Jan 15,2023 10:40

మా పల్లెకు పట్టాభిషేకం..
నేనెళ్ళి చూసి వస్తాను
మూడురోజుల ముచ్చట్లలో
మునిగి తేలుతాను
ఆత్మీయ ఆలింగనాలతో
నన్ను నేను మైమరచిపోతాను
ప్రేమపూర్వక పలకరింపులతో
పులకించిపోతాను
రైతు స్వేదంతో తడిసిముద్దై పండించిన
కొత్త బియ్యపు పిండివంటలు
ఆరగించి వస్తాను
అవ్వా తాతల ఆనందాలను
ఆస్వాదించి ఆనందిస్తాను
భోగి మంటల చుట్టూ ప్రదక్షిణ చేసి
భోగభాగ్యాలు ప్రసాదించాలని
మనసారా కోరుకుంటాను
కోడి పందాలు కోలాటాల్లో
కుర్రాణ్నై కేరింతలు కొడతాను
అత్తవారింట అల్లుడి హోదాలో
అంగరంగ వైభవాన్ని అనుభవిస్తాను
మరదళ్ల వేళాకోళాలకి
ఎత్తుగడలు వేసి వస్తాను
ప్రభల తీర్ధంలో నా తడియారని
జ్ఞాపకాల్ని స్పృశించి వస్తాను
మూడురోజుల ముచ్చట్లని
మూటకట్టుకుని మురిసిపోతూ వస్తాను
నాకు వీడ్కోలు పలకలేక
కన్నీరు మున్నీరవుతున్న
మా పల్లెను ఓదార్చి వస్తాను
మళ్ళీ వచ్చే సంక్రాంతికి వస్తానని
ఊరడించి మరీ వస్తాను..


యం యస్‌ రాజు
95020 32666.