Jul 25,2023 21:54

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం (ఎపి ఒపెన్‌ స్కూల్‌ సొసైటీ) ఆధ్వర్యంలో జరిగిన పదోతరగతి, ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను మంగళవారం విడుదల చేసినట్లు సొసైటీ డైరెక్టరు కెవి శ్రీనివాసులురెడ్డి తెలిపారు. జూన్‌ 26 నుంచి జులై 4 వరకు పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. రెండింటిలోనూ బాలికలే పైచేయి సాధించారని వివరించారు. పదోతరగతిలో 13,320 మంది విద్యార్థులు హాజరైతే 7,619 (57.20 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. వీరిలో బాలికలు 52.60 శాతం, బాలురు 41.75 శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. 88.19 శాతంతో కాకినాడ మొదటి స్థానంలో నిలవగా, 16.83 శాతంతో ఎన్‌టిఆర్‌ జిల్లా చివరిస్థానంలో ఉందని తెలిపారు. ఇంటర్మీడియట్‌ పరీక్షలకు 25,097 మంది హాజరుకాగా, 15,676 (62.46 శాతం) మంది ఉత్తీర్ణత పొందారని అన్నారు. వీరిలో బాలికలు 65.32 శాతం, బాలురు 60.92 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. 84.68 శాతంతో తూర్పుగోదావరి మొదటి స్థానంలో, 42.71 శాతంతో పశ్చిమగోదావరి చివరి స్థానంలో ఉన్నాయని పేర్కొన్నారు. ఫలితాలను www.apopenschool.ap.gov.in  వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు వెల్లడించారు. జులై 27 నుంచి ఆగస్టు 4 వరకు రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు సంబంధించిన ఫీజులు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన రుసుం ఎపి ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చని, ప్రత్యేకమైన అభ్యర్థనలు పంపాల్సిన అవసరం లేదని తెలిపారు.