Apr 16,2023 08:49

వేసవి కాలం రాగానే.. ప్రత్యేకంగా అప్పుడు మాత్రమే చేసుకునే కొన్ని పనులుంటాయి. వాటిలో నిల్వ పచ్చళ్ళు పట్టుకోవడం ఒకటి. సంవత్సరమంతా నిల్వచేసుకుని జిహ్వ చాపల్యాన్ని తీర్చుకునే పచ్చళ్లు ఇవి. పూర్వం పల్లెటూళ్ళలో నలుగురూ కలసి పట్టుకొని.. పట్టణాల్లో నివశించే వారి పిల్లలకూ, బంధువులకూ పంపేవారు. కానీ ఇప్పుడా పరిస్థితులు కరువయ్యాయి. ఎవరికి వారే కొద్దికొద్దిగా పట్టుకుంటున్నారు. వారి కోసమే కొన్ని నిల్వ పచ్చళ్ళ గురించి ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం. మరి మనమూ పచ్చళ్ళు పట్టేద్దామా..?!

  • టమోటా - పండుమిర్చి..
TAMATA

కావలసినవి : టమోటాలు - కేజీ, పండుమిర్చి - కేజీ, ఉప్పు - 1/2 కప్పు, వెల్లుల్లి - 15 రెబ్బలు, జీలకర్ర - స్పూను, పసుపు - స్పూను, చింతపండు - 100 గ్రా.
తయారీ : ముందు రోజే టమోటాలు, తొడిమలు తీయని పండుమిర్చి శుభ్రంగా కడిగి, పొడి క్లాత్‌తో తుడిచి ఆరబెట్టుకోవాలి. నాలుగు ముక్కలుగా కట్‌ చేసిన టమోటాలను, పసుపు, ఉప్పు వేసి, జాడీలో ఊరనివ్వాలి. రెండోరోజు టమోటా ముక్కలను బాగా పిండి, ఎండలో ఆరనివ్వాలి. ఆ రసంలో చింతపండును రెబ్బలుగా విడదీసి వేయాలి. తర్వాతి రోజు చింతపండు గుజ్జు, పండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర జార్‌లోకి తీసుకుని కచాపచాగా మిక్సీ పట్టుకోవాలి. దానిలో ముందురోజు ఎండబెట్టిన టమోటా ముక్కల్ని వేసి, మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. ముక్కలుగా కావాలనుకునేవాళ్లు కాస్త బరకగా గ్రైండ్‌ చేసుకోవాలి. అంతే.. టమోటా, పండుమిర్చి నిలవ పచ్చడి రెడీ అయినట్టే. దీనిని శుభ్రమైన జాడీలో భద్రపరచుకోవాలి. కావలసినప్పుడు తాలింపు పెట్టుకుంటే ఆ తాజా రుచే వేరు.

  • పండుమిర్చి..
PANDUMIRCHI

కావలసినవి : పండుమిర్చి - 1/2 కేజీ, ఉప్పు - 125 గ్రా, చింతపండు - 125 గ్రా, పసుపు - స్పూను, వెల్లుల్లి రెబ్బలు - 10
తయారీ : ముందుగా ఉప్పు, చింతపండు వేసి, దానిలో చిన్నగా కట్‌ చేసుకున్న పండుమిర్చి ముక్కలు వేసుకొని కొంచెం బరకగా దంచాలి. దీన్ని జాడికి ఎత్తి పెట్టుకుని, మూడోరోజు రోట్లోగానీ, గ్రైండర్‌లోగానీ వేసి రుబ్బుకోవాలి. దీనిలో పొట్టు వలిచిన వెల్లుల్లి రెబ్బలు, పసుపు వేసి ఒక్క తిప్పు తిప్పాలి. అంతే పండుమిర్చి పచ్చడి రెడీ అయినట్లే. దీనిని ఒకరోజు మొత్తం ఊరనివ్వాలి. తర్వాత రోజు పచ్చడి ఒకసారి కలిపి, గాజు సీసాలో పెట్టుకొని, జాగ్రత్త చేసుకోవచ్చు. ఇష్టమైతే కావలసినప్పుడు తాలింపు పెట్టుకోవచ్చు. లేదంటే అలానే వాడుకోవచ్చు. ఈ పచ్చడి ఏడాదంతా నిల్వ ఉంటుంది.

