Nov 01,2023 12:37

వివక్ష నిండిన సమాజంలో అమ్మాయిగా పుట్టడమే మైనస్‌గా భావించే మనుషుల మధ్య, వైకల్యంతో ఉన్న అమ్మాయి ఎలా జీవిస్తుంది? వివక్షకు తోడు నిత్యం అవమానాలు, వేధింపులు, తల్లిదండ్రులకు భారమనే మనోవేదనతో రోజులు వెల్లదీస్తారు. కానీ ఆ వైకల్యాన్నే వెక్కిరిస్తూ.. కాళ్లు చచ్చుపడినా, చూపు లేకపోయినా, మానసికంగా ఎదగకపోయినా, వెన్నుపూస విరిగి మంచానికే పరిమితమైనా, రెండు చేతులూ ఎదగక పోయినా తమ సత్తా చూపిస్తున్నారు కొంతమంది యువతులు. క్రీడారంగంలో వారు సాధిస్తున్న ప్రగతికి, వారి దృఢసంకల్పానికి వైకల్యం ఓడిపోయింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆ వైకల్య బాధితులు సాధిస్తున్న పతకాల పరుగును చూసి చిన్నబోయింది. ఇటీవల పారా క్రీడాకారులు ఆసియా గేమ్స్‌లో 111 పతకాలు సాధించారు. 29 బంగారు పతకాలు, 31 రజతాలు, 51 కాంస్య పతకాలు సొంతం చేసుకున్న వారిలో మహిళా క్రీడాకారులూ ఉన్నారు.

12

ఎన్నో సవాళ్లను, అడ్డుగోడలను అధిగమించి దీప్తీ జీవన్‌జీ, శీతల్‌ దేవి, అవని లేఖరా, ప్రాచీ యాదవ్‌, రక్షితా రాజు, థులసీమాథి మురుగేశన్‌, నిమిషా, సిమ్రాన్‌, భాగ్యశ్రీ మాధవ్‌రావ్‌ జాదవ్‌, పూజ, జైనబ్‌ ఖాటూన్‌, లలితా కిలక, మానసి జోషి, ఏక్తా భ్యాన్‌, భావినా పాటెల్‌, నిత్యశ్రీ, అరుణా తన్వార్‌, మనీషా రామదాస్‌, మందీప్‌ కౌర్‌, వైష్ణవి పునియాని, రాజ్‌ కుమారి, కోకిల, హిమాన్షి రాథి, ఫ్రాన్సిస్‌ రుబినాలలో కొందరి గురించి

23

                                                                                     క్లుప్తంగా..

దీప్తి : వరంగల్‌ జిల్లా కల్లెడ గ్రామానికి చెందిన జె.దీప్తి ఈ పోటీల్లో టీ-20 కేటగిరీలో 400 మీటర్ల అథ్లెటిక్స్‌లో పోటీపడి, బంగారు పతకం సాధించింది. దీప్తి తల్లిదండ్రులు రోజుకూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తల్లిదండ్రులు యాదగిరి, ధనలక్ష్మిలది మేనరిక వివాహం. ఈ కారణంగా దీప్తి పుట్టుకతోనే మానసిక వైకల్యంతో జన్మించింది. ఆర్థిక ఇబ్బందులు, ఇద్దరు ఆడబిడ్డలు, అయినా పెద్దకూతురు దీప్తి ఎంచుకున్న క్రీడామార్గం వైపే ఆ తల్లిదండ్రులు ప్రోత్సహించారు. అలా ఒకసారి ఖమ్మంలో జరిగిన రాష్ట్రస్థాయి క్రీడామీట్‌లో స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా అథ్లెటిక్స్‌ కోచ్‌ ఎన్‌ రమేష్‌, దీప్తి శక్తిని గుర్తించి అథ్లెటిక్‌ ప్రపంచంలో రాణించేలా శిక్షణ ఇచ్చారు. అలా ఆమె మొదలుపెట్టిన పరుగు ప్రయాణంలో ఎన్నో పతకాలు ఆమె ముందు మోకరిల్లుతున్నాయి.

