Sep 24,2023 08:43

అన్నమ్మ నిన్న రాత్రి ఇచ్చిన అన్నం కుండలో నీరు పోసి ఉంచినా చివికిపోయింది.
చివికిన ఆ అన్నమే ఉప్పు కలిపి తినేసింది బంగారమ్మ. చివికిపోయిన ఆ అన్నంలాగే ఆమె బతుకు చివికిపోయి చాన్నాళ్ళయింది. బంగారమ్మ పాతరోజుల మనిషి. ఊరవతల గుడిసె. నులక మంచం. ట్రంకు పెట్టి. అందులో పాత చీరలు. మట్టి పాత్రలు. దీపం బుడ్డి. అన్నీ పాతరేసిన పాత వస్తువులే ! ఎవరన్నా ఏమన్నా అంటే మాత్రం 'రేపో మాపో సచ్చేదానికి టక్కుటమారాలు నాకెందుకు?' అంటుంది. బంగారమ్మకు ఒక్కడే కొడుకు. వాడి చిన్నప్పుడే తన భర్తను పోగొట్టుకుంది. అంత దుఃఖాన్ని దిగమింగి, కొంగు నడుంకి బిగించి, నాలుగిళ్లలో తన కులవృత్తి బట్టలు ఉతికే పనిచేస్తూ తన కొడుక్కి అన్నీ తనే అయ్యి పెంచింది. తన తమ్ముడి కూతుర్నే కుదిర్చి, పెళ్లి చేసింది. పెళ్లయిన నాలుగు రోజులకే వాడు టాటా చెప్పి, అనకాపల్లి నుండి విశాఖకు వెళ్ళిపోయాడు.
అక్కడే తన కులవృత్తి చేసుకుంటూ ఏ నెలకో వచ్చి చూసి పోతుంటాడు. వఛ్చినప్పుడల్లా అమ్మా డబ్బులే అంటాడు. 'ఇదిగో రా సీనూ! నీకోసం దాచి వుంచినాను!' అని వున్నకాడికి దోచియిస్తుంది. ఆ రోజు తప్పకుండా కోడికూర వండిపెడ్తుంది. 'ఇదిగోరా సీను ఇది గుండెకాయ.. ఇది కందనకాయ. ఇది సట్ట.. తిను. అదేంటిరా.. తిండి తగ్గించేసినావేటి కొడుకో.. ఇదేం చోద్దివా?' అని తెగ బాధపడిపోతది.
ఆ రోజు పెళ్లిబట్టలన్నీ ఉతికి ఆరేసిన బంగారమ్మ బాగా అలిసిపోయింది. 'పని అయిపోనాది. నానెళ్ళిపోతన్నా నమ్మగోరు' అని గొంతెత్తి అరిచింది. అరుపు విన్న కొత్తకోడలు వసుధ వచ్చి.. 'సాయంత్రం తొందరగా రా ఆరిన బట్టలన్నీ తీసి, మడతలు పెట్టి ఇవ్వు' అంది. 'అలగలగే సిన్నమ్మా' అని ఇంటికి బయల్దేరింది బంగారమ్మ.
అలా ఏదేదో ఆలోచించుకుంటూ నులక మంచంపై తిన్నాక ఒళ్ళు వాల్చింది. ఒళ్ళు మరిచి నిద్రపోయింది. నిద్ర లేచాక చూస్తే దీపాలుపెట్టే వేళయింది. చీకటి పడితే చూపు సరిలేక వెళ్ళలేకపోయింది. ఆ మరుసటి రోజు ఉదయం వెళ్లింది. అన్నమ్మ ఎండలో గుమ్మంలో కూర్చుంది. 'రావే రా ఇలా కూర్చో!' అందామె. బంగారమ్మ అన్నమ్మ పక్కనే కూర్చుంది. ఆ వెంటనే వచ్చిన కొత్తకోడలు వసుధ 'మా పెళ్లి మధుపర్కాలు ఇలా చించి పోగులు చేసావేం' అని మధుపర్కాల్ని విప్పిచూపింది. బంగారమ్మ ఆ బట్టల్ని చూసి 'ఇవి కొట్టు చీకుడు గుడ్డలు. ఆ కొట్టోడిని అడిగితే సరి!' అని ఊరుకుంది.
