Jun 08,2022 06:50

మార్కెట్‌లో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులను, అంతర్జాతీయ పరిస్థితులను సమీక్షించి 8.1 శాతంగా వడ్డీరేటును నిర్ణయించామని కేంద్ర కార్మిక శాఖా మంత్రి ప్రకటించారు. కానీ క్రమానుగతంగా తగ్గుతున్న వడ్డీరేటు ప్రభుత్వ నిర్ణయాల లోని డొల్లతనాన్ని స్పష్టం చేసింది. 8.5 శాతం నుంచి 8.1 శాతానికి అంటే 40 బేస్‌ పాయింట్లు తగ్గించటం వలన ప్రతి లక్షకు సుమారు 430 రూపాయల మేరకు చందాదారులకు ఆదాయం తగ్గనున్నది. ఇపిఎఫ్‌ కార్పస్‌ మొత్తం పరిమాణంగా పరిగణన లోకి తీసుకున్నపుడు... ఈ నష్ట ప్రభావం అధిక మొత్తంలో ఉంటుంది.

2021-22 ఆర్థిక సంవత్సరానికి ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌పై వడ్డీ రేటును 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించాలని ...ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌, సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ట్రస్టీస్‌...చేసిన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ నెల మూడవ తేదీన ఈ మేరకు ఇపిఎఫ్‌ఒ అధికారికంగా నోటిఫికేషన్‌ జారీచేసింది. కేంద్ర ప్రభుత్వ ఈ నిర్ణయం సుమారు ఆరు కోట్ల ఇపిఎఫ్‌ చందాదారుల మీద ప్రతికూల ప్రభావం చూపనున్నది. 45 సంవత్సరాల కనిష్ట స్థాయికి ఇపిఎఫ్‌ పై వడ్డీరేటు కుదించబడటం వలన ఉద్యోగ, కార్మికుల భవిష్యత్‌ ప్రయోజనాలకు తీవ్ర భంగం వాటిల్లింది.
     ఉద్యోగుల భవిష్య నిధి చట్టం-1952, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు కార్మికుల వేతనాల నుంచి కొంత మొత్తాన్ని మినహాయించి, ఉద్యోగ విరమణ అనంతరం వారి ప్రయోజనాల కోసం పిఎఫ్‌ లో పొదుపు చేయడం తప్పనిసరి చేసిన అంశం విదితమే. పెన్షనర్ల జీవన సాఫల్యమే లక్ష్యంగా నిర్దేశించుకున్న ఇపిఎఫ్‌ఒ, ప్రతి నెలా కార్మికులు ఉద్యోగుల మూల వేతనంలో 12 శాతం ప్రావిడెంట్‌ ఫండ్‌ను మినహాయించడంతో పాటు అదే మొత్తాన్ని యాజమాన్యం కూడా సంస్థ తరపున జమ చేసే ప్రక్రియను అమలుచేస్తోంది.
      ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ అనేది ఉద్యోగికి భవిష్యత్తులో ఇచ్చే పెన్షన్‌ నిధికి సంబంధించిన అంశం. ఉద్యోగ భవిష్య నిధి ఖాతాలో యాజమాన్యం ఖాతా, ఉద్యోగి ఖాతా, ప్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతాలు ఇమిడి ఉంటాయి. ఉద్యోగి ప్రావిడెంట్‌ ఫండ్‌ అకౌంట్‌లో జీతం నుంచి నిర్బంధంగా మినహాయించి చెల్లించే మొత్తంతో పాటు వాలంటరీగా, అదనంగా పెన్షన్‌ ఫండ్‌కు జమ చేసేవి కూడా ఉంటాయి. యాజమాన్య వాటాలో ఇపిఎఫ్‌ చందా మినహాయించి మిగతా మొత్తాన్ని యాజమాన్య ఖాతా కింద చూపిస్తారు. ఉద్యోగి-యజమాని ఖాతాల్లోని మొత్తానికి కలిపి ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ వడ్డీ చెల్లింపులు చేస్తుంది.
      ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో 'ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌' లక్ష్యాలు, వడ్డీ చెల్లింపు విధాన ప్రక్రియ, ఇపిఎఫ్‌ నిధులను స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడిగా ఉంచే పద్ధతులలో ఇప్పటికే వచ్చిన విధానపరమైన మార్పులకు అదనంగా, కేంద్ర ప్రభుత్వం ఈ యేడాది ఏప్రిల్‌ నుంచి అమలు లోకి వచ్చే విధంగా పిఎఫ్‌ నిధులను పన్ను, పన్నేతర ఖాతాలుగా నిర్వహించాలని కూడా నిర్ణయించారు. పిఎఫ్‌ ఖాతాలో 2.5 లక్షలకు మించి జమ చేస్తే అటువంటి భవిష్యత్‌ నిధి ఖాతాలను ఆదాయపు పన్ను పరిధి లోనికి తేనున్నారు. సీలింగ్‌ను దాటి జమయిన మొత్తంపై ఆదాయపు పన్నును ఆన్‌లైన్‌ పద్ధతిలో మినహాయించాలని నిర్ణయించారు.
