
నేడు ప్రపంచ ఓజోన్ రక్షణ దినోత్సవం
సూర్యకాంతి లేకుండా భూమిపై జీవం సాధ్యపడదు. అత్యంత శక్తివంతమైనవి కావడం వల్ల సూర్య కిరణాలు పూర్తిగా భూమిని తాకితే జీవులకు హాని కలిగిస్తాయి. సూర్యుని నుంచి వెలువడే అతినీల లోహిత కిరణాలను ఓజోన్ పొర గ్రహించి భూమిపై జీవరాశికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. అతినీలలోహిత కిరణాలను ఓజోన్ వడకట్టకపోతే చర్మం వంటి రక్షణ పొరలలోకి చొచ్చుకుపోతుంది. మొక్కలు, జంతువులలో డి.ఎన్.ఎ అణువులను దెబ్బతీస్తుంది. సముద్ర జీవులకు హాని కలుగుతుంది. ప్రాణాంతక చర్మ క్యాన్సర్ మెలనోమా మరియు అకాల వృద్ధాప్యాన్ని కలిగిస్తుంది. ఈ విధంగా ప్రాణులకు నష్టం కలుగకుండా ఓజోన్ పొర కాపాడుతుంది.
ఫ్రిజ్‌ల వంటి శీతలీకరణ యంత్రాలు, ప్లాస్టిక్ వస్తువుల తయారీ పరిశ్రమల నుండి, మంటలను ఆర్పే టెక్నాలజీ వాడకం మొదలగు ప్రక్రియల వలన క్లోరిన్, బ్రోమిన్ వాయు అణువులు వాతావరణంలో కలుస్తాయి. పెట్రోలు, డీజిల్ మొదలగు ఇంధనాలతో నడిచే మోటారు వాహనాలు, యంత్రాలు వెదజల్లే కాలుష్యం వలన కూడా ఓజోన్ పొరను నాశనం చేసే రసాయనాలు వాతావరణంలో కలుస్తాయి. అవి మెల్లగా స్ట్రాటో ఆవరణంలోకి చేరతాయి. ఇక్కడకు చేరిన క్లోరిన్, బ్రోమిన్ అణువులు ఓజోన్ పొరను నాశనం చేస్తాయి.
ఓజోన్ పొరను పరిరక్షించేందుకు....పెట్రోలు, డీజిల్ మొదలగు ఇంధనాల మీద నడిచే వాహనాలు, యంత్రాల వాడకం తగ్గించాలి. వ్యక్తిగత వాహనాల సఖ్యను తగ్గించాలి. వాటి స్థానే ప్రజారవాణా వ్యవస్థను అభివృద్ధి పరచాలి. పర్యావరణ హిత సోలార్, ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ధి చేయాలి. క్లోరో ఫ్లోరో కార్బన్ల, హైడ్రో క్లోరో ఫ్లోరో కార్బన్లను కలిగిన రసాయన సమ్మేళనాల వాడకాన్ని ఏవిధమైన మినహాయింపులు లేకుండా ఖచ్చితంగా అమలుచేయాలి. ప్రభుత్వాలు ఓజోన్ క్షీణత పదార్థాల ప్రత్యామ్నాయాలు కోసం పరిశోధనలను ప్రోత్సహించాలి. పర్యావరణ హితమైన సమగ్రాభివృద్ధికి కృషి చేయాలి. ప్రజా సైన్స్ శాస్త్రవేత్తలు, పర్యావరణ వేత్తలు, పర్యావరణ ప్రేమికులు ఓజోన్ పొరకు సంభవిస్తున్న ప్రమాదాన్ని, దాని పర్యవసానాలను ప్రజలలో ప్రచారం చేయాలి. ఇది ఒక మానవజాతి తక్షణ కర్తవ్యంగా గుర్తింపచేయాలి.
- కె.వి.వి.సత్యనారాయణ,
పర్యావరణ సబ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్, సెల్ : 8500004953.