'సర్లే. నువ్వు రేపట్నించి పనికి రానక్కర్లేదు. మా పుట్టింటివారు వాషింగ్‌ మెషిన్‌, ఇస్త్రీ పెట్టి ఇచ్చారు!' అంది సగర్వంగా వసుధ.
'సిన్నమ్మా! నిన్నా బాగా ఎండ పడిపోన్ను. రానేకపొన్ను. నానీ ఇంటి పనిక్కుదిరి నాలుగు పదులైపోనాది. ఈ యింట మకిలిగుడ్డా, మైలగుడ్డా అని సూడకండానే ఉతకతాన్నాను. కట్టపడేటోళ్ళకి పన్నేకండా పోదు. పొన్నెండి. నాకివ్వలిసిన డబ్బులు యిప్పించండి. పోతా..!' అని అంతా వివరంగా చెప్పింది బంగారమ్మ.
'బంగారమ్మ నా మాట విను!' అంది అన్నమ్మ.
'మళ్ళీ తనే మీ పెద్దయ్యగారు రిటైర్‌ అయిపోయారు. చిన్నయ్య కింకా ఉద్యోగం రాలా. ఇంటి ఖర్చు తగ్గించాలని మా కోడలి ధోరణి..!' అని మళ్ళీ తనే 'ఇపుడే వస్తానుండు!' అని ఇంట్లోకి వెళ్లింది అన్నమ్మ.
ఇంట్లోంచి బయటకు వస్తూ ఓ పట్టుచీర, పెడ అరటిపళ్ళు, ఐదు వంద నోట్లు తెచ్చి ఇచ్చింది. బంగారమ్మ కళ్ళు ఆనందంతో మెరిశాయి. అవి అందుకుని.. 'మీరంతా సల్లగుండాలి తల్లే!' అంది బంగారమ్మ.
బంగారమ్మకి ఇంటి కెళ్ళాక వంట చెయ్యాలనిపించలేదు. ఆ పట్టుచీరనే పదే పదే చూచి మురిసిపోయింది. నాలుగరిటి పళ్ళు తినేసింది. నోట్లు ట్రంకు పెట్టిలో దాచింది. ఆ పట్టుచీర పట్టుకుని నులకమంచంపై ఒళ్ళు వాల్చింది. కునుకు పట్టి కళ్ళు మూతలు పడ్డాయి. 'అమ్మా!' అన్న పిలుపు
తట్టి లేపితే.. 'ఆ ఆ..!' అంటూ లేచింది. చూస్తే కొడుకు శ్రీను. 'సీను వచ్చినా. అమ్మా నాకు బాగా ఆకలేస్తందే. అన్నవెట్టు!' అన్నాడు శ్రీను.
'వండేత్త నుండు. కూకోరా.!' అని కుండలో బియ్యం పోసి కొడుక్కేసి చూసింది.
శ్రీను పట్టుచీరనే చూస్తున్నాడు. 'ఈ చీర నాపెళ్ళాం కడితే నా సామిరంగా అలా యిలాక్కాదు గాని సీతమ్మోరిలా అంజలీదేవి లాగుంటది..!' అని లోలోనే అనుకున్నాడు. చీర పట్టిపట్టి చూశాడు. చాలా బరువుగా వుంది. ముదురు ఎరుపు రంగు. బోర్డర్‌ నిండా చిక్కని జరీ అంచు బంగార్రంగు. చీరను గట్టిగా నలిపి చూసాడు. వెండి జరీ. 'అమ్మా! ఈ చీర ఎవరిదే?' అనడిగాడు.
'అన్నమ్మ గారిది. కానీ' అని ఆగి 'అన్నం పొంగుతన్నాది. వారిసి వస్తానుండరా!' అందామె.
'అమ్మా, ఇది వెండి జరీచీర. కరిగిస్తేనా ఇరవై తులాల వెండొస్తదే!' అన్నాడు శ్రీను.
'ఔనేటి. ఇరవైతులాల వెండొస్తదా. వామ్మో. ఊరిసంత మనకెందుకుగాని రా బువ్వెడతా. నీ కిద్దావని పదిహేను వంద నోట్లుంచారా సీను అవట్టుకుపో!' అని మాట మార్చేసింది ఆమె.
