Jun 19,2022 06:54

ఈ పార్టీలలో అనేకం రాష్ట్రాల స్థాయిలో పరస్పరం తీవ్రంగా ఘర్షణ పడుతున్నా మోడీ విధానాలను ఎదుర్కొనవలసిన అవసరంపై అంగీకారానికి రావడం ఇక్కడ ప్రధానాంశం. ఇటీవలి కాలంలో వాస్తవ రూపం దాల్చిన విశాలమైన అవగాహన ఇది. ఎన్‌సిపి అధినేత శరద్‌ పవార్‌ పేరు మొదట వరసలో వచ్చినా క్రియాశీల ప్రభావశీల రాజకీయవేత్తగా ఆయన అందుకు నిరాకరించారు. తర్వాత బెంగాల్‌ మాజీ గవర్నర్‌, మహాత్ముని మనవడు గోపాలకృష్ణ గాంధీ పేరు వచ్చింది. ఆయనను గతంలో ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు బలపర్చాయి. మరో ప్రతిపాదన కాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా. వీటిలో ఏది తుది నిర్ణయమైనప్పటికీ, ఉమ్మడి అవగాహనకు రావడం లౌకిక శక్తులు ఆహ్వానించదగిన పరిణామం.

      రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్థిని నిలిపే అవకాశాలు, నిలపాల్సిన అవసరం గురించి గతవారం ఇదే శీర్షికలో చర్చించాం. అందులో అనేక చిక్కులు వున్నా మోడీ సర్కారు ఏకపక్ష పోకడలూ రాష్ట్రాలపై దాడి మతతత్వ రాజకీయాలకు ప్రతిగా ప్రజల్లో సంకేతాలు పంపడం అవసరమనేది నిర్వివాదాంశం. ఇప్పటి వరకూ ఒక్కసారి మినహా రాష్ట్రపతి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భం లేదు. ప్రతిపక్షాల మధ్య అనైక్యత కారణంగా ఒక ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే అవకాశం వుండదని బిజెపి నాయకత్వం భావించింది. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ విషయమై ప్రాథమికంగా చర్చలు జరిపినప్పటికీ మరో వైపున బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉమ్మడి అభ్యర్థిపై చర్చల కోసం ప్రతిపక్షాలకు లేఖ రాశారు. ఈ విధమైన సమావేశాలు ముందుగ చర్చించుకోవాలి గాని తమకు తామే తేదీ నిర్ణయించి ఇతరులు రావాలనడం సరికాదని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అభ్యంతరం తెలిపారు. తర్వాత ఆమెకు రాసిన లేఖ లోనూ ఈ వ్యాఖ్యను పునరుద్ఘాటిస్తూనే రాజ్యసభలో సిపియం పక్షనేత ఎలమారం కరీమ్‌ హాజరవుతున్నట్టు తెలిపారు. బుధవారం జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్‌తో సహ పదిహేడు పార్టీలు చర్చలు జరిపి ప్రతిపక్షం తరపున ఒక అభ్యర్థిని ఎంపిక చేసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఈ నిర్ణయం చేసిన పార్టీలు బెంగాల్‌, తమిళనాడు, కేరళ, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రలలో అధికారంలో వున్నాయి. మధ్యప్రదేశ్‌, బీహార్‌, కర్ణాటక, హర్యానా పాండిచ్చేరి వంటి చోట్ల బలమైన ప్రతిపక్షాలుగా వున్నా గణనీయమైన సంఖ్యాబలం కలిగి వున్నాయి. ఇంతమంది కలసి ఒకే నిర్ణయానికి రావడం కీలకమైన రాజకీయ పరిణామం.
 

