
రేషన్ వస్తువులకు బదులుగా నగదును అందించడమంటే ... కాలక్రమేణా ఆహార సబ్సిడీని పూర్తిగా నిలిపివేయడమేనని గత అనుభవాలు తెలియచేస్తున్నాయి. సిలిండర్ ధరల సబ్సిడీని నిలిపివేయడం, పుదుచ్చేరి నగదు పంపిణీ ఆపడం వంటివి పరిశీలించినప్పుడు మనకా విషయం బోధపడుతుంది. ప్రపంచ సంపన్నుల జాబితాలో ఆరవ స్థానంలో నిలిచిన అదానీ.. తర్వాత ఐదో స్థానానికి...ఇప్పుడు నాలుగో స్థానానికి ఎగబాకినట్లు ఓ అధ్యయనం వెల్లడించింది. అదానీ సహా కార్పొరేట్ కంపెనీలకు రూ. వేల కోట్ల రాయితీలు ఇస్తున్న బిజెపి ... పేదలకు సంక్షేమ పథకాలు అందజేయడానికి మాత్రం నిరాకరిస్తోంది.
ఆహార సబ్సిడీని పూర్తిగా రద్దు చేయాలనే ప్రజా వ్యతిరేక విధానాన్ని అమలు చేసేందుకు పుదుచ్చేరిని పైలట్ రాష్ట్రంగా, ప్రయోగశాలగా బిజెపి ఉపయోగించుకుంటోంది. అటు కేంద్రంలోను, ఇటు ఆ రాష్ట్రంలోనూ బిజెపి అధికారంలో వుండడంతో మరింత దూకుడుగా ప్రజా వ్యతిరేక విధానాలకు తెగబడుతోంది. పుదుచ్చేరి లోని కరైకాల్, మహి, యానాం సహా అన్ని ప్రాంతాల్లో గత మూడేళ్లుగా రేషన్ దుకాణాలు మూతపడ్డాయి. దీంతో ప్రజలకు ఉచితంగా, సబ్సిడీ ధరలకు అందించే బియ్యం, ఇతర ఆహార పదార్థాలు అందడం లేదు. శాశ్వత ఆదాయం లేని, రేషన్‌పై ఆధారపడిన పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోయారు.
గత పదిహేనేళ్లలో పుదుచ్చేరిలో వేలాది కుటుంబాలు పేదరికంలో పడిపోయాయి. రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల కారణంగా పేదలు తమ ఆహార అవసరాలు తీర్చుకోలేకపోతున్నారు. వారి పిల్లలు పోషకాహార లోపంతో బాధ పడుతున్నారు. స్థిరమైన ఆదాయం లేక శారీరక శ్రమపై ఆధారపడి జీవిస్తున్న వారంతా పేదరికంలో మగ్గుతున్నారు. వీరికి ఎరుపు రంగు రేషన్ కార్డులు ఇవ్వలేదు. గిరిజనులకు సైతం ఎరుపు రేషన్ కార్డులు అందడం లేదని ఇటీవల పత్రికల్లో కథనం వచ్చింది. అయితే అదే సమయంలో రాజకీయ పలుకుబడి ఉన్న వారికి మాత్రం రెడ్ కార్డ్ అందుతోంది! కరోనా తర్వాత చిన్న వ్యాపారాలు సంక్షోభంలో పడ్డాయి. జీవనోపాధిని కోల్పోయిన అసంఘటిత కార్మిక కుటుంబాలు, పేద కుటుంబాలు ఎటువంటి ఆదాయం లేక సంక్షోభంలో పడ్డాయి. ఇంతటి విపత్కర పరిస్థితుల తర్వాత కూడా ఆహారానికి బదులు నగదు చెల్లించడం సాధ్యం కాదని ఇటీవల తనను కలిసిన సిపిఎం నేతలకు బిజెపి-ఎన్.ఆర్ కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వ ముఖ్యమంత్రి రంగస్వామి స్పష్టం చేశారు.
