
కేరళలో 2018లో వచ్చిన వరదలు, ఆ తర్వాత వచ్చిన కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రజల భాగస్వామ్యం ప్రపంచాన్ని ఆకర్షించిందంటే దానికి కారణం అక్కడవున్న పటిష్టమైన పంచాయితీ వ్యవస్థ. మన రాష్ట్రంలో నిజంగా పాలన వికేంద్రీకరణ విధానం అమలు కావాలంటే వాలంటీర్ల వ్యవస్థను పంచాయతీ పాలన కిందకు తెచ్చి ఎన్నికైన స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా గ్రామ సభలు జరపడం, అక్కడ ప్రణాళికలు రూపొందించడం, వాటి అమలుకు సరిపడా నిధులను రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించడం, అమలులో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం జరగాలి.
గ్రామ స్థాయి నుండే పజాస్వామ్య స్ఫూర్తి పరిఢవిల్లాలని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. అందుకే రాజ్యాంగంలోని నలభయ్యవ అధికరణంలో స్థానిక స్వపరిపాలన ప్రాముఖ్యతను గురించి పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్, కేరళ, త్రిపుర రాష్ట్రాల్లో మినహా దాదాపు అన్ని రాష్ట్రాల్లో పంచాయతీ వ్యవస్థను పాలకులు నిర్వీర్యం చేస్తూ వచ్చారు. వాటికి నిధులు, విధులు కేటాయించకుండా ఉత్సవ విగ్రహాలుగా మార్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థ పంచాయతీలను మరింత బలహీనం చేసింది. ప్రభుత్వ పథకాలు, సేవలు ప్రజలకు అందించేందుకు ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థ సకాలంలో పింఛన్ల పంపిణీ, ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి కొంత తోడ్పడింది. అయితే ఎన్నికైన గ్రామ ప్రజా ప్రతినిధుల ప్రాధాన్యతను పూర్తిగా తగ్గించివేసింది. మరోవైపు పంచాయతీలకు రావాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలకు మళ్ళించుకుంటుంది. అందువల్ల పంచాయతీలు తమ కనీస విధులను నిర్వహించలేకపోతున్నాయి. కీలకమైన విషయాన్ని వదిలేసి సమస్యలన్నింటికీ వాలంటీర్లు మూలమైనట్లు, మహిళల అదృశ్యానికి వీరే కారణమైనట్లు జనసేన నేత మాట్లాడడం, వాలంటీర్లు వైసిపి ఏజెంట్లు అంటూ ప్రచారం చేస్తున్న టిడిపి నేతలు తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయబోమని చెప్పడం ద్వారా ఇప్పుడున్న వారిని తొలగించి తమ వారిని నియమించుకుంటామనే అర్థంలో మాట్లాడుతున్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య మనుగడలో పంచాయతీ వ్యవస్థ స్ఫూర్తి, దాని పురోగతి అత్యంత కీలకమనే విషయాన్ని పాలక పార్టీలు ఉద్దేశ్యపూర్వకంగానే నిర్లక్ష్యం చేస్తున్నాయి.
పంచాయతీ వ్యవస్థ ఆవిర్భావం
స్వాతంత్య్రం తర్వాత భారతదేశంలో పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు, జిల్లా బోర్డులు అనే మూడంచల పాలన వ్యవస్థ ఏర్పడింది. గ్రామ పరిపాలన ప్రాధాన్యత గురించి మొదటి పార్లమెంట్ సమావేశాల్లోనే కమ్యూనిస్టులు లేవనెత్తారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా తెలంగాణలో జరిగిన రైతాంగ సాయుధ పోరాటం ద్వారా ఏర్పడిన గ్రామస్వరాజ్య విధానం పాలకులు గ్రామ పరిపాలన అమలు చేసేటట్లు ఒత్తిడి చేసాయి. బల్వంతరారు మెహతా ఆధ్వర్యాన పంచాయతీరాజ్ వ్యవస్థ పరిశీలన కోసం కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ సిఫార్సులతో 1959లో పంచాయతీ వ్యవస్థ ఏర్పడింది. దేశంలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో అలాంటి పంచాయతీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీని ద్వారా పంచాయతీలు, పంచాయతీ సమితులు, జిల్లా పరిషత్తులు ఏర్పడ్డాయి. తెలుగు ప్రజలు గతంలో కొంత భాగం మద్రాసు రాష్ట్రంలో, మరికొంత నిజాం ప్రభుత్వంలో వుండడం వల్ల ఈ రెండు ప్రాంతాలకు రెండు పంచాయతీ చట్టాలు వుండేవి. మద్రాసు గ్రామ పంచాయతీ చట్టం- 1950, హైదరాబాద్ గ్రామ పంచాయతీ చట్టం-1956 లను 1964లో రద్దు చేసి ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ చట్టం ఏర్పడింది. ఆ తర్వాత కొంత కాలానికి పంచాయతీ సమితులు, గ్రామ పంచాయతీల పనితీరు పరిశీలించిన అశోక్ మెహతా కమిటీ 1978లో తన సిఫార్సులు చేసింది. దాని ఫలితంగా 1986లో 330 పంచాయతీ సమితుల స్థానంలో 1096 మండల పరిషత్తులు ఏర్పడ్డాయి.