                                                          విభేదాలున్నా విశాల ఐక్యత

ఈ పార్టీలలో అనేకం రాష్ట్రాల స్థాయిలో పరస్పరం తీవ్రంగా ఘర్షణ పడుతున్నా మోడీ విధానాలను ఎదుర్కొనవలసిన అవసరంపై అంగీకారానికి రావడం ఇక్కడ ప్రధానాంశం. ఇటీవలి కాలంలో వాస్తవ రూపం దాల్చిన విశాలమైన అవగాహన ఇది. ఎన్‌సిపి అధినేత శరద్‌ పవార్‌ పేరు మొదట వరసలో వచ్చినా క్రియాశీల ప్రభావశీల రాజకీయవేత్తగా ఆయన అందుకు నిరాకరించారు. తర్వాత బెంగాల్‌ మాజీ గవర్నర్‌, మహాత్ముని మనవడు గోపాలకృష్ణ గాంధీ పేరు వచ్చింది. ఆయనను గతంలో ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు బలపర్చాయి. మరో ప్రతిపాదన కాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా. వీటిలో ఏది తుది నిర్ణయమైనప్పటికీ, ఉమ్మడి అవగాహనకు రావడం లౌకిక శక్తులు ఆహ్వానించదగిన పరిణామం. ఈ ప్రక్రియ గమనించిన కేంద్రం కూడా ఏకాభిప్రాయంతో రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు సంప్రదింపుల కోసం సీనియర్‌ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మరో ఇద్దరితో కమిటీనీ వేసింది. మీరే మా అభ్యర్థిని బలపర్చితే బాగుంటందని కాంగ్రెస్‌ నాయకుడు మల్లికార్జున ఖర్గే బదులిచ్చారు. ఇంత ఆలస్యంగా అది కూడా ప్రతిపాదన లేకుండా చర్చ అనడం మొక్కుబడి వ్యవహార మేనని, ప్రతిపక్షాలను నిందించే తంతు అని అందరికీ తెలుసు. గతంలో నీలం సంజీవరెడ్డి, కె.ఆర్‌ నారాయణన్‌ వంటి వారి పేర్లపై ఏకాభిప్రాయం వచ్చింది. మరికొన్నిసార్లు పాలక పక్షం ప్రతిపాదించిన అభ్యర్థిని ప్రతిపక్షాలు బలపర్చిన ఉదాహరణలున్నాయి. ఉదాహరణకు శంకర్‌దయాళ్‌ శర్మ, ప్రణబ్‌ ముఖర్జీ వంటి వారిని వామపక్షాలతో సహా పలు పార్టీలు బలపర్చాయి. ఇక్కడ ముఖ్యమైంది అభ్యర్థి నేపథ్యం, విశ్వసనీయత, రాష్ట్రపతి స్థానానికి తగిన అర్హతలు. ఇప్పుడైనా ఏకాభిప్రాయానికి వ్యతిరేకత లేకున్నా అభ్యర్థి పేరు చెప్పకుండా చర్చలు జరగడం అసాధ్యమని సీతారాం ఏచూరి స్పష్టంగానే చెప్పారు. ద్రౌపది ముర్ము తొలి గిరిజన మహిళా రాష్ట్రపతి అవడం మంచిదే కదా అని పాత్రికేయుడు రాజ్‌దీప్‌ సర్దేశాయి ప్రశ్నించినపుడు ఈ విషయం మీడియా ద్వారా గాక ప్రభుత్వం నుంచి రావాలి కదా అని ప్రశ్నించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడునే ఏకగ్రీవ అభ్యర్థిగా ముందుకు తేవచ్చనే కథనాలు తెలుగులో మాత్రమే కనిపిస్తున్నా జాతీయ మీడియాగాని రాజకీయ పార్టీలు గాని పెద్దగా పట్టించుకోవడం లేదు. పైగా ఆయనను ఉప రాష్ట్రపతిగానే ఈ పార్టీలు వ్యతిరేకించి వున్నాయి. మరో వారం పైగా నామినేషన్ల గడువు వుంది గనక ఆలోగా పాలక పార్టీ వ్యూహం తేలిపోతుంది.
 

