May 21,2023 08:43

'రవీ, రశ్మీ! ఎంత సెలవలైతే మాత్రం, ఏడు గంటలైనా నిద్ర లేవరా?' కోప్పడింది అమ్మ.
'ఏంటమ్మా! లేచి ఏం చేయాలి? ఇంట్లో ఉండడమేగా. ముంబై బాబారు దగ్గరకు వెళ్తామంటే ఒప్పుకోలేదు' సణుగుతూ లేచాడు రవి.
రశ్మి కూడా లేచి 'అంతేరా అన్నయ్యా, అదేమంటే తాతయ్య దగ్గరకు మంచిపల్లి వెళ్లమంటారు. ఆ పల్లెటూళ్లో ఏముంటుందని' అంది.
నాన్న, పిల్లల మాటలు విన్నాడు..
'ముంబై నుంచి హర్ష, వర్ష కూడా నాలుగు రోజుల్లో మంచిపల్లి వస్తున్నారని బాబారు ఫోన్‌లో చెప్పాడు' అంటుండగానే 'ఏంటీ! హర్ష, వర్ష అంత పెద్ద సిటీ వదిలి వస్తున్నారా' ఆశ్చర్యంగా అన్నాడు రవి.
'అన్నయ్యా! వాళ్లు కూడా వస్తున్నారుగా, మనమూ వెళ్దాం' అంది రశ్మి.
'సరే నాన్నా! మేం కూడా మంచిపల్లి వెళ్తాం' అన్నాడు రవి.

ఆదివారం మంచిపల్లి తీసుకెళ్ళాడు నాన్న.
బామ్మ, తాతయ్య వీళ్లను చూసి ఎంతో ఆనందించారు. ఇంటి ముందు ఎన్నో చెట్లు.. చల్లగా, హాయిగా ఉంది. బామ్మ చేసిన మామిడి కాయ పప్పు, గుత్తి వంకాయ కూర పిల్లలకు బాగా నచ్చాయి.
సాయంత్రం హర్ష, వర్ష వచ్చారు. హర్ష, వర్ష , రవి, రశ్మి ఒకటే కబుర్లు. ఆ రాత్రి, 'తాతయ్యా! ఓ కథ చెప్పవూ' అడిగారు పిల్లలు. ఆయన 'మూడు ప్రశ్నలు' అనే కథ చెపుతుంటే ఆసక్తిగా విని, ఆ తర్వాత నిద్రపోయారు.
ఉదయాన్నే తాతయ్య, పిల్లల్ని లేపి 'త్వరగా తయారైతే పొలానికి వెళ్దాం' అన్నాడు. దాంతో నలుగురూ ఉత్సాహంగా తయారయ్యారు. తాతయ్యతోపాటు నడుస్తుంటే, తోవంతా ఊరివాళ్లు 'పెద్దయ్యగారూ! సెలవలకు పిల్లలు వచ్చినట్లున్నారుగా' అనడం, తాతయ్య వారిని కుశలం అడగడం పిల్లలకు ఆశ్చర్యంగా ఉంది. అదే మాట తాతయ్యతో అంటే 'మాటే మనిషిని, మనిషిని కలిపేది' అన్నారు.
పచ్చని చేలు చూసి పిల్లలు పరవశించిపోయారు. పొలం గట్టున మామిడి చెట్లు కనిపించడంతో పిల్లల ఆనందానికి హద్దే లేదు. మామిడి కాయలు, తాటి ముంజలు తిన్నారు. కొబ్బరి బొండాలు తాగారు. చెట్ల చుట్టూ పరుగులు తీస్తూ, పక్షుల కూతలను అనుకరిస్తూ ఆడుకున్నారు. ఆ తర్వాత ఇంటికి వచ్చారు.

భోజనాలు అయ్యాక తాతయ్య పిల్లలను 'మీకు ఎక్కాలు ఎందాకా వచ్చు?' అడిగారు.
'పది వరకు చెపుతాను, ఆ పైనవి హెచ్చవేసి తెలుసుకుంటా. ఇంట్లో అయితే మొబైల్‌లో క్షణాల్లో తెలుసుకుంటా' అన్నాడు రవి. మిగిలిన వాళ్లు లేదంటే క్యాలిక్కులేటర్‌లో.. అంతేగా అన్నట్లు చూశారు.
'మనిషి మెదడుకు ఎంతో శక్తి ఉంది. దాన్ని వాడకుండా, ప్రతి దానికి మొబైల్‌ మీద ఆధారపడడం మంచిది కాదు. ఇరవయ్యో ఎక్కం వరకు ఎక్కడ అడిగినా చెప్పగలిగి ఉండాలి. రోజూ ఒక ఎక్కం బాగా నేర్చుకోండి. ఎక్కాలు వస్తే లెక్కల్లో మీకు తిరుగుండదు' చెప్పారు తాతయ్య.
దాంతో నలుగురూ పోటీపడి నేర్చుకోసాగారు. అలాగే రోజూ ఓ పుస్తకం ఇచ్చి నలుగురి చేతా చదివించారు. అర్థం కాని చోట వివరించారు. దాంతో వాళ్లకు తడుముకోకుండా చదవడం అలవాటయింది. అలాగే చక్కని దస్తూరితో, తప్పులు లేకుండా రాస్తే బహుమతి ఇస్తానని తాతయ్య అన్నారు. పిల్లలు రోజూ గుండ్రంగా, తప్పులు లేకుండా రాయడం సాధన చేశారు.

ఓ రోజు సరదాగా పక్క ఊరి తిరునాళ్ళకి తీసుకెళ్లారు తాతయ్య. అక్కడి రకరకాల దుకాణాలు, వినోదాలు, ఆ సందడి పిల్లలకు భలేగా నచ్చాయి.
బామ్మ చక్కని పొడుపు కథలు, సామెతలు నేర్పించింది. మామిడి పళ్ళు, సపోటాలు, పనస తొనలు, మొక్కజొన్న కండెలు ఇష్టంగా తిన్నారు. ఇలా ఆడుతూ, పాడుతూ, చదువుతూ రోజులు గడిపేశారు. సెలవులు అయిపోయి తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు. తాతయ్య నలుగురినీ మెచ్చుకుని, బహుమతులిచ్చాడు.
'తాతయ్యా! మళ్లీ సెలవలకు ఇక్కడికే వస్తాం. సిటీ నుంచి నీకేం కావాలో చెప్పు, తెస్తాం' అన్నారు.
'నాకు మీరు బాగా చదువుకుని, మంచి పిల్లలుగా ఉంటే చాలు. మీరు మా దగ్గరకు రావడమే మాకిచ్చే బహుమతి' అన్నారు.
'మీ ప్రయాణం రేపు కదా! బై బై హర్షా, వర్షా. మళ్లీ సెలవలకు కలుద్దాం' అని తాతయ్య, బామ్మల దీవెనలందుకుని నాన్నతో బయల్దేరారు రవి, రశ్మి.

జె.శ్యామల
9989601113