'అన్నం పెట్టి .. వెండయితేనేం.. కొండయితేనేం మనదిగానిది!' అని చీరని మడత పెట్టింది.
ఆచీర చిరుగులు వెక్కిరించాయి. నవ్వుకుంది బంగారమ్మ. ఆ మరుసటి రోజు ఉదయం అన్నమ్మ గారి ఇంటికి వెళ్ళి వెండి పట్టుచీర భద్రంగా అప్పగించింది. 'మీరిచ్చిన ఈ పట్టుచీర వెండి జరీదట! కరిగిస్తే ఇరవై తులాల వెండి వస్తాదట. ఇన్నాళ్ళు మీ ఉప్పు తిని బతికాను. అది చాలు. అందుకే తిరిగి ఈ చీర మీకే యిచ్చెత్తన్నా..!' అంది బంగారమ్మ.
'ఔనా? అని ఆశ్చర్యంగా చూసి ఆనందంగా అందుకుంది అన్నమ్మ. బంగారమ్మా! ఇది మా అత్తగారి చీర. ఇలాంటిదే ఆకుపచ్చ పట్టు చీరొకటి మా అత్తగారు చనిపోయినప్పుడు నీకు ఇచ్చాను అది ఉందా. నీకు గుర్తుందా?' అంది అన్నమ్మ. 'ఆ చీర చిరుగుపట్టింది. చివికిపోయింది నా ట్రంకు పెట్టిలో ఉంచాను. ఆ చీరే నా కొడుకు పెళ్ళిలో కట్టుకుంటే మా మేనల్లుడు అచ్చంపెళ్లికూతురునాగ వున్నావు బాప్పా అని ఆడు నాతో సెలంతకాలాడి నాడు..' అంటూ చెప్పుకు పోతుంటే.. కొత్తకోడలు వసుధ అంతా విని, 'అయితే ఆ చీర వెంటనే తెచ్చివ్వు బంగారమ్మ!' అంది.
'ఇప్పుడే ఇంటికాడికెళ్ళి ఈ ఎండలోనాను తేలేను సిన్నమ్మ.. రేపట్టు కొత్తాన్నే' అంది నీరసంగా బంగారమ్మ.
'బంగారమ్మంటే బంగారవే. ఇప్పుడు కాదుగానీ మధ్యాన్నం తీసుకురా!' అంది వసుధ.
'అలాగేలెండి సిన్నమ్మ గోరు!' అని ఇంటి ముఖంపట్టింది.
అన్నమ్మా, వసుధా పగటి పూట ఎండలా మిలమిలా మెరుస్తున్నారు. ఎండలో నడుస్తున్న బంగారమ్మకు పగటి ఎండ వెన్నెల్లా మారినట్టు అనిపిస్తోంది. ఎందుకంటే తనది కాని బరువును దించుకుంది. 'బంగారమ్మ నువ్వెళ్లే తోవలో ఆచారి రామబ్రహ్మం నేనొకసారి రమ్మన్నానని చెప్పు. మరిచిపోకేం..' అనరచింది అన్నమ్మ.
'అలగలాగే!' అని కదిలింది బంగారమ్మ.
అన్నట్టే మధ్యాన్నంపూట ట్రంకు పెట్టిలో పాత జరీ చీర తీసి, అన్నమ్మకు అందించింది.
అలా ఇచ్చాక, ఇంటికి చేరేసరికి బాగా పొద్దుపోయింది. నాలుగు మెతుకులు ఉడకేసుకు తిని, హమ్మా.. అనుకుంది.
పగటి ఎండ రాత్రి వెన్నెల్లా అనిపించింది. బంగారమ్మ వాకిట్లో కుక్కి మంచము మీద ఒళ్ళు వాల్చింది.
వెన్నెల్లో తడుస్తూ నిద్రపోయింది. ఊరి బట్టలు చలువ చేసే బంగారమ్మకు రాత్రి వెన్నెల చలువ చేసింది. బంగారమ్మ చల్లబడి.. కదలిక లేకుండా బిర్రబిగుసుకు పోయింది.

యల్‌. రాజా గణేష్‌
92474 83700