                                                             పాల్గొనని టిఆర్‌ఎస్‌, ఆప్‌

ఈ సమావేశానికి మమతా బెనర్జీ ఆహ్వానం పంపినా హాజరవని పార్టీల పరిస్థితి ఏమిటి? ఈ జాబితాలో వైసిపి, బిజెడి, టిఆర్‌ఎస్‌ వున్నాయి (తెలుగుదేశంను పిలవలేదు). ఇందులో మొదటి రెండు పార్టీలు బిజెపితో సఖ్యంగా వుంటున్నాయనే విషయం దేశమంతటికీ తెలుసు. ఈ ఎన్నిక అనగానే ప్రధాని మోడీ ముందుగా పిలిచి మాట్లాడింది వారితోనే గనక వారు రాకపోవడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఇటీవలి కాలంలో కెసిఆర్‌ బిజెపి విధానాలపై విమర్శల హోరెత్తిసూ,్త దేశాభివృద్ధిలో పార్టీలన్నీ విఫలమైనాయని ఆరోపిస్తున్నప్పటికి టిఆర్‌ఎస్‌ కూడా హాజరు కారాదని నిర్ణయించారు. తెలంగాణలో బిజెపితో చేతులు కలిపి తమను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌తో కలసి పాల్గొనరాదు గనక ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆపార్టీ ప్రతినిధులు మీడియా చర్చల్లో చెప్పారు. మమత సమావేశం ఏర్పాటు చేసిన తీరు బాగాలేదనీ కెసిఆర్‌ చెప్పినట్టు కథనాలు విడుదలైనాయి. సిపిఎం, కాంగ్రెస్‌ మరికొన్ని పార్టీలు కూడా సమావేశం ముందుగానూ అక్కడ చర్చలలోనూ విమర్శ చేసినా రాష్ట్రపతి ఎన్నికపై ప్రతిపక్షాలు ఉమ్మడి వైఖరి తీసుకోవాలన్న వాస్తవానికి అనుగుణంగా వ్యవహరించాయి. సిపిఎంకు కేరళలో కాంగ్రెస్‌ ప్రధాన ప్రత్యర్థిగా వుంది. బెంగాల్‌లో మమత తృణమూల్‌ తీవ్ర నిర్బంధం సాగిస్తున్నది. అయినా సరే ఈ విషయంలో బిజెపి వ్యతిరేక పార్టీల ఐక్యత అవసరం గనక పాల్గొంది. నిర్మాణాత్మక సూచనలు చేసింది.
 

                                                          చెప్పే కారణాలు నిజమా ?

అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకుండా కాంగ్రెస్‌ పేరిట దూరంగా వున్న టిఆర్‌ఎస్‌ తన విధానం మాత్రం వెల్లడించలేదు. 19వ తేదీన తమ విస్త్రుత సమావేశంలో చర్చ జరుగుతుందని చెబుతున్నారు. కాంగ్రెస్‌పై ఎన్ని విమర్శలు చేసినా అదీ బిజెపి ఒకటేనని చెప్పడం వాస్తవికత కాజాలదు. ఆ పార్టీ బాగా బలహీనపడినప్పటికీ ఎక్కువ రాష్ట్రాలలో ఎంఎల్‌ఎలు, ఎంపిలు వున్నది వారికే. కాంగ్రెస్‌ ప్రధాన పాత్రధారి నాయక స్థానంలో వుండాలనే వారి కోర్కె, షరతు నిలిచేదికాదని ఇప్పటికే తేలిపోయింది. కాని అసలు ఆ పార్టీ వుండే ఏ వేదికలో పాల్గొనబోమని చెప్పడమంటే బిజెపిపై విశాల పోరాటానికి గండి కొట్టడమే అవుతుంది. మోడీకి అంతకంటే ఆనందం వుండదు. కెసిఆర్‌ గతంలో కాంగ్రెస్‌ నాయకత్వం లోని మొదటి యుపిఎ లో మంత్రిగా వున్నారు. 2018 ఆకస్మిక ఎన్నికలు ప్రకటించి జాతీయ రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు ముందుగా మమతా బెనర్జీనే కలుసుకున్నారు. కాంగ్రెస్‌తో మిశ్రమ ప్రభుత్వం నడుపుతున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రినీ దాని మిత్రపక్షమైన డిఎంకె ముఖ్యమంత్రినీ కలిసివచ్చారు. కనుక అది ప్రధాన సమస్యగా ఆయన భావించలేదు.
 