      ఇపిఎఫ్‌ఒ లో జమ చేసిన చందా మొత్తాలను వివిధ రంగాలలో పెట్టుబడులుగా పెట్టి, వాటిపై వచ్చే లాభాల నుంచి చందాదారులకు వడ్డీని చెల్లించడం జరుగుతోంది. 85 శాతం ప్రభుత్వ బాండ్లు, సెక్యూరిటీలు తదితర రుణ సాధనలోను, 15 శాతం స్టాక్‌ మార్కెట్లలోనూ పెట్టుబడులుగా ఉంచుతారు. వీటిలో 45 శాతం నుంచి 65 శాతం ప్రభుత్వ సెక్యూరిటీలుగానూ, 20 శాతం నుంచి 50 శాతం కార్పొరేట్‌ సంస్థలు జారీ చేసిన రుణ పత్రాలలోనూ, స్టాక్‌ ఎక్సేంజ్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా (సెబీ)లో నమోదైన ఎ1 రేటింగ్‌తో ఉన్న రుణ పత్రాలలో 5 శాతం మేరకు నిధులు పెట్టే విధంగా కాలానుగుణంగా మార్పులు చేశారు. ఈక్విటీ పెట్టుబడుల అంశానికి సంబంధించి సెన్సెక్స్‌, నిఫ్టీలను అనుసరించే, సెబీలో నమోదు అయినటువంటి మ్యూచువల్‌ ఫండ్స్‌ మరియు ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌లో, అధిక పెట్టుబడులున్న కంపెనీ షేర్లలోనూ ఈక్విటీల రూపంలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ప్రభుత్వం అనుమతించింది.
       2015 నుంచి మార్చి 2021 వరకు ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌, ఈక్విటీ లింక్డ్‌ ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌లో రూ.1,37,895.95 కోట్ల నిధులను పెట్టుబడులుగా పెట్టింది. ఈ మొత్తంలో కేవలం 2021 ఆర్థిక సంవత్సరంలోనే రూ.32,070 కోట్లను ఈ విధమైన ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం గమనార్హం. పెట్టుబడుల మీద వడ్డీ రూపంలో 2021 ఆర్థిక సంవత్సరంలో రూ.72,811 కోట్ల వడ్డీని సముపార్జించింది. 2020-21 డిసెంబరు నాటికి అడ్వాన్స్‌ సౌకర్యం కింద చందాదారులకు రూ.14,310.21 కోట్లు మంజూరు చేయడంతో పాటు 56.79 లక్షల క్లైయిములను పరిష్కరించింది. ఇపిఎఫ్‌ దగ్గర మొత్తం రూ. 9.42 లక్షల కోట్ల కార్పస్‌ ఫండ్‌ ఉంది.
        కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారం లోకి రాకముందు ఇపిఎఫ్‌ పై వడ్డీ రేటు 8.75 శాతంగా ఉండేది. అనంతరం ఒక్క సంవత్సరం అతి స్వల్పంగా పెంచినా ఆ తరువాత వరుస ఆర్థిక సంవత్సరాలలో ఇపిఎఫ్‌ పై వడ్డీ రేటులో కోత కొనసాగుతోంది. గత పదేళ్ళుగా వడ్డీరేట్లను పరిశీలించినట్లయితే, 2011-9.5 శాతం, 2012-8.25 శాతం, 2013-8.5 శాతం, 2014-8.75 శాతం, 2015-8.75 శాతం. 2016-8.8 శాతం, 2017-8.65 శాతం, 2018-8.55 శాతం, 2019-8.65 శాతం, 2020-8.5 శాతం, 2021-8.5 శాతం, 2022-8.1 శాతంగా ఉన్నాయి.
2015 నుంచి ఇపిఎఫ్‌ నిధులను 15 శాతం మేరకు ఈక్విటీ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అప్పట్లోనే జాతీయ కార్మిక సంఘాలు, అనేక స్వతంత్ర ఫెడరేషన్లు, యూనియన్లు వ్యతిరేకించాయి. అయినప్పటికీ ఇపిఎఫ్‌ పొదుపుపై చందాదారులకు ఎక్కువ మొత్తంలో రిటర్న్స్‌ అందించటానికే పిఎఫ్‌ నిధులను స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులకు అనుమతించామని ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నది.