  • మామిడల్లం..
MAMIDI ALLAM

కావలసినవి : మామిడి అల్లం - 1/4 కేజీ, చింతపండు - 100 గ్రా, కారం - 100 గ్రా, బెల్లం - 100 గ్రా, ఉప్పు - 100 గ్రా, వెల్లుల్లి - 50 గ్రా, మెంతులు - 2 స్పూన్లు, ఆవాలు - స్పూను
తయారీ : మామిడల్లం శుభ్రంగా కడిగి తుడిచి, పై పెచ్చు తీసి చిన్న ముక్కలుగా కట్‌ చేసుకుని ఫ్యా˜న్‌ గాలికి ఆరనివ్వాలి. ఈ లోపల ఆవాలు, మెంతులు బాగా వేయించి చల్లారనివ్వాలి. అదే పాన్‌లో నూనె వేడిచేసి అల్లం ముక్కలు ఐదు నిమిషాల పాటు సన్న సెగపై వేయించాలి. ఆవాలు, మెంతులు మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. దానిలో అల్లం ముక్కలు, పొట్టు ఒలిచిన వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కొంచెం ఉప్పు వేసుకుంటూ గ్రైండ్‌ చేసుకోవాలి. తర్వాత ఉడికించిన చింతపండు, కారం, బెల్లం, పసుపు వేసుకొని గ్రైండ్‌ చేసుకోవాలి. అంతే మామిడల్లం నిల్వ పచ్చడి రెడీ అయినట్లే. అవసరమైతే మరిగించి చల్లార్చిన నీటిని ఉపయోగించవచ్చు. ఇలా రెడీ అయిన పచ్చడిని గాజు సీసాలో పెట్టుకొని, ఫ్రిజ్‌లో నిల్వ ఉంచుకుంటే సంవత్సరమంతా రంగు, రుచి ఏమాత్రం మారదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కావలసినంత పచ్చడి తీసుకొని, తాలింపు పెట్టుకోవచ్చు.

  • గోంగూర, పండుమిర్చి ..
GONGORA

కావలసినవి : గోంగూర - 1/4 కేజీ, పండుమిర్చి - 1/4 కేజీ, ఉప్పు - తగినంత, ఆవాలు - స్పూను, మెంతులు - స్పూను, నూనె - 1/4 కప్పు, చింతపండు - 20 గ్రా., వెల్లుల్లి రెబ్బలు - 20
తయారీ : ముందుగా ఆవాలు, మెంతులు వేయించుకొని పొడి కొట్టుకొని ఉంచుకోవాలి. ముందురోజే గోంగూరను శుభ్రంగా కడిగి, పొడి క్లాత్‌పై ఆరనివ్వాలి. చింతపండు, ఉప్పు, పండుమిర్చి ముక్కలు వేసి కచ్చాపచ్చాగా తొక్కి ఉంచుకోవాలి. తర్వాతి రోజు ఏమాత్రం తడి లేకుండా పూర్తిగా ఆరిపోయిన గోంగూరను బాండీలో నూనె వేసి, వేయించుకోవాలి. ఈ గోంగూరలో, ఆవాలుమెంతుల పొడి, పండుమిర్చి మిశ్రమం, పసుపు, వెల్లుల్లి వేయాలి. వీటన్నింటినీ బాగా కలిసేలా గ్రైండ్‌ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వెడల్పు గిన్నెలోకి తీసుకుని, బాగా కలపాలి. అంతే గోంగూర, పండుమిర్చి పచ్చడి రెడీ అయినట్లే. పచ్చడిని ఒకరోజు ఊరనిచ్చి, రెండోరోజు మరల ఒకసారి కలుపుకొని, జాడీలో భద్రపరచుకోవాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు కావలసినంత పచ్చడి తీసుకొని, తాలింపు పెట్టుకోవచ్చు.