దేశవ్యాపితంగా స్థానిక స్వపరిపాలన పటిష్టంగా అమలు చేయడం కోసం 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా రాజ్యాంగంలో 9, 9ఎ విభాగాలను అదనంగా చేర్చారు. 11వ షెడ్యూల్ ద్వారా 29 అంశాలు నిర్వహించడానికి గ్రామ పంచాయతీలకు పూర్తి అధికారాలు ఇచ్చారు. దీనిద్వారా ప్రజలకు అవసరమైన ప్రాథమిక, కనీస సదుపాయాలు కల్పించడం, వాటిని నిర్వహించడం పంచాయతీల పరిధిలోకి వచ్చింది. గ్రామీణ వ్యవస్థ లోని భూస్వాములు, ధనిక రైతాంగం పంచాయతీ ఎన్నికలు జరగకుండా, తమ పెత్తనాన్ని కొనసాగించుకునేందుకు మొదటి నుండి ప్రయత్నించారు. అయితే సిపిఎం నాయకత్వంలో బెంగాల్, కేరళ, త్రిపుర రాష్ట్రాల్లో ఏర్పడిన వామపక్ష ప్రభుత్వాలు పంచాయతీల ఎన్నికలకు, వాటి నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చాయి. గ్రామ సభలు నిరంతరం జరపడం ద్వారా స్థానిక ప్రజా ప్రతినిధులకు పాలనలో నిజమైన భాగస్వామ్యం కల్పించారు. అందులో ప్రభుత్వ పథకాలకు అర్హుల ఎంపిక, అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడం, ప్రతి ఐదు సంవత్సరాలకు క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఆ రాష్ట్రాల బడ్జెట్ నుండి గ్రామ పంచాయతీలకు 30 నుండి 37 శాతం నిధులు కేటాయించేవారు. ఈ నిధులను గ్రామ పంచాయతీలకు బదిలీ చేయడం, వాటి ద్వారా ప్రజా సేవ, అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ఆదర్శవంతమైన గ్రామపాలన అందించారు. అందుకే ఈ రాష్ట్రాల పంచాయతీలు దేశంలోనే కాదు ప్రపంచ మన్ననలు పొందాయి. ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికలు నిర్దిష్ట గడువులో నిర్వహిస్తేనే కేంద్రం నిధులు విడుదల చేసే విధంగా నిబంధనలు మార్చాల్సి వచ్చింది. మంచి లక్ష్యంతో ఏర్పడిన పంచాయతీ రాజ్ వ్యవస్థ ప్రారంభం నుండి విధులు, నిధుల కొరతను ఎదుర్కోవలసి వచ్చింది.
వాలంటీర్ వ్యవస్థ
ఆంధ్రప్రదేశ్‌లో జి.వో నెం: 104 ద్వారా 2019 ఆగస్టు 15న గ్రామ వాలంటీర్ వ్యవస్థ అమలులోకి వచ్చింది. ఈ వ్యవస్థ ద్వారా 'ప్రభుత్వ సంక్షేమ పథకాలను, సేవలను, కుల, మత, వర్గ, లింగ, రాజకీయ అనుబంధాలకు అతీతంగా అర్హులైన లబ్ధిదార్లకు 'నవరత్నాల' రూపంలో చేరవేయడం లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రెండు వేల జనాభాకు ఒక గ్రామ సచివాలయం అందులో పది మంది సిబ్బంది, 50 కుటుంబాలకు ఒక వాలంటీర్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో లక్ష 34 వేల మంది సచివాలయ సిబ్బంది, రెండు లక్షల 65 వేల మంది వాలంటీర్లు వచ్చినప్పటికీ గ్రామ పంచాయతీలు బలపడకపోగా, మరింత బలహీనపడ్డాయి. సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు కొన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి నెల మొదటి తేదీన పింఛను అందించడం, పథకాల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ, రైతుభరోసా, విద్యాదీవెన, విద్యా వసతి, గోరుముద్ద లాంటి పథకాల అమలులో సాంకేతిక అభ్యంతరాలను సరిదిద్దే ప్రయత్నం వాలంటీర్లు చేస్తున్నారు. ప్రతి చిన్న పనికి తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా గ్రామంలోనే పాలనాపరమైన ఇలాంటి పనులు జరగడం మంచి విషయం. అయితే వాలంటీర్లలో అత్యధిక మంది అధికార పార్టీకి సంబంధించిన వారు కావడం, పాలనా పరమైన పనులన్నింటికీ వీరే కీలకంగా మారడంతో పంచాయతీ అధికారులు, ఎన్నికైన పంచాయతీ ప్రజా ప్రతినిధులు ఉత్సవ విగ్రహాలుగా మారారు. లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ పెత్తనం పెరిగింది. ప్రతి కుటుంబం గురించి ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితుల వివరాలు ఈ వాలంటీర్ల దగ్గర వుండడం వల్ల ప్రజలను భయపెట్టడం, అవినీతికి, అనైతిక పనులకు పాల్పడుతున్న సంఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ప్రజల ఆధార్, రేషన్ కార్డు, బ్యాంకు అకౌంట్, భూమి వివరాల లాంటి సమగ్ర సమాచారం ఈ వాలంటీర్ల వద్దకు చేరింది. ఈ సమాచారానికి భద్రత ఎంత?