    మార్కెట్‌లో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులను, అంతర్జాతీయ పరిస్థితులను సమీక్షించి 8.1 శాతంగా వడ్డీరేటును నిర్ణయించామని కేంద్ర కార్మిక శాఖా మంత్రి ప్రకటించారు. కానీ క్రమానుగతంగా తగ్గుతున్న వడ్డీరేటు ప్రభుత్వ నిర్ణయాలలో డొల్లతనాన్ని స్పష్టం చేసింది. 8.5 శాతం నుంచి 8.1 శాతానికి అంటే 40 బేస్‌ పాయింట్లు తగ్గించటం వలన ప్రతి లక్షకు సుమారు 430 రూపాయల మేరకు చందాదారులకు ఆదాయం తగ్గనున్నది. ఇపిఎఫ్‌ కార్పస్‌ మొత్తం పరిమాణంగా పరిగణన లోకి తీసుకున్నపుడు ఈ నష్ట ప్రభావం అధిక మొత్తంలో ఉంటుంది.
     ఇపిఎఫ్‌ఒ లో 450 కోట్లు మిగులు నిధులు ఉన్నప్పటికీ, వడ్డీరేటును 8.1 శాతానికి కుదించటం పట్ల కార్మిక సంఘాలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తపరచటంతో పాటు, ఈ మేరకు ఆర్థిక మంత్రికి రిప్రజెంటేషన్లు కూడా ఇచ్చారు. వడ్డీరేటు తగ్గింపు చర్యను పున:సమీక్షించాలనే డిమాండ్‌ పెద్ద ఎత్తున ముందుకు వచ్చింది. రిటైర్‌మెంట్‌ అనంతరం ప్రయోజనాల కోసం భవిష్య నిధి సంస్థలో చేసే పొదుపును ఒక సామాజిక బాధ్యతతో కూడిన కర్తవ్యంగా భావించవలసిన ప్రభుత్వం...ఉద్యోగుల కష్టార్జితాన్ని స్టాక్‌ మార్కెట్‌ ఒడిదుడుకులతో అనుసంధానం చేయడం ఆమోదయోగ్యం కాని చర్య. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ప్రభుత్వం ఇస్తున్న వడ్డీరేటుకు సమాంతరంగా ఉద్యోగుల భవిష్య నిధిపై ఇచ్చే వడ్డీరేటును నియంత్రించాలనే అంతర్లీనమైన కేంద్ర ప్రభుత్వ లక్ష్యం, ఇపిఎఫ్‌ వడ్డీరేటు తగ్గింపు చర్యతో మరోసారి బహిర్గతమయింది.
     వృద్ధి, స్థిరత్వం, సమానత్వం అనేవి ఒకదానిపై ఒకటి ఆధారపడిన అంశాలుగా భావించినప్పుడు సామాన్య ప్రజానీకానికి అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయాత్మకమైన జోక్యం చేసుకోవలసి ఉంటుంది. కానీ ప్రజలలో పొదుపును ప్రోత్సహించడానికి, కార్మికులు ఉద్యోగుల జీవన ప్రమాణ స్థాయిని వృద్ధి చేయటానికి భిన్నంగా ప్రభుత్వ నిర్ణయాలు ప్రతిబింబిస్తున్నాయి.
     కేంద్ర ప్రభుత్వం ''సబ్‌కా సాత్‌-సబ్‌కా వికాస్‌'' అనే నినాదమిస్తూ, కార్పొరేట్లకు రాయితీలిచ్చి, కార్మికులు కార్మికుల కష్టార్జితాన్ని ఆవిరిచేసే విధానాలు అమలు పరచటాన్ని దేశ కార్మికవర్గం చూస్తూ ఊరుకోదు. 70 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం కలిగిన 'ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఇపిఎఫ్‌ఒ) నిధులను, నిర్ణయాలను ఆర్థిక సంస్కరణల బారినుండి, కార్పొరేట్‌ కనుసన్నలలో అమలవుతున్న ప్రభుత్వ నిర్ణయాల నుండి కాపాడుకోవడం ఉద్యోగులు కార్మికుల తక్షణ కర్తవ్యం.

                                నాలుగు దశాబ్దాల కనిష్ట స్థాయికి పి.ఎఫ్‌ వడ్డీ రేటు             జి కిషోర్ కుమార్

  / వ్యాసకర్త : జాయింట్‌ సెక్రటరీ, ఎస్‌సిజడ్‌ఐఇఎఫ్‌, ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ఎల్‌ఐసి ఉద్యోగ సంఘం/
                                                              సెల్‌: 9440905501