నగదు బదిలీ నాటకం
పుదుచ్చేరిలో 2015లో ఎన్.ఆర్. కాంగ్రెస్ అధికారంలో ఉంది. కేంద్రంలో బిజెపి అధికారంలో ఉంది. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న రంగస్వామి పుదుచ్చేరిలో అప్పటికే ఉన్న ఉచిత బియ్యం పథకం స్థానంలో నేరుగా నగదు బదిలీ పథకాన్ని అమలు చేశారు. మార్క్సిస్టు పార్టీ నిరసన ఉద్యమాలు చేపట్టింది. వెంటనే ప్రభుత్వం ఆ పథకాన్ని ఉపసంహరించుకుంది. మూడేళ్ల క్రితం నారాయణ స్వామి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకించినప్పటికీ రేషన్ కు బదులుగా నగదు ఇచ్చే పథకాన్ని గవర్నర్ కిరణ్‌బేడీ ప్రకటించి అమలు చేశారు. బియ్యం బదులు డబ్బులు ఇవ్వడంపై ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశారు. సిపియం ఈ పథకానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు నిర్వహించింది. అయినప్పటికీ, నగదు చెల్లింపు పథకాన్ని బలవంతంగా అమలు చేశారు. 2021 ఎన్నికల్లో బిజెపి-ఎన్‌ఆర్ కాంగ్రెస్ కూటమి విజయం సాధించి అధికారం లోకి వచ్చిన తర్వాత నగదు బదిలీ కూడా ఆగిపోయింది. దాంతో, గత 15 నెలలుగా ఎరుపు రేషన్ కార్డు హోల్డర్లకు 20 కిలోల బియ్యానికి బదులు రూ.600, పసుపు రేషన్ కార్డుకు 10 కిలోల బియ్యానికి బదులు రూ.300 అందించలేదు. 15 నెలలకు గాను అందాల్సిన రూ.9 వేలు, రూ.4500 ప్రజలకు అందలేదు.
ఈ దుస్థితికి కారణం ?
చండీగఢ్, పుదుచ్చేరిలో ఆహార ధాన్యాల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేసి, సబ్సిడీ మొత్తాన్ని నేరుగా రేషన్ కార్డ్ హోల్డర్ల బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నట్లు 2017 జులై 31న ప్రధానమంత్రి తన ప్రసంగంలో ప్రకటించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేయనున్నట్టు కూడా ప్రకటించారు. సబ్సిడీ ధరకు వంటగ్యాస్ సిలిండర్లను అందించే బదులు, సబ్సిడీని నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి ప్రభుత్వమే చెల్లించే పథకాన్ని మోడీ ప్రభుత్వం అమలు చేసింది. ఇప్పుడు సిలిండర్లపై సబ్సిడీని పూర్తిగా నిలిపివేశారు. ఈ క్రమంలోనే పాండిచ్చేరి రాష్ట్ర ప్రభుత్వం బియ్యం బదులు డబ్బులు చెల్లిస్తామని మొదట్లో చెప్పి కాలక్రమేణా ఆ డబ్బు చెల్లింపును కూడా నిలిపివేసింది.
మోడీ ప్రభుత్వం రేషన్ బియ్యం పంపిణీని నిలిపివేసింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బియ్యంతో పాటు అత్యవసరమైన ఆహార పదార్థాలను కూడా జిఎస్‌టి పరిధిలోకి తీసుకువచ్చింది. ఇది అత్యంత దారుణం. రైతుల నుంచి కనీస మద్దతు ధరకు బియ్యం కొనుగోలు చేసి రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు రేషన్ షాపుల మూసివేత వల్ల రైతుల వద్ద కొనుగోళ్లు నిలిచిపోయే ప్రమాదం ఉంది. దీంతో రైతులు కూడా నష్టపోతారు.
అమలు కాని హామీలు
పుదుచ్చేరి రాష్ట్ర జనాభా 15 లక్షలు. అక్కడ వున్న మొత్తం రేషన్ కార్డులు 3,52,382. వీటిలో 1,60,211 ఎరుపు కార్డులు (దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలు). మిగతావి పసుపు కార్డులు (దారిద్య్రరేఖకు ఎగువన). ఇక్కడ మొత్తం 515 రేషన్ దుకాణాలు ఉన్నాయి. గత ఎన్నికల సమయంలో రేషన్ షాపులను పునరుద్ధరణ చేస్తామని రంగస్వామి ప్రకటించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేషన్ దుకాణాలను ఏర్పాటు చేస్తామన్న హామీతో బిజెపి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. బిజెపి అధికారంలోకి వస్తే.. మోడీ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతాలో రూ. 15 లక్షలు ఇస్తామని మోసం చేసినట్లే...పుదుచ్చేరిలో బిజెపి-ఎన్.ఆర్ కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మోసం చేశాయి.
ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం నాడు నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి ఆర్థిక సహాయం పొందడం ద్వారా పుదుచ్చేరి మరియు కారైకల్ లోని కోఆపరేటివ్ దుకాణాల స్థాయిని సూపర్ మార్కెట్లుగా పెంచుతామని పుదుచ్చేరి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రకటించారు. హామీ ఇచ్చి ఏడు నెలలు దాటిపోయింది. ఆచరణలో ఇంతవరకు ఏమీ జరగలేదు. వాగ్దానం కాస్తా గాలిలో కలిసిపోయింది. గత ప్రభుత్వ హయాంలో గవర్నర్‌గా ఉన్న కిరణ్ బేడీ కేంద్ర ప్రభుత్వానికి ఏజెంట్‌గా వ్యవహరించారు. బియ్యానికి బదులు నగదు ఇవ్వబోమని ప్రకటించడంతో నారాయణస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్-డీఎంకే కూటమి ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో కేసు వేసింది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బియ్యానికి బదులు నగదు చెల్లించాలని ఆదేశించి అమలు చేసింది.
ఆహార భద్రతా చట్టం కింద దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలలో అత్యంత పేదలను గుర్తించే రాష్ట్ర ప్రభుత్వ సాధారణ ఆహార పంపిణీ పథకంతో పాటు, కేంద్ర ప్రభుత్వ అంత్యోదయ అన్న యోజన పథకం (ఏఏవై) కింద ఆహార ధాన్యాలు అందించబడుతున్నాయి. ఏఏవై కింద పుదుచ్చేరిలో 26,000 కుటుంబాలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఆహారాన్ని అందించింది. ఉచిత బియ్యంతో పాటు సబ్సిడీ ధరలకే పప్పులు, పామాయిల్ చక్కెర...ఏఏవై పథకం కింద అదనపు ధాన్యాన్ని పొందుతున్నారు. కరోనా కాలంలో ఆదాయపు పన్ను పరిధి లోకి రాని కుటుంబాలకు నెలకు 7500 రూపాయలు అందించాలి. ఆహార ధాన్యాలు అందించాలనే డిమాండ్‌తో సిపిఎం పోరాడింది. అంతర్జాతీయంగా, విపత్తు సమయంలో ప్రజలకు ఆహార ధాన్యాలను నేరుగా నగదు పంపిణీ చేయాలనే డిమాండ్ బలంగా మారింది. దాంతో, కేంద్ర ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ పథకం కింద ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యాన్ని పంపిణీ చేసింది.
పుదువైలో నగదు-బియ్యం పథకం అమల్లోకి వచ్చిన తర్వాత అంత్యోజన పథకం, గరీబ్ కళ్యాణ్ పథకం మినహా రాష్ట్ర ప్రభుత్వ రేషన్ పథకం పూర్తిగా నిలిచిపోయింది. ఎరుపు కార్డు హోల్డర్లకు ప్రస్తుతం గరీబ్ కళ్యాణ్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 5 కిలోల బియ్యం వచ్చే సెప్టెంబర్ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. తమ మేనిఫెస్టోలో రేషన్ అందజేస్తామని వాగ్దానం చేస్తున్న బిజెపి-ఎన్.ఆర్ కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఆచరణలో ప్రజల కష్టాలను పట్టించుకోలేదు. వారి ఆహార హక్కును కూడా తిరస్కరించింది.
గత ప్రభుత్వ హయాంలో కిరణ్ బేడీ నిబంధనలను తుంగలో తొక్కి బిజెపి కి అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించేందుకుగాను ఆ పార్టీకి చెందిన ముగ్గురిని నామినేటెడ్ సభ్యులుగా చేశారు. ఈ సభ్యుల మద్దతుతో పాటుగా కొనుగోలు చేసిన సభ్యుల మద్దతుతో బిజెపి...కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రద్దు చేసింది. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి-ఎన్.ఆర్.కాంగ్రెస్ 16 స్థానాలను గెలుచుకుంది. కేంద్ర ప్రభుత్వం నియమించిన ముగ్గురు బిజెపి నామినీలతో బిజెపి సంకీర్ణ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది.
