Jul 13,2023 15:30

ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్‌ : పడిదంపాడు, పూడూరు గ్రామాలకు వెంటనే రోడ్డు వేయాలని సిపిఎం మండల కార్యదర్శి హుస్సేనయ్య, మండల నాయకులు రాఘవేంద్ర డిమాండ్‌ చేశారు. గురువారం వారు ఆ గ్రామాలను సందర్శించి గ్రామ పెద్దలతో కలిసి గ్రామ సచివాలయం అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కర్నూలు జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న గ్రామాలు పడిదంపాడు, పూడూరు గ్రామాలని, ఆ గ్రామాలకు రోడ్డు దెబ్బతిని సంవత్సరాలు గడిచినా రోడ్డు వేయకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. ప్రసవం సందర్భంగా కర్నూల్‌కు రావాల్సిన గర్భిణీ స్త్రీలు 8 మంది దారి మధ్యలోనే ప్రసవించారని, అంబులెన్స్‌ సౌకర్యం కూడా ఆ గ్రామాలకు అందడం లేదని, గ్రామస్తులు గ్రామ అధికారులు ప్రజాప్రతినిధులు ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోకపోవడం బాధాకరం అన్నారు. గత ఎన్నికల్లో పూడూరు గ్రామ ప్రజలు ఎన్నికల్ని బహిష్కరించారని అధికారులు ప్రభుత్వం యంత్రాంగం జోక్యం చేసుకొని ఈ గ్రామాలకు తప్పకుండా రోడ్డు సౌకర్యం కల్పిస్తామని చెప్పి ఎన్నికలు నిర్వహించారని, తీరా ఎన్నికల తర్వాత ప్రజల సమస్యలు యధాతధంగా ఉన్నాయని గ్రామస్తులు తమ దృష్టికి తెచ్చారన్నారు. పూడూరు, పడిదంపాడు గ్రామాలకు ఎమ్మెల్యే ఒకసారి కూడా రాకపోవడం, ప్రజల సమస్యలు వినకపోవడం చూస్తుంటే, ఎమ్మెల్యే ఉన్నాడా జిల్లా వదిలి వెళ్లాడా అనే సందేహం కలుగుతుందని ఎద్దేవా చేశారు. సమస్యలను పరిష్కరించకుంటే రెండు గ్రామాల ప్రజలతో కలిసి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు రామకృష్ణ, మాబు, హుస్సేన్‌ పీరా, కృష్ణ, శంకర్‌, శ్రీనివాసులు పాల్గొన్నారు.