Jun 20,2023 06:45

             ఆరోగ్య రంగంలో ముఖ్యంగా ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ విషయంలో మనం వెనుకబడి ఉన్నాము. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన సహస్రాబ్ది లక్ష్యాలను కూడా చేరుకోలేదు. అందరికీ ఆరోగ్యం అన్న లక్ష్యానికి ఇంకా దూరంగా వున్నాం. అయితే కొన్ని అంశాలలో అంతర్జాతీయ స్థాయి వైద్యం అందిస్తున్నాము. ఫార్మా, వ్యాక్సిన్ల రంగాల్లో ముందంజ వేశాం. కానీ మొత్తం మీద ఆరోగ్య రంగం అసమానతలతో ఉంది.
           ఆధునిక జీవన శైలి, వివిధ రకాల ఆహారపు అలవాట్లతో మూడు ప్రధాన సమస్యలు మానవాళిని వెంటాడుతున్నాయి. ప్రస్తుతం రక్తపోటు, షుగర్‌ అనేవి చాలా సాధారణంగా మారిపోయాయి. కేవలం నగరాలు, పట్టణాలు కాకుండా పల్లెల్లోనూ ఈ సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రతి పది మందిలో ఒకరికి బి.పి, 30 ఏళ్లు నిండిన ప్రతి 8 మందిలో ఒకరికి మధుమేహం ఉంటున్న పరిస్థితి. దీనినిబట్టే ఈ సమస్య తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. గ్రామాల్లో 26 శాతం, పట్టణాల్లో 30 శాతం మంది బి.పి బాధితులున్నారని అంచనా. అదే డయాబెటిస్‌ విషయానికొస్తే పల్లెల్లో 20 శాతం, పట్టణాల్లో 25 శాతం షుగర్‌ బాధితులున్నారు. చాలామంది అవగాహన లేక, నిర్లక్ష్యంతో మాత్రమే ఈ రెండు ప్రమాదకర జబ్బులు నియంత్రించుకోలేకపోతున్నారని తెలుస్తోంది. కేవలం ఒత్తిడి కారణంగా ఈ జబ్బులు వస్తున్నాయన్నది సుస్పష్టం. సరైన ఆహారం తీసుకోకపోవడం, చిన్నారులు ఎక్కువగా ఎలక్ట్రానిక్‌ పరికరాలకు అలవాటు పడడం కారణాలుగా ఉన్నాయి. భారతదేశంలో ఊబకాయం కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీని కారణంగా ప్రజలు తీవ్రమైన వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఊబకాయం అనేది చిన్న సమస్య కాదని, ఇది ఒక వ్యాధిగా వృద్ధి చెందుతుందని చెప్పింది. స్థూలకాయం అంటే శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉండటమని నిర్వచించారు. శరీర కొవ్వును ఖచ్చితంగా కొలవడం చాలా కష్టం. బాడీ మాస్‌ ఇండెక్స్‌ (బి.ఎం.ఐ) ఆరోగ్యకరమైన బరువును నిర్ణయించడానికి ఒక ప్రసిద్ధమైన మార్గం. భారతదేశంలో బి.ఎం.ఐ 23 కంటే ఎక్కువ ఉంటే, అప్పుడు అధిక బరువుగా పరిగణిస్తారు. అయితే బి.ఎం.ఐ స్థాయి 30 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు ఆ పరిస్థితిని ఊబకాయం అంటారు. ఈ స్థూలకాయాన్ని తేలికగా తీసుకోవడం వల్ల అనేక వ్యాధులకు గురవుతారు. వివిధ వ్యాధుల బారినపడే ప్రమాదాన్ని పెంచుతుందని హెచ్చరిస్తారు.
           స్థూలకాయాన్ని వ్యాధిగా పరిగణించాలి. దీని ప్రభావం గుండెపై ఉంటుంది. గుండెపై కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండె పనితీరుపై తీవ్ర ప్రభావం పడుతుంది. అటువంటి పరిస్థితిలో స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. గుండె ఆరోగ్యం దెబ్బ తింటే శ్వాస వ్యవస్థ పాడై, శ్వాస పీల్చుకోవడంలో అనేక ఇబ్బందులు పడతారు. గుండె చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల ధమనుల్లో ఇబ్బందులు ఏర్పడతాయి. స్థూలకాయం వలన శరీరం బరువు పెరగడంతో కీళ్ల నొప్పులతో ఇబ్బందులు పడతారు. బరువులు ఎత్తినప్పుడు కీళ్లలో నొప్పి మొదలవుతుంది. శరీర బరువు మరింత పెరిగితే, అప్పుడు కీళ్ళపై భారం పడుతోంది. కీళ్లు, పాదాల ఆరోగ్యం చెడిపోకుండా మొదటి నుంచి బరువు అదుపులో ఉంచుకోవాలి.
           శరీరంలోని ముఖ్యమైన అవయవాలు కిడ్నీ, కాలేయంలో కొవ్వు పేరుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ కొవ్వు ఒక రకమైన ఒత్తిడిని సృష్టిస్తుంది. ఈ కారణంగా కిడ్నీ, కాలేయం పని తీరుపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ అవయవాలు సరిగా పనిచేయలేవు. కొవ్వు పట్టిన కాలేయానికి తగిన చికిత్స చేయకపోతే కాలేయం విఫలమై ప్రాణాంతక పరిస్థితికి దారి తీస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఊబకాయం ఉన్నవారిలో తక్కువ స్పెర్మ్‌ ఉత్పత్తి అవుతుంది. పెరిగిన శరీరం. చక్కెర అధికంగా ఉత్పత్తి చేస్తూ మధుమేహం ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అందుకే పిల్లల్ని సాధ్యమైనంతవరకు ఆటల వైపు దృష్టి మళ్లించాలి. పెద్దవాళ్లువ్యాయామం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి.
 

-డా.యం.అఖిలమిత్ర,
ప్రకృతి వైద్యులు