చేసి, కొంచెం కొంచెం పిండి పాకంలో వేస్తూ గబగబా కలుపుతూ చలిమిడి తయారుచేయాలి. ఆరిపోకుండా మూతపెట్టుకోవాలి.
బాండీలో డీప్ ఫ్రైకి కావలసినంత నూనె తీసుకొని, పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని. వాటిని అరిటాకుపై రౌండ్‌గా వత్తుకోవాలి. వాటిని ఒక్కొక్కటి బాగా వేడైన నూనెలో వేసుకుంటూ రెండువైపులా కాల్చుకోవాలి. అంతే కొబ్బరి బూరెలు రెడీ.
చక్రాలు..
కావలసిన పదార్థాలు : అటుకులు - కప్పు, పుట్నాల పప్పు - అర కప్పు, బియ్యప్పిండి - కప్పు, జీర - స్పూన్, నువ్వులు - స్పూన్, మిరియాల పొడి - అర స్పూన్, వెన్న - రెండు స్పూన్‌లు, నీళ్లు - తగినన్ని.
తయారీ: అటుకులు, పుట్నాల పప్పులను మూడు నిమిషాల పాటు వేపి, మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక గిన్నెలోకి బియ్యప్పిండి, అటుకుల పిండి మిశ్రమం, జీర, నువ్వులు, మిరియాల పొడి, వెన్న బాగా కలిపి వేడినీటితో ముద్దగా చేయాలి. ఇప్పుడు బాగా కాగిన నూనెలో చక్రాల గిద్దతో వత్తుకోవాలి. క్రిస్పీగా ఉండే చక్రాలు రెడీ.
బర్ఫీ
కావలసిన పదార్థాలు: వెన్నతీయని పాలు - లీటరు, పంచదార - 1/4 కప్పు, డ్రై ఫ్రూట్స్, నెయ్యి - స్పూన్ చొప్పున, యాలకుల పొడి - అర స్పూన్, చాకో పౌడర్ - స్పూన్.
తయారీ: లోతుగా, శుభ్రంగా ఉన్న ఇనుప బాండీని స్టౌపై ఉంచి, పాలు పోసి అవి చిక్కబడి మూడవ వంతు అయ్యేవరకూ మీగడ కట్టకుండా తిప్పుతూ కాయాలి. పెరుగులా చిక్కగా అయిన తరువాత పంచదార, యాలకుల పొడి, నెయ్యి వేసి స్వీటు బాండీకి అంటనంత వరకూ తిప్పుతూ ఉడికించాలి. దగ్గరపడిన తరువాత సగభాగం ఒక ప్లేటులోకి తీసుకుని, బాండీలోని స్వీటుకు చాకోపౌడర్ వేసి, బాగా కలుపుకోవాలి. రెండు భాగాలను విడివిడిగా ముద్దగా చేసుకోవాలి. ఇప్పుడు నెయ్యిరాసిన ప్లేట్‌లోకి ఒక భాగాన్ని తీసుకుని, చపాతీ కర్రతో అర అంగుళం మందం ఉండేలా ఒత్తుకోవాలి. నాలుగువైపులా స్క్వేర్‌షేప్‌లో కట్ చేసుకోవాలి. రెండవ భాగాన్ని ముందుగా ఒత్తుకున్న దానిపై ఉంచి మరల అదే స్క్వేర్‌షేప్‌ను కవర్ చేసేలా చపాతీ కర్రతో ఒత్తుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక్కొక్క ముక్కపై నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ అలంకరించుకుంటే చాకొలేట్ బర్ఫీ రెడీ!
బిస్కెట్స్..
కావలసిన పదార్థాలు : గోధుమపిండి - కప్పు, ఉప్పు - తగినంత, కారం - 1/2 స్పూన్, వాము - 1/2 స్పూన్, మెంతి ఆకుల తరుగు - స్పూన్, నెయ్యి - 2 స్పూన్లు.
తయారీ: ఒక గిన్నెలోకి గోధుమపిండి, ఉప్పు, దంచిన వాము, మెంతికూర తరుగు, కరివేపాకు, నెయ్యి వేసి, బాగా కలపాలి. తరువాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా ముద్దగా కలపాలి. దీనిపై తడిగుడ్డ కప్పి, పదినిమిషాల పాటు పక్కన ఉంచాలి.
చిన్నబౌల్‌లో స్పూన్ గోధుమపిండి, స్పూన్ నెయ్యి కలిపిన మిశ్రమాన్ని ఉంచుకోవాలి.
ఇప్పుడు కలిపిపెట్టిన పిండిని మరల ఒకసారి కలుపుకొని, చపాతీలు చేసుకోవాలి. వాటిపై గోధుమపిండి, నెయ్యి మిశ్రమాన్ని అప్లై చేసి చాపలా చుట్టి, చిన్నచిన్న రోల్స్‌ను కట్ చేసుకోవాలి. వాటిని మరల చిన్న పూరీలలా ఒత్తుకొని గోధుమపిండి, నెయ్యి మిశ్రమాన్ని అప్లైచేసి సగానికి మడిచి, మరల ఆ మిశ్రమాన్ని అప్లై చేసుకొని, గరాటు ఆకారానికి అంటే మరల సగానికి మడిచి, పొరలు అంటుకునేలా నెమ్మదిగా తట్టాలి. వాటన్నింటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి నెల రోజులు నిల్వ ఉంటాయి. రుచిగానూ ఉంటాయి.