
తెల్లారి నిద్రలేవగానే దువా చదువుకుని అరచేతుల్ని ముఖానికి రుద్దుకోవడం అలవాటు నాకు. ఇవాళ చూస్తే నా కుడి చెయ్యి లేదు. చల్లగా చలనం లేకుండా మంచమ్మీదే ఒక పక్కగా పడిపోయి ఉంది. ఎలా తెగిపోయిందో అర్థం కావడం లేదు. కనీసం ఒక నెత్తుటి చుక్క కూడా కారలేదు. ఏదో వేపమొద్దును తెచ్చి పరాపరా రంపంతో కోస్తే ఎంత నున్నగా కట్ అవుతుందో అలా అయిపోయింది.
'ఒసేరు.. నా చెయ్యి తెగిపోయిందే..' బిగ్గరగా అరిచాను దడుసుకుని.
మా ఆవిడ బెడ్‌రూమ్‌లోకి పరిగెత్తుకుంటూ వచ్చింది.
'ఓస్ అంతేనా.. ఇంకేదో అనుకుని భయపడి చచ్చాను. పోతే పోయిందిలెండి పాడు చెయ్యి. తీసుకెళ్లి అల్మారాలో పెట్టండి. వీలు చూసుకుని, డాక్టరు దగ్గరికెళ్లి కుట్టించుకోవచ్చు. ఇంతమాత్రం దానికే అంత కంగారైతే ఎలాగండి?' వచ్చినంత వేగంగానే చెప్పి, వెళ్లిపోతోందావిడ.
అప్పుడు చూశాను. ఒళ్లు జలదరించింది. మా ఆవిడకు ఎడమ చెయ్యి లేదు. అవును ఆమెది ఎడమ చెయ్యి వాటం. అన్నం వడ్డించాలన్నా, గ్లాసు పట్టుకుని నీళ్లు తాగాలన్నా, పుస్తకంలో ఏదైనా రాయాలన్నా, ఇంట్లో కసువు ఊడ్చాలన్నా చివరికి ఏడేళ్ల పిల్లోడు 'చాందూ' ని దండించాలన్నా ప్రతిదానికి ఆమె ఎడమ చేతినే వాడుతుంది. ఇప్పుడా చెయ్యే లేదు.
'నా చెయ్యి సరే.. ఆమె చెయ్యి ఎప్పుడు పోయిందీ..?' నాకేమర్థం కావడం లేదు. మళ్లీ అరిచి ఆమెనే అడుగుదామనుకున్నాను. కానీ ఆగిపోయాను. నాకసలే మతిమరుపు అంటుంది మా ఆవిడ. మరోసారి ఆమెతో ఆ మాట అనిపించుకోవడం తప్పితే నాకు సమాధానం దొరకదని అర్థమైంది.
ఒంటిచేత్తోనే దువా చేసుకుని, ఆ అరచేతినే ముఖానికి రుద్దుకుని మంచం దిగాను. నా కుడి చేతిని తీసుకెళ్లి జాగ్రత్తగా అల్మారాలో మా ఆవిడ ఎడమ చేతి పక్కనే పెట్టాను.
ఒంటిచేత్తోనే గబగబా బ్రెష్ చేసుకుని.. స్నానం కానిచ్చి... బట్టలు వేసుకుని.. టక్ చేసుకుని.. టిఫిన్ తిని, లంచ్ బాక్స్ భుజానికి తగిలించుకుని, ఆఫీస్‌కని బయల్దేరి ఇంట్లోంచి బయటికొచ్చాను.
మా ఇంటి ఓనరు ఎదురయ్యాడు.. రెండు చేతులూ లేకుండా.
'థూ..దీనెమ్మా.. ఏదో అయ్యిందిరాబై.... ఇవ్వాళ..' అనుకున్నాను.
'అంకుల్.. మీ రెండు చేతులూ..' అని డౌట్ అడుగుదామనుకున్నాను.. కానీ అతను నా కుడి చెయ్యి గురించి అడిగితే అప్పుడేం చెప్పాలి సమాధానం. అందుకే నోరు మెదపకుండా నవ్వుతూనే ఆఫీస్‌కెళ్తున్నానని సైగ చేసి వచ్చి టూ వీలర్ ఎక్కాను.