                                                              జాతీయ పార్టీ విన్యాసం

ఈ సందర్భంగానే కెసిఆర్‌ జాతీయ స్థాయిలో పార్టీ పెడతారని టిఆర్‌ఎస్‌ బిఆర్‌ఎస్‌ అవుతుందని అనధికారికంగా చర్చ తీసుకొచ్చారు. ఆ పార్టీ రూపురేఖల వివరాలు చెబుతున్నారు. 19వ తేదీ సమావేశం తర్వాత స్పష్టత వస్తుందంటున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఎం.పి ఉండవల్లి అరుణ్‌ కుమార్‌తో కెసిఆర్‌ ప్రత్యేకంగా పిలిచి చర్చించారు. ఆ తర్వాత ఉండవల్లి కెసిఆర్‌ సమర్థతపైన, వాక్పటిమపైన ప్రశంసలు కురిపించారు. కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు బలహీనపడిన ప్రస్తుత పరిస్థితిలో బిజెపికి వ్యతిరేకంగా ప్రస్తుతం దీటుగా పొరాడగలిగింది ఆయన ఒక్కరేనని కితాబునిచ్చారు. బిజెపి అనర్థదాయక విధానాలపై కెసిఆర్‌ చేసిన అపార అధ్యయనం గురించి ఆకాశానికెత్తారు. ఈ విషయమై మొదటి నుంచి అపారమైన సమాచారం వెలువరించి నికరంగా పోరాడుతూ నిలవరించిన వామపక్షాల పాత్ర మాత్రం ప్రస్తావించలేదు. మూడు భాషల లోనూ అద్భుతంగా మాట్లాడతారు గనక కెసిఆర్‌ ఒక్కరే మోడీకి చెక్‌ పెట్టగలరని విపరీతంగా పొగిడారు. టిఆర్‌ఎస్‌ ప్రస్తుత విధానం, బిఆర్‌ఎస్‌గా మార్చే యోచన వంటి వాటిపై మాట్లాడలేదని దాటేయడం అన్నిటికన్నా విడ్డూరం. ఇంకోవైపున ప్రగతి భవన్‌ కనుసన్నలలో మసలే మేధావులు, మాజీ సంపాదకులు కొందరు దేశానికి ఆయన నాయకత్వం ఎంత అవసరమో నిగ్గడిస్తున్నారు. ఉండవల్లితో సహా ఇటాంటిి వారు ఏం చెప్పినప్పటికీ టిఆర్‌ఎస్‌కు చాలా పరిమితులున్నాయి. గతంలో మోడీని అతిగా పొగిడిన నేపథ్యముంది. బిజెపికి గట్టి వ్యతిరేక వైఖరి వినిపిస్తున్నా కార్యాచరణ అస్పష్టంగా వుంది. ద్వంద్వ భాషణం సందేహాలకు కారణమవుతున్నది. కేంద్రం దాడుల నేపథ్యంలో ఇతర చోట్ల కూడా పోటీ చేసి జాతీయ పార్టీకి కావలసిన కనీస ఓటింగు సమకూర్చుకుందాం అనుకుంటున్నారా? లేక జాతీయ నాయకత్వం పేరిట తెలంగాణలో గెలవాలని వ్యూహ రచన చేస్తున్నారా అనేది అందరి మదిలో ప్రశ్న. 2018కి ముందు కూడా దేశ్‌కీ నేత కెసిఆర్‌ నినాదాలు విన్నాం. 2019 తర్వాత మళ్లీ అది వెనక్కు పోయి ఇప్పుడు ఎన్నికల ముందు బిజెపి వ్యతిరేక వైఖరితో ముందుకు వచ్చారు.
 