33

రాధ, రక్షితా రాజు : కర్నాటక, చిక్‌ మంగులూరుకు చెందిన రక్షితా రాజు పుట్టుకతోనే అంధురాలు. ఈ పోటీల్లో 1500 మీటర్ల టి11 కేటగిరీలో పోటీపడి బంగారు పతకం కైవసం చేసుకుంది. ఈ పోటీల్లోనే 400 మీటర్ల విభాగంలో పోటీపడి కాంస్యం నెగ్గిన రాధ కూడా కర్నాటక, చిత్రదుర్గకు చెందిన యువతి. రాధకు పాక్షికంగా కళ్లు కనిపించవు. ఇద్దరూ 'ఆశాకిరణ్‌' అంధ పాఠశాలలో చదువుకున్నారు. రతిక తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోయారు. తమ్ముడిని, తనను నానమ్మే పెంచుతోంది. చూపు లేకపోయినా సత్తా చాటుతున్న రతిక 7వ తరగతినుండే పతకాలు సాధించడం మొదలుపెట్టింది. 2020 పారా ఒలింపిక్స్‌లో పోటీపడి బంగారు పతకం కూడా సాధించింది.

34

శీతల్‌ : జమ్ముకాశ్మీర్‌లో పుట్టి పెరిగిన శీతల్‌ ఈ పోటీల్లో ఆర్చరీ విభాగంలో పోటీపడి ఒకటి కాదు రెండు బంగారు పతకాలు సాధించింది. ఆమె జీవితం ఓ విషాదగాధ. ఫొకోమేలియా వ్యాధి కారణంగా మిగిలిన అవయవాల మాదిరి ఆమె రెండు చేతులు ఎదగలేదు. తల్లిదండ్రులిద్దరూ పనికివెళ్తేనే రోజు గడిచే కుటుంబం వారిది. ఓ వైపు పేదరికం, మరోవైపు అంగవైకల్యంతో బాధపడుతున్న తను తల్లిదండ్రులకు భారమయ్యాయని తనను తాను నిందించుకునేది. రెక్కలు తెగిన పక్షిలా జీవిస్తున్నానని, బాగా చదువుకుని టీచర్‌ అయి కుటుంబానికి సాయపడాలని కలలు కన్నది. కృత్రిమ చేతులు ఉంటే జీవితంలో మరింత ముందుకువెళ్లవచ్చని అనుకున్నా ఆ ప్రయత్నం మాత్రం ఎప్పుడూ చేయలేదు. కాళ్లతోనే అన్ని పనులు చేసేది. రాయడం, చదవడం, దుస్తులు వేసుకోవడం ఇలా ప్రతిఒక్క పనికి కాళ్లనే ఉపయోగించేది. ఆటలపై మక్కువ ఉన్న శీతల్‌కు గురిచేసి బాణం వేయడం మరీమరీ ఇష్టం. కానీ ఎలా? తీక్షణమైన దృష్టి ఉంటే చేతులు లేకపోయినా కాళ్లతోనే విల్లును ఎక్కిపెట్టచ్చు అని నిరూపించింది. చేతులు లేకుండా ఆర్చరీవి భాగంలో పోటీపడుతున్న ఏకైక క్రీడాకారిణి శీతల్‌. 2024 పారా ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే తన లక్ష్యమంటోంది.

