పల్లె కన్నీరు పెడుతోంది
భూమితల్లినే నమ్ముకున్న తన ఆత్మబంధువు
పట్నంబాట పడుతున్నాడని !
చేన్లు రోదిస్తున్నాయి గుండెకింద చెమ్మ అయిన
తన మిత్రుడు వ్యవసాయన్న
తనను వీడి మున్ముందు కనిపించకుండా
కాంక్రీటు వనంలో చేరిపోతున్నాడని !
పాపం ఆ అన్నదాత ఏంజేస్తాడు
ధాన్యరాశులు పుత్తడి గింజలై
జలజలా రాలినచోట
కన్నీటి ధారలు ఏరులై పారుతుంటే !
తమ వారసులు చదువుబాట పట్టి
పల్లెసీమనొదలి బస్తీల్లో కొలువుల్లో చేరిపోతుంటే
పంటసాగు చేసేవారులేక
పండిన కాసింత పంట కూడా
గిట్టుబాటు ధర పలుకక
నష్టానికే అమ్ముడైపోతుంటే ఏమి చేయగలడు !?
గత్యంతరం లేనిపరిస్థితుల్లో
కడుపునింపిన భూమాతని
తరుక్కుపోయే కడుపుతో అమ్మకంపెట్టి
కన్నీరింకిన హృదయంతో
పల్లె'టూరు' పట్నవాసం పోతోంది
ఆ తప్పని స్థితిలో పసిడి పైసలిచ్చిన
పచ్చ పచ్చని పొలాలన్నీ భవంతులై మొలుస్తున్నాయి
పచ్చగా పరచుకున్న పల్లెభూములు
రాతివనాలై విస్తరిస్తున్నాయి
ఈ వైనాలను నిలువరించిననాడే
పల్లెలు పచ్చగా పదికాలాలు బ్రతికేది.
నాగముని. యం
94908 56185