                                                             విస్త్రుత ఏకాభిప్రాయం

దేశాభివృద్ధికి అమోఘమైన ప్రణాళిక తీసుకురావడం కీలకం తప్ప మోడీని గద్దె దింపడం చెత్త ఎజెండా అని తమ పార్టీ విస్త్రుత సమావేశంలో కెసిఆర్‌ ప్రకటించారు. ఇందుకోసం కమ్యూనిస్టు నాయకులతో కలవలేనని చెప్పానన్నారు. జాతీయ పార్టీల పని అయిపోయింది. ప్రాంతీయ పార్టీలతో ఫెడరల్‌ ఫ్రంట్‌ అని గతంలో అనేవారు. ఇప్పుడు ఆగమేఘాలమీద జాతీయ పార్టీ ఏర్పాటు చేసి మోడీని ఒంటరిగా ఢకొీంటానంటున్నారు. జాతీయ పార్టీ అంటే ఇతర రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు ఆహ్వానించే సమస్య వుండదు. దేశంలో ఇంత వరకూ ఒక ప్రాంతీయ పార్టీ వున్న ఫళాన జాతీయ పార్టీ అయిన ఉదాహరణ లేదు. ఎన్టీఆర్‌ తెలుగుదేశం భారత దేశం పెడతానని చెప్పినా నిజం కాలేదు. టిఎంసి, ఎస్‌పి, బిఎస్‌పి వంటివి జాతీయ పార్టీలంటున్నా ఒక రాష్ట్రంలోనే ప్రధానంగా పని చేస్తున్నాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఆప్‌ పంజాబ్‌లో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మాట నిజమే అయినా దానికి అనేక కారణాలున్నాయి. ఇతర చోట్ల ఇప్పటికీ కాలూనిందిలేదు. ఆప్‌ కూడా ఈ సమావేశంలో పాల్గొనలేదు. ప్రతిపక్ష కూటమి నాయకత్వం కోసం మమత, కేజ్రీవాల్‌, కెసిఆర్‌ పోటీ పడుతున్నారంటూ రాజకీయ వర్గాలలో వున్న భావన సరైందేనని ఈ సమావేశం స్పష్టం చేసింది. ఎవరి ఆశలూ ఆలోచనలూ అవసరాలూ వారికి వుండొచ్చుగాని రాష్ట్రపతి ఎన్నిక సమయంలో ఉమ్మడి వైఖరికి అవి అవరోధం కావడం విచారకరం. ఇవన్నీ ఎవరికి సంతోషం కలిగిస్తాయో చెప్పనవసరం లేదు. ఈ విధానం సరికాదనీ, తాము కెసిఆర్‌ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడతామనీ తెలంగాణ సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు.
ఏది ఏమైనా ఎవరు గైర్‌ హాజరైనా పదిహేడు పార్టీలు ఒకే అభ్యర్థిని నిలపాలని నిర్ణయించడం ఆహ్వానించదగింది. ఈ సందర్భంలో వారు రాలేదు గనక ఐక్యత లేదని కొందరు చిత్రించటం చెల్లుబాటు కాదు. నిజానికి ప్రతిపక్ష ఐక్యతా సూచి (అపోజిషన్‌ యూనిటీ ఇండెక్స్‌) మెరుగుదలనే ఇది ప్రతిబింబించింది. భవిష్యత్తులో బిజెపిపై జరగాల్సిన పోరాటానికి, 2024 ఎన్నికల పోరాటానికీ అది దోహద పడుతుంది.

తెలకపల్లి రవి

తెలకపల్లి రవి