పంచాయతీలు నిర్వీర్యం
గ్రామాల్లో వీధిలైట్లు, మంచినీటి కొళాయిల ఏర్పాట్లు, కాలవల మరమ్మతులు, చెత్త శుభ్రం చేయించడం లాంటి రోజువారీ పనులకు కూడా పంచాయతీల వద్ద నిధులు లేవు. ప్రభుత్వం నుండి అందే సంక్షేమ పథకాల అమలులో స్థానిక ప్రజాప్రతినిధుల పాత్ర లేదు. అందుకే ప్రజల చేత ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లు రోడ్లపైకెక్కి ఉద్యమిస్తున్నారు. పోలీసు నిర్బంధాన్ని ఎదిరించి తమ బాధలను వినిపించే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో అత్యధిక సర్పంచులు అధికార పార్టీ వారే అయినప్పటికీ ఆందోళనలు చేస్తున్నారంటే పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్థమవుతుంది.
రాష్ట్రంలో మూడున్నర కోట్ల గ్రామీణ ప్రజలకు 12,918 మంది సర్పంచులు ప్రతినిధులుగా వున్నారు. పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం ద్వారా 2018-19లో రూ.1729.23 కోట్లు, 2019-20లో రూ.2,336.5 కోట్లు వచ్చాయి. 15వ ఆర్థిక సంఘం ద్వారా 2020-21లో రూ.2,625 కోట్లు, 2021-22లో రూ.1,939 కోట్లు...మొత్తం రూ.8,629.73 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానాకు మళ్లించింది. సిఎంఎఫ్‌ఎస్ అకౌంట్ల నుండి రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ నిధులను మళ్లించుకుంటుంది. కేంద్ర ఆర్థిక సంఘం నుండి 2022-23, 2023-24 సంవత్సరాలకు వచ్చిన రూ.4,041 కోట్ల నిధులను పంచాయతీలకు విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తన దగ్గర నిలుపుకుంది. అంతేకాకుండా రిజిస్ట్రేషన్లపై పంచాయతీలకు ఈ సంవత్సరం జనవరి నుండి రావలసిన స్టాంపు డ్యూటీ వాటా సుమారు నాలుగు వేల కోట్లు ఇవ్వడంలేదు.
నిధుల కొరతతో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం అవుతుంటే...9 వేల కోట్లతో 35 వేల సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు కట్టడంవల్ల ఏం ఉపయోగం? పంచాయతీ వ్యవస్థను బలహీనం చేసి అధికార యంత్రాంగం ద్వారా, తమ పార్టీ కార్యకర్తల ద్వారా పరిపాలిస్తున్నారు. దేశంలో అమలవుతున్న వినాశకర ఆర్థిక విధానాల కేంద్రీకృత పాలన లక్ష్యంగా వున్నాయి. రాష్ట్రంలో అమలవుతున్న ఈ చర్యలన్నీ అందులో భాగమే. ఇప్పటికే రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర, ఉమ్మడి జాబితాల్లో వున్న విద్య, వ్యవసాయం, విద్యుత్, ప్రాథమిక ఆరోగ్యం, మంచినీటి సరఫరా లాంటి వాటన్నింటిలో కేంద్ర పెత్తనం పెరిగింది. ఈ రంగాలన్నింటినీ కార్పొరేట్ కంపెనీలకు అప్పగించేందుకు కేంద్ర బిజెపి ప్రభుత్వం చట్టాలు రూపొందిస్తుంది. తమ హక్కులు హరించుకుపోతుంటే ప్రశ్నించలేని రాష్ట్ర ప్రభుత్వం హక్కుల రక్షణ కోరుతున్న సర్పంచులపై నిర్బంధాన్ని ప్రయోగిస్తోంది. ప్రజల చెంతకే పాలన అంటే భవనాలు కట్టడం, తాత్కాలిక సిబ్బందిని పెంచడం కాదు, స్థానిక సంస్థలకు నిధులు పెంచి వాటి ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి. కేరళలో 2018లో వచ్చిన వరదలు, ఆ తర్వాత వచ్చిన కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రజల భాగస్వామ్యం ప్రపంచాన్ని ఆకర్షించిందంటే దానికి కారణం అక్కడవున్న పటిష్టమైన పంచాయితీ వ్యవస్థ. మన రాష్ట్రంలో నిజంగా పాలన వికేంద్రీకరణ విధానం అమలు కావాలంటే వాలంటీర్ల వ్యవస్థను పంచాయతీ పాలన కిందకు తెచ్చి ఎన్నికైన స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా గ్రామ సభలు జరపడం, అక్కడ ప్రణాళికలు రూపొందించడం, వాటి అమలుకు సరిపడా నిధులను రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించడం, అమలులో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం జరగాలి.
/ వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు /
వి. రాంభూపాల్