అడ్డదారుల్లో అందలమెక్కిన బిజెపి ఒకవైపు రేషన్ షాపులను మూసేసి పేద ప్రజలకు సరసమైన ధరకు బియ్యం, పామాయిల్, పప్పు, పంచదార ఉచితంగా అందించకపోవడంతో వారు ఆకలితో అలమటిస్తున్నారు. వీరి ఆకలి కేకలను ఏమాత్రం పట్టించుకోకపోగా రాష్ట్రంలో ఆర్‌ఎస్‌ఎస్ ను పటిష్టం చేసే దిశగా బిజెపి అడుగులు వేస్తోంది.
కేంద్ర ప్రభుత్వం 2018లో బియ్యానికి బదులుగా నేరుగా నగదు చెల్లింపు పథకాన్ని కొన్ని రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయడం ప్రారంభించినప్పుడు సిపిఎంతో సహా మరి కొన్ని పార్టీలు నిరసన వ్యక్తం చేయడంతో కొన్ని రాష్ట్రాల్లో దీనిని ఉపసంహరించుకున్నారు. అయితే ఇప్పటికీ చండీగఢ్, పుదుచ్చేరి, దాద్రా నగర్ హవేలీలో అమలులో ఉంది. రేషన్ వస్తువులకు బదులుగా నగదును అందించడమంటే...కాలక్రమేణా ఆహార సబ్సిడీని పూర్తిగా నిలిపివేయడమేనని గత అనుభవాలు తెలియచేస్తున్నాయి. సిలిండర్ ధరల సబ్సిడీని నిలిపివేయడం, పుదుచ్చేరి నగదు పంపిణీ ఆపడం వంటివి పరిశీలించినప్పుడు మనకా విషయం బోధపడుతుంది.
ప్రపంచ సంపన్నుల జాబితాలో ఆరవ స్థానంలో నిలిచిన అదానీ.. తర్వాత ఐదో స్థానానికి...ఇప్పుడు నాలుగో స్థానానికి ఎగబాకినట్లు ఓ అధ్యయనం వెల్లడించింది. అదానీ సహా కార్పొరేట్ కంపెనీలకు రూ. వేల కోట్ల రాయితీలు ఇస్తున్న బిజెపి...పేదలకు సంక్షేమ పథకాలు అందజేయడానికి మాత్రం నిరాకరిస్తోంది.
ఈ నేపథ్యంలో సిపిఎం ఆగస్టు 2న పుదువాయిలో నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. ఆ సందర్భంగా ఎన్.ఆర్ కాంగ్రెస్-బిజెపి సంకీర్ణ ప్రభుత్వం ముందు వుంచిన డిమాండ్లు ఇవీ...
1. కొత్తగా మూతపడిన రేషన్ షాపులను తెరిచి నాణ్యమైన ఉచిత బియ్యం, సబ్సిడీ పప్పులతో సహా నిత్యావసర సరుకులు అందించాలి.
2. అసంఘటిత కార్మికులు, శాశ్వత ఆదాయం లేనివారితో పాటు అర్హులందరికీ ఎరుపు రేషన్ కార్డు జారీ చేయాలి. ఎరుపు కార్డుకు నెలకు 20 కిలోల ఉచిత బియ్యం, పసుపు కార్డుకు నెలకు 10 కిలోల ఉచిత బియ్యం మునుపటి లాగా అందించాలి.
3. పుదుచ్చేరి ప్రభుత్వ ఉచిత బియ్యం చెల్లింపు పథకం గత 15 నెలలుగా నిలిపివేయబడింది. దాంతో ఎరుపు రేషన్ కార్డ్ హోల్డర్లకు రూ. 9000, పసుపు రేషన్ కార్డు ఉన్నవారికి రూ. 4500 అందలేదు. ఈ డబ్బు ఇవ్వాలి. లేదా అందుకు బదులుగా నాణ్యమైన ఆహార ధాన్యాలు ఇవ్వాలి.
/ వ్యాసకర్త :
సిపియం పొలిట్ బ్యూరో సభ్యుడు /
జి. రామకృష్ణన్