ఇంకొంచెం వెలుగులు వస్తే బాగుండు
ఎవరో ఆ తెర తీస్తే బావుణ్ణు
మసకబారిన చంద్రుడు
భూమిని ప్రశ్నిస్తున్నాడు
ఏ కలుగులో ఈ మనుషులని
విఫలులై చూడడం తప్ప
ఏం చేశాం మనం
నిషేధ నిప్పు కణికై ప్రగాఢంగా
దిండు కింద పొగలు లేపుతుంది
ఇంకా అక్కడే నిరీక్షిస్తున్నావా
రెండు పరిచర్యల కాడ
ఎండుటాకుల మైదానంలో
కొంత పూతను కూడా మేలుకొలుపు
నిలబడు కాసేపు వణకక..
వీలున్నప్పుడే జీవించేస్తే
భుజాన భారపు మూట వేసుకోక..
నడుస్తున్న కాలానివే నువ్వు కదా
ఇంకేం చూస్తావు తల లోపలికి
అరచేత్తో అలా తాడించు ఆకాశంలోకి
కొన్ని అరలు తెరుచుకోవచ్చు
కన్న కలలన్నీ ఒక్కో కుండగా పోగుపడుతూ
నీ దేహం మొత్తం నిండి మక్కిపోయాయి
వేడి తగిలి మొలకలెత్తి ముక్కిపోయాయి
అయ్యో గమనించాలి నిజానికి
బూజుపట్టి ఎండిపోయాయో
కానీ మహాశక్తి సంపన్నుడి ప్రయత్నం..
మళ్ళీ మళ్ళీ తెగిన పాటలా
క్రమంగా నిత్యంగా కాకుండా
విడిచి విడిచి ఆ నిడివిలో అప్పుడప్పుడు..
ఆమాత్రం దానికి ఇలా ఉంటే
మరి మొత్తంగా నిరంతరంగా చేసి ఉంటే
ఈ రోజు అది తోటై విరగబూసేది
పక్షులు వాలే గానమయ్యేది
ఒక సారవంతమైన పాఠం అయ్యేది కదా!
రఘు వగ్గు