dry eye disease : పొడిబారిన కంటి చికిత్సకు సహాయపడనున్న ఓరల్ ప్రోబియోటిక్స్ : తాజా అధ్యయనం వెల్లడి
న్యూయార్క్ : వాణిజ్యపరంగా లభించే ప్రోబియోటిక్ బ్యాక్టీరియా పొడిబారిన కంటి చికిత్సకు సహాయపడనుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ బ్యాక్టీరియా నమూనాను ఎలుకలపై ప్రయోగించగా.. మెరుగైన ఫలితాలు లభించాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ప్రస్తుత కాలంలో పొడిబారిన కంటి వ్యాధి సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. ఈ సమస్య వల్ల కళ్లలో నీటిశాతం తక్కువగా ఉండి కళ్లు మండుతున్న భావన, ఆపై ఆ ప్రభావం కంటిచూపుపై పడుతోంది. ఇలాంటి సున్నితమైన కంటిసమస్యలతో కంటిచూపును కోల్పోయే ప్రమాదముంది. అయితే ఇప్పటివరకు ఇలాంటి కంటి సమస్యలకు ఐడ్రాప్స్, జెల్స్ వంటివి వైద్యులు సూచిస్తారు. తాజాగా జీర్ణక్రియకు తోడ్పడే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాతో పొడిబారిన కంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చని పరిశోధకులు వెల్లడించారు. తాజా అధ్యయనంపై టెక్సాస్‌లోని బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన లారా షాఫెర్ మాట్లాడుతూ... 'జీర్ణవ్యవస్థకు తోడ్పడే ప్రేగుల్లో నివసించే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా శరీరంలోని ఎన్నో భాగాలకు మేలు చేస్తుంది. ముఖ్యంగా మెదడు, ఊపిరితిత్తుల వ్యాధుల నుండి ఈ బ్యాక్టీరియా రక్షిస్తుంది. ఈ బ్యాక్టీరియానే పొడిబారిన కళ్లపై కూడా ప్రభావం చూపుతుందనడంలో ఆశ్చర్యం లేదు' అని ఆమె అన్నారు. ఇప్పటికే ప్రముఖ అమెరికన్ సొసైటీ ఫర్ మైక్రోబయాలజీ కంపెనీ జరిపిన ఈ ఏడాది వార్షిక సమావేశంలో ఈ బ్యాక్టీరియా ఫలితాలపై వివరించడం జరిందని షాఫెర్ పేర్కొన్నారు.
కాగా ఈ అధ్యయన బృందం పొడిబారిన కంటి చికిత్సకై ప్రోబయోటిక్ బ్యాక్టీరియల్ జాతి లిమోసిలాక్టోబాసిల్లస్ DSM17938 17938 ఉపయోగించింది. DSM17938 అనేది మానవ ఉత్పన్పమైన వాణిజ్యపరంగా లభ్యమయ్యే ప్రోబయోటిక్ బ్యాక్టీరియా జాతి. దీన్ని ఇప్పటివరకు రోగనిరోధక వ్వవస్థపై ప్రదర్శించడం జరిగింది. కానీ ఎలుకల్లో ప్రయోగించడం జరగలేదు. అయితే తాజాగా ఈ బ్యాక్టీరియాను ఎలుకల్లో రోజువారీ మోతాదుగా సైలెన్ ద్వారా పంపించారు. ఆ తర్వాత ఐదు రోజుల తర్వాత ఎలుకల కళ్లను పరిశోధకులు పరీక్షించగా.. కంటి నీటిశాతం మెరుగుపడిందని, పొడిబారిన కంటి కణజాలలు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని గుర్తించారు. ఈ పరిశోధన తర్వాత ప్రోబయోటిక్ బ్యాక్టీరియా ద్వారా పొడిబారిన కంటి సమస్యల చికిత్సకు సహాయపడుతుందని తమ నివేదికలో పేర్కొన్నారు.