Mar 12,2023 14:45

తెలుగునేలపై పరిచయం అవసరంలేని పువ్వు నందివర్ధనం. ఐదు రేఖల నక్షత్రాల్లా పాల తెలుపుతో ఏడాదంతా పూలు పూస్తుంది నందివర్ధనం. పెరటి మొక్కగా పిలిచే ఈ నందివర్ధనంలో ఇప్పుడు బోలెడన్ని రకాలు వచ్చాయి. ఈశాన్య ఆసియా, చైనా ప్రాంతాలకు చెందిన నందివర్ధనం ఇప్పుడు ప్రపంచమంతా ఎగబాకింది. అపో సైనేసి కుటుంబానికి చెందిన దీని శాస్త్రీయనామం తబేర్నయమంథాన దివారికేత. క్రేప్‌ జాస్మిన్‌, పిన్‌ వీల్‌ ఫ్లవర్‌, ఈస్ట్‌ ఇండియా రోజ్ళబే, నిరోస్‌ క్రౌన్‌ ఇలా ప్రపంచం అంతటా ఈ మొక్కని రకరకాల పేర్లతో ముద్దుగా పిలుచుకుంటున్నారు. కుండీల్లోనూ నేల మీదా చక్కగా పెంచుకోగల నందివర్ధనాల గురించి ఈ వారం తెలుసుకుందాం.

  • దేశవాళీ..

ఐదారు అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ మొక్క ఆకులు డైమండ్‌ ఆకారంలో ముదురాకుపచ్చలో ఉంటాయి. టేబర్‌ నిమోంటానా దివారికేటా దీని శాస్త్రీయ నామం.

  • డ్వార్ఫ్‌..
1

చిన్ని చిన్ని ఆకులు.. లేత పసుపు రంగులో ఉంటాయి. మొక్క 10 అంగుళాలలోపే పెరుగుతుంది. కుండీల్లో ఎంతో బాగుంటుంది. ఇవి కూడా బోర్డర్‌ ప్లాంట్స్‌గా. చాలా అందంగా ఉంటాయి. కాస్త నీడ ఎండ ఉండే సెమీషేడ్‌ ప్రాంతంలో కూడా ఇవి చక్కగా వికసిస్తాయి. అందుకే వీటిని కుండీల్లో పెంచుకుని, ఎక్కడ కావాల్సి వస్తే అక్కడ అలంకరించుకుంటారు.

  • నందివర్ధనం..
5

మొక్క 12 అంగుళాల ఎత్తు పెరుగుతుంది. దీనిని నందివర్ధనం మినీ అని పిలుస్తారు. దీన్ని కుండీలలో, నేల మీద కూడా పెంచుకోవచ్చు. ఆకులు, పువ్వులు కూడా సాధారణ నందివర్ధనాల కంటే చిన్న పరిమాణంలో ఉంటాయి. ఇంటి ముంగిట బోర్డర్‌ ప్లాంట్‌గాను. ల్యాండ్‌ స్కేపింగ్‌లో నందివర్ధనం మినీ ఎక్కువగా వాడుతుంటారు. ఈ పువ్వులతో సన్నని మాలలు కట్టి, చిత్రపటాలకు వేస్తుంటారు.

  • వెరిగేట..
2

ఆకులు లేత పసుపు, తెలుపు, లేత ఆకుపచ్చ రంగుల కలబోతతో.. మచ్చలుగా ఉంటాయి. మొక్క నాలుగు అడుగుల వరకు పెరుగుతుంది. ఈ మొక్క పువ్వులతో పాటు ఆకులు కూడా వైవిధ్యంగా ఉంటాయి. సాధారణ నందివర్ధనాలతో పోలిస్తే ఈ మొక్క పూల కాపు కాస్త తక్కువగానే ఉంటుంది.

  • స్టార్‌ ..
s

పువ్వు రేకలు ఏటవాలుగా వడి తిప్పినట్టు కాస్త వినూత్నంగా ఉంటాయి. పువ్వు కొద్దిగా సువాసన గుప్పిస్తుంది కూడా. ఈ పువ్వు చూడ్డానికి జాజి పువ్వులా నాజూగ్గా ఉంటుంది. అందుకే దీన్ని స్టార్‌ జాస్మిన్‌ అని కూడా పిలుస్తారు. మొక్క ఐదడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది. ఈ మొక్కకు నీటి వనరు కాస్త ఎక్కువ కావాలి.

  • ప్రీమియం..
5

ఐదు పూరేకలు.. కాస్త దళసరిగా, పెద్దగా ఉండి అన్ని రేకల మాదిరిగా కాకుండా కలిసిపోయి ఉంటుంది. చిగుర్లు మాత్రమే రేకలుగా వేరుపడి ఉంటాయి. ఇలాంటి పువ్వులు ఉన్న నందివర్ధన మొక్కను ప్రీమియం నందివర్ధనమని పిలుస్తారు. పువ్వు మధ్యలో పసుపు రంగు ఛాయ అందంగా కనిపిస్తుంది.

  • ముద్ద ..
1

తెల్లటి అనేక రేకలు గుత్తంగా ఉండి, నాచు గులాబీలా ఉంటాయి. ఈ రకం నందివర్ధన పువ్వులు ముద్ద నందివర్ధనం.. తబేర్నయ మంథాన దీని పేరు. మొగ్గగా ఉన్నప్పుడు అచ్చంగా మల్లె మొగ్గల్లా ఉంటాయి. దూరంగా చూస్తే విచ్చుకున్న మల్లెపువ్వుల్లా కనిపిస్తాయి. లేత వాసనలు కూడా గుప్పిస్తుంది. రెండడుగుల ఎత్తు వరకు పెరిగే ఈ మొక్కలను కూడా కుండీలో పెంచుకోవచ్చు.

  • హుమిలి..
2

అత్యాధునికమైన నందివర్ధనం ఇది. పసుపు రంగులో గుత్తులు మాదిరిగా పువ్వులు ఎంతో ఆకర్షణగా ఉంటాయి. శీతాకాలం, వేసవికాలం నిండుగా పువ్వులు పూస్తాయి. మొక్క నాలుగు అడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది. దీన్ని ఇటాలియన్‌ జాస్మిన్‌ అని కూడా పిలుస్తారు. ఆఫ్ఘనిస్తాన్‌ దీని పుట్టినిల్లు. కుండీల్లోనూ నేల మీద కూడా పెంచుకునే వెసులుబాటు ఉన్న ఈ మొక్క ఎక్కడ అలంకరించుకున్నా అందర్నీ పలకరిస్తుంది.

- చిలుకూరి శ్రీనివాసరావు, 89859 45506