విచిత్రం.. ఒంటిచేత్తోనే బండిని చక్కగా తోలుతున్నాను. కాదు నేను తోలడం ఏంటి.. బండే ఒంటిచేతిగాళ్ల కోసం తయారుచేసినట్టుగా ఉంది. ఆ విషయం నేను తొందర్లో గమనించలేదు. వీధిలో అందరూ ఒంటిచేత్తోనే బళ్లు తోలుతున్నారు. ఏమంటే కొందరు కుడిచేత్తో.. మరికొందరు ఎడమ చేత్తో .. అంతే తేడా. అసలు రాత్రికి రాత్రి లోకం ఎలా అవిటిదైపోయిందా.. అనేది నా పెద్ద డౌటూ.
నేను ఆఫీసుకెళ్లే దారిలో పెద్ద హాస్పిటల్ ఉంది. అది నేనున్న ఈ మహానగరంలోనే పెద్ద ఫేమస్. ఆ ఆస్పత్రి ముందు మనుషులంతా తెగిపోయిన తమ చేతుల్ని పట్టుకుని, క్యూలో నిల్చోని ఉన్నారు. 'నో పార్కింగ్' అని తెలిసినా కూడా ఎలాగోలాగ ధైర్యం చేసి బండిని సైడ్ తీసుకుని ఆపి, అక్కడివారిని విచారిస్తే దిమ్మ తిరిగిపోయింది నాకు.
వీళ్లంతా ఎప్పుడో ఏడాది కిందట చేతులు తెగిపోయినవాళ్లని.. అప్పుడు దరఖాస్తు చేసుకుంటే ఇవ్వాళ్టికి ఆస్పత్రివాళ్లు అపాయింట్‌మెంట్ ఇచ్చారని అందుకే అందరూ క్యూలో నిల్చున్నారని దాని సారాంశం.
'అమ్మా.. దానెమ్మ..బడవా.. ఇప్పుడెట్టా? ఈ చేతిని అతికించుకోవాలంటే ఏడాది వెయిట్ చేయాల్నా? ఇంతమందికి ఈ దేశంలో చేతుల్లేవా? ఇంకా నేనేదో రాత్రికి రాత్రే జరిగిన మిరాకిల్ అనుకుంటున్నా. ఆ ఏడాదిలోపు ఒంటిచేత్తో ఎలా బతకాలో అందరికీ అలవాటైపోతుంది. అప్పుడు ఆపరేషన్ చేయించుకున్నా రెండు చేతుల్తో బతకడం కష్టంగా అనిపిస్తుంది. అందుకే చాలామంది ఒంటి చేతి జీవితానికే అలవాటుపడి ఉన్నారు. కానీ ఎన్ని రోజులైనా నేనలా కాకూడదు. ఎట్టి పరిస్థితిల్లోనూ ఆస్పత్రికెళ్లి వీలైనంత త్వరగా చేతిని అతికించుకోవాలి. అంటే ఇప్పుడే వెళ్లి ఆపరేషన్‌కు దరఖాస్తు పెట్టుకోవాలి.
బండిని నో పార్కింగ్‌లోనే వదిలేసి, హడావిడిగా దరఖాస్తు కౌంటర్ దగ్గరికెళ్లాను. అక్కడ తిరుపతి దేవుని దగ్గరకన్నా పెద్ద క్యూ ఉంది. తిరుపతిలో ఇప్పుడు నాలుగైదు క్యూలైన్లు పెట్టి, భక్తులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్లాన్ చేస్తున్నారంట. ఇక్కడ ఆ మాత్రం ప్లాన్ కూడా ఉన్నట్టు లేదు, భయపడిపోయాను. ఈ క్యూలో నిలబడితే ఏ వారానికో కానీ బయటపడలేను. ఇక్కడే స్నానాలు, అన్నాలు, నీళ్లు అన్నీ కానిచ్చేస్తున్నారంతా. ఇదే అదనుగా చోటామోటా వ్యాపారులంతా చెలరేగిపోతున్నారు. క్యూ వెంబడి రకరకాల వస్తువులు పట్టుకుని, తిరుగుతున్నారు. ఏదో ఒకటి కొనమని డిమాండ్ చేస్తున్నారు. కొననివాళ్లను బూతులు తిడుతున్నారు. బలవంతంగా వస్తువులను చేతిలో పెట్టి, జేబులు తడిమి మరీ డబ్బులు తీసుకుంటున్నారు. మరీ భీష్మించుకుంటే నిర్దాక్షిణ్యంగా క్యూలోంచి బయటికి గెంటేస్తున్నారు.
