బీజింగ్ : అఖిల చైనా మహిళా సమాఖ్య (ఎసిడబ్ల్యుఎఫ్) 13వ జాతీయ మహాసభ సోమవారం బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్‌లో ప్రారంభమైంది. చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వాధినేత సీ జిన్‌పింగ్, ప్రధాని లీ కియాంగ్ తదితరులు హాజరై మహాసభకు హాజరైన ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. చైనా నలుమూలల నుంచి 1800 మంది ప్రతినిధులు ఈ మహాసభకు హాజరయ్యారు. వీరిలో హాంకాంగ్, మకావు ప్రత్యేక పాలిత ప్రాంతాల నుంచి వచ్చిన 90 మంది ప్రతినిధులు ఉన్నారు. చైనా పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ (సిపిపిసిసి) వైస్ చైర్‌పర్సన్, ప్రిసీడియం ఎగ్జిక్యుటివ్ చైర్ పర్సన్ షెన్ యుయో మహాసభ ప్రారంభమైనట్లు ప్రకటించారు. చైనా కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ తరపున డింగ్ సియుసియాంగ్ మాట్లాడుతూ, మహిళాభివృద్ధికి పాటుపడుతున్న సోదరీ మణులందరికీ (మకావు, హాంకాంగ్, తైవాన్, ఓవర్సీస్ మహిళలతో సహా ) తన శుభాభినందనలు తెలిపారు. గత మహాసభ నుండి ఈ మహాసభవరకు చైనా మహిళలు అన్ని రంగాల్లోను అద్భుతమైన పురోగతి సాధించారని ఆయన ప్రశంసించారు. పేదరిక నిర్మూలన, శాస్త్ర సాంకేతిక రంగాల్లో నూతన అన్వేషణ, కోవిడ్-19పై పోరు, కుటుంబ, సమాజ పటిష్టతలో మహిళల పాత్ర, క్రీడల్లో అసాధారణమైన ప్రతిభా సామర్థ్యాలను ప్రదర్శించారని డింగ్ తెలిపారు.. ఆల్ చైనా ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ (ఎసిఎఫ్‌టియు) ప్రధాన కార్యదర్శి సు లియుపింగ్, ఇతర ప్రజా సంఘాల నేతలు మహాసభలో సౌహార్థ సందేశమిచ్చారు. మహాసభ ప్రెసీడియం ఎగ్జిక్యుటివ్ చైర్‌పర్సన్ హువాంగ్ సియోవెయి ఎసిడబ్ల్యుఎఫ్ 12వ కార్యనిర్వాహకవర్గం తరపున నివేదికను ప్రవేశపెట్టారు.