Aug 20,2023 13:15

తాటి పండు అనగానే కాల్చిన తాటి గుజ్జు.. తాండ్ర.. బూరెలు.. గుర్తొస్తాయి కదూ. అంతేనా కట్టెల పొయ్యిమీద వంట చేస్తూనే బయటికి వచ్చే మంటతో వీటిని కాల్చుకోవడం తీపి గుర్తులే. కాలానుగుణంగా సంవత్సరంలో కొన్ని నెలలే లభించే పండ్లలో తాటిపండు ఒకటి. సిటీస్‌లో కొనుక్కుంటున్నాం కానీ ఇప్పుడు.. గ్రామాలలో ఇళ్ళ పక్కనే ఉండి, మనిషి జీవనంలో ఇవీ పాలుపంచుకుంటాయి. వేసవిలో ముంజెలు, వర్షాకాలంలో తాటి పండ్లు, చలికాలం ప్రారంభంలో తేగలు ఇలా.. ఒక్క కాయ భాగం నుంచే ఇన్ని పదార్థాలను ఇచ్చే ఘనత తాడిచెట్టుదే. ఆ పండుతో ఎప్పుడూ చేసుకునే పదార్థాలే కాక మరికొన్ని కొత్త రుచులు తెలుసుకుందాం.

55

                                                                           గుజ్జును తీయడం..

తినుబండారాలు తయారు చేసేందుకు తీసుకునే తాటి గుజ్జును పీచు లేకుండా తీసుకోవాలి. అది ఎలాగంటే.. పక్వానికి వచ్చిన తాటి పండు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. దాని ముచ్చికను చాకుతో తీసి, చేతితోనే పైతోలు తీసేయాలి. లోపల పసుపు రంగులో ఉండే టెంకెల భాగమంతా పీచుతో ఉంటుంది. ఒక్కొక్క టెంకెను చేతికి నీళ్లుతడిచేసుకొని నునుపుగా చేయాలి. రంధ్రాల గిన్నె గానీ, స్టీలు జల్లెడ గానీ ఒక గిన్నెపై బోర్లించి ఈ టెంకెను కోరినట్లు చేయాలి. ఏమాత్రం పీచులేని గుజ్జు గిన్నెలోకి చేరుతుంది. దానితో మనం ఈ రుచులను చేసుకోవచ్చు.

777

                                                                                  ఖీర్‌..

కావలసినవి : తాటిపండు గుజ్జు - కప్పు, పాలు - కప్పు, పంచదార - 1/2 కప్పు, నెయ్యి - స్పూను, డ్రై ఫ్రూట్స్‌ (జీడిపప్పు, బాదం పలుకులు, కిస్‌మిస్‌)- 6 చొప్పున
తయారీ : బాండీలో నెయ్యి వేడి చేసి, డ్రైఫ్రూట్‌ పలుకులు రెండు నిముషాలు వేయించాలి. వాటిని గిన్నెలోకి తీసుకొని, అదే బాండీలో తాటిగుజ్జును మూడు నిమిషాలు తిప్పుతూ ఉడికించాలి. మంచి వాసన వస్తుందనగా పాలు పోసి, పది నిమిషాలు కలుపుతూ ఉడికించాలి. కొంచెం చిక్కబడుతుందనగా పంచదార వేయాలి. దీన్ని కలుపుతూ ఐదు నిమిషాలు ఉడికించాలి. చివరిగా యాలుకల పొడి చల్లి, దింపేయాలి. అంతే తాటిపండు ఖీర్‌ రెడీ. పూర్తయ్యేంత వరకూ అడుగంటకుండా తిప్పుతూనే చేయాలి.

55


                                                                               కేకు ..

కావలసినవి : గోధుమపిండి - కప్పు, తాటిపండు గుజ్జు - కప్పు, బేకింగ్‌ పౌడర్‌ - 1/2 స్పూను, ఉప్పు - చిటికెడు, కోడిగుడ్లు - 2, పంచదార పొడి - 1/2 కప్పు, నూనె - 1/2 కప్పు, పాలు - కొంచెం తయారీ : ముందుగా గోధుమపిండి, బేకింగ్‌ పౌడరు, ఉప్పు కలిపి, జల్లించుకోవాలి. ఒక గిన్నెలో గుడ్లు, పంచదార పొడి, నూనె, మైదా అవసరమైతే కొంచెం పాలతో బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ఒక మందపాటి గిన్నెలోకి తీసుకోవాలి. పైన డ్రైఫ్రూట్‌ పలుకులు చల్లాలి. గ్యాస్‌కట్‌ పెట్టకుండా కుక్కర్‌ బాగా వేడిచేసి, స్టౌని సిమ్‌లో ఉంచి, కేకు మిశ్రమం ఉన్న గిన్నె పెట్టాలి. 45 నిమిషాలు ఉడికించిన తర్వాత చాకును గుచ్చి చూడాలి. పిండి అంటకపోతే తాటి పండు కేక్‌ రెడీ అయినట్లే.

99

                                                                                పూరీ..

కావలసినవి : గోధుమపిండి - కప్పు, తాటిపండు గుజ్జు - 1/2 కప్పు, ఉప్పు - చిటికెడు, నూనె - వేపడానికి సరిపోను.
తయారీ : పైన చెప్పినవన్నీ నీటితో పూరీ పిండిలా మృదువుగా కలుపుకోవాలి. పదిహేను నిమిషాలు మూతపెట్టి నాననివ్వాలి. తర్వాత పూరీలుగా వత్తుకొని, నూనెలో డీప్‌ ఫ్రై వేయించుకుంటే.. చక్కగా పొంగి, తాటి పండు పూరీలు రెడీ అవుతాయి.