'ఇంట్లోంచి బయటికంటూ వచ్చాక ఏదో ఒకటి కొనాల్సిందే కదండి. అలా కొనలేనివాళ్లకు బయట స్వేచ్ఛగా తిరిగే హక్కు లేదని తెలియదా? మార్కెట్ లోకంలో బతుకుతూ ఆ మాత్రం ఇంగితం లేకపోతే ఎలా?' అని ఇంతింత గొంతులేసుకుని అరుస్తున్నారు.
ఇప్పుడు చెయ్యే లేదు.. ఇంకాసేపు అక్కడుంటే ఏమి లేకుండా పోతుందో చెప్పలేను. అసలే ఆఫీస్‌కు టైం అవుతోంది. ఇక్కడ నిలబడి కుస్తీ పట్టాలంటే జేబునిండా డబ్బు, ఒంటినిండా సత్తువతోపాటు వారంరోజుల లీవు కావాలి. వెంటనే వెనక్కి వచ్చేసి బండి స్టార్ట్ చేసుకుని, నేరుగా ఆఫీస్‌కొచ్చాను.
ఒంటిచేత్తోనే సలాం చేశాడు గేటు దగ్గర సెక్యూరిటీ గార్డు. వంగి వాడి సలాంను రిసీవ్ చేసుకున్నా. నేరుగా బండిని పార్కింగ్‌లో పెట్టి, లిఫ్ట్ పట్టుకుని ఫ్లోర్‌లోకెళ్లాను. అందరూ ఒంటి చేత్తో కంప్యూటర్‌ని టపటపలాడిస్తున్నారు. నేనలా చేయగలనా? గబగబా లంచ్‌బాక్సు పక్కనపెట్టి, నా సీట్లో కూర్చోని కంప్యూటర్ ఆన్ చేశాను. విచిత్రం.. ఒంటిచేత్తో పనిచేయడం నాకు పెద్ద కష్టమనిపించడం లేదు. అదేదో అలవాటున్న పనిలాగే నా ఒంటిచెయ్యి చేసుకుపోతోంది. ఏకకాలంలో మౌస్‌ని, కీ బోర్డుని దడదడలాడించేస్తోంది. అంతా సంతోషమే కానీ ఒక్కడంటే ఒక్కడు కూడా నాకు చేయి లేని సంగతిని పట్టించుకున్నట్టు లేదు. అది నాకు కొంత బాధగా అనిపించింది.
పక్కనే ఉన్న కొలీగ్‌ను అడిగాను.
'నిన్నటిదాక మీ అందరికీ చేతులున్నాయి కదా. ఇవ్వాళే ఎందుకు లేవు?' అని. అతను నవ్వాడు.
'ఒరేరు పిచ్చోడా.. మాకు చేతుల్లేక చాలారోజులైంది. నీకు చేతులున్నాయి కాబట్టి ఇన్నాళ్లూ నీకు ఆ సంగతి తెలియలేదు..' అన్నాడతను.
అవును. ఇదే లోకంతీరు. ఏదైనా మనకు లేకుంటేనే ఎదుటివాళ్లకు ఏముందో తెలిసేది. అన్నీ మనకుంటే మనం ఇంకెవ్వర్నీ పట్టించుకోం. కొలీగే కదా.. అని లైట్ తీసుకున్నాను ఇన్నాళ్లు. ఒక్కమాటలో ఎంత ఫిలాసఫీ చెప్పేశాడు వీడు. అయినా వీళ్లతో పోల్చుకుంటే నేను కొంచెం బెటరే.. ఇన్నాళ్లయినా చేతులు కాపాడుకోగలిగాను. కొంచెం గర్వంగా అనిపించింది.
లీవు సంగతి గుర్తుకొచ్చి బాస్ గదికెళ్లాను. అతను కాళ్లతో కంప్యూటర్ ఆపరేట్ చేస్తున్నాడు. రెండు చేతులు ఎప్పుడు తెగిపోయాయో.. లేవు.
అతన్ని పట్టుకుని ఈ కారణంతో లీవ్ అడగడం సబబా అనిపించింది ఒక్కక్షణం నాకు. అయినా తప్పదనుకుని అడిగేశాను.
'సా..ర్ చెయ్యి అతికించుకోవడానికి అప్లికేషన్ పెట్టుకోవాలి. వారం రోజులు లీవు కావాలి.'
అతను నన్ను పిచ్చోని కన్నా దారుణంగా చూశాడు.