sheetal

మానసి జోషి : బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి మానసి జోషిది మరో స్ఫూర్తివంత గాధ. ఆమె పుట్టుకతో వైకల్య బాధితురాలు కాదు. అనుకోని ప్రమాదంలో 22 ఏళ్లకు తన ఎడమ కాలును పోగొట్టుకుంది. అప్పటివరకు ఉరకలు వేస్తూ, పరుగులు పెడుతూ జీవించిన తను ఒక్కసారిగా ఒంటికాలితో జీవించాల్సి రావడం తీవ్ర మనోవేదనకు గురిచేసింది. బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడైన తండ్రి ప్రోత్సాహంతో బాల్యం నుండీ ఆ క్రీడవైపు మొగ్గుచూపిన మానసి చదువులో రాణించేది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా కెరీర్‌ ప్రారంభించింది. అంతా సజావుగా ఉందనుకున్న ఆ సమయంలోనే ఆఫీసుకు వెళ్తున్న మానసి స్కూటరును వెనక నుండి వచ్చిన లారీ ఢికొట్టింది. కిందపడిపోయిన ఆమె ఎడమకాలిపై నుండి లారీ చక్రాలు వెళ్లడంతో కాలు నుజ్జునుజ్జయ్యింది. వైద్యులు ఎంత ప్రయత్నించినా కాలు తిరిగిరాలేదు. ఇంతటి విషాధం నుంచి ఆమె త్వరగా కోలుకోలేదు. నాలుగ్గోడలకే పరిమితమైపోయింది. అయితే ఎంతకాలం ఇలా..? అందమైన తన జీవితాన్ని ఈ వైకల్యం వెక్కిరించడం సహించలేకపోయింది. ప్రోస్టటిక్‌ కాలును అమర్చుకుని పూర్తికాలం బ్యాడ్మింటన్‌ వైపు మొగ్గుచూపింది. అలా ఎన్నో ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో తన సత్తా చాటుతోంది. తాజా పోటీల్లో కాంస్య పతకం సొంతం చేసుకుంది.

34

అవని లేఖరా : రాజస్థాన్‌కి చెందిన వీల్‌ఛైర్‌కే పరిమితమైన అవని లేఖరా ఆర్చరీ విభాగంలో ఎన్నో పతకాలను సాధిస్తూ తన విజయపరంపరను కొనసాగిస్తోంది. అనుకోని ప్రమాదంలో నడుం కిందిభాగం చచ్చుపడిపోయి కొన్నేళ్లపాటు తీవ్ర ఒత్తిడితో నలిగిపోయింది. ఎవరితో మాట్లాడేది కాదు. కుటుంబంతో కూడా సరిగ్గా గడిపేది కాదు. కూతురు పరిస్థితిని చూసి చలించిపోయిన తండ్రి ఆమెను ఆర్చరీ విభాగం వైపు నడిపించాడు. తన వల్ల కాదు.. ఇక తన జీవితం ముగిసిపోయిందనుకున్న ఆమె క్రీడలో కొత్త జీవితాన్ని వెతుక్కుంది. తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతో ఎన్నో ఉన్నతశిఖరాలు అధిరోహిస్తోంది.

56

ప్రాచీ యాదవ్‌ : పుట్టుకతోనే వైకల్యం, చిన్న వయసులోనే తల్లి మరణం. ప్రాచీ జీవితంలో కోలుకోలేని విషాదం. మధ్యప్రదేశ్‌ గ్వాలియర్‌కు చెందిన ఆమె రెండుకాళ్లు 60 శాతం చచ్చుపడిపోయాయి. ఈత మీద ఆసక్తితో ఆ వైపు అడుగులు వేసినా కెనోయింగ్‌, కయాకింగ్‌ క్రీడల్లో బాగా రాణిస్తావని, ఆ దిశగా కోచ్‌లు శిక్షణ ఇచ్చారు. అయితే ఈ క్రీడలో కాళ్లు చాలా కీలకం. అయినా ప్రాచీ వెనుకంజ వేయలేదు. తెడ్డు సాయంతో పడవను వేగంగా నడిపేందుకు శరీర పైభాగాన్నే మలుచుకుంది. ఎంతలా అంటే 'ఆమె పాల్గొన్న ప్రతి ఆట గెలుచుకుని వస్తుంది' అనేలా పతకాలు సాధిస్తోంది. తాజా పోటీల్లో రజత పతకం సాధించింది.
ఈ క్రీడాకారులు సాధించిన ఈ ఘనత వీరికి, దేశానికి మాత్రమే గర్వకారణం కాదు; ఎంతోమంది వైకల్య బాధితులకు గొప్ప స్ఫూర్తిదాయకం కూడా !