ప్రజాశక్తి-పాడేరు టౌన్ (అల్లూరి) : అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని క్రైస్తవ మందిరాలలో మట్టల ఆదివారం (పామ్ సండే) వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తిశ్రద్ధలతో మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఏసుక్రీస్తు సిలువలో తన ప్రాణాన్ని అర్పించి మనుషుల పాపాన్ని విమోచించడానికి చివరిసారిగా విజయోత్సవముతో యెరుషలేములోనికి ప్రవేశించిన రోజున కొందరు మట్టలు పట్టుకుని ఆయనను స్తుతించిన రోజును గుర్తు చేసుకుంటూ మట్టల ఆదివారం కార్యక్రమాన్ని క్రైస్తవులు జరుపుకున్నారు. పాడేరు పట్టణంలోని ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్ధన మందిరం పాస్టర్ తిమోతి ఆధ్వర్యంలో మట్టల ఆదివారాన్ని పురస్కరించుకుని పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. చర్చ్ సభ్యులు మట్టలు పట్టుకొని యేసుక్రీస్తు స్తుతింపబడును గాక, పట్టణ ప్రజలు శాంతి సమాధానాలతో జీవించాలని ఆశీర్వదిస్తూ నినాదాలు చేశారు. పాపాల నుండి రక్షించడం కోసం యేసు క్రీస్తు ఈ భూమికి దిగి వచ్చారని చాటుతూ పట్టణ పురవీధుల్లో ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభువైన ఏసుక్రీస్తు ప్రార్థన మందిరం విశ్వాసులు, తదితరులు పాల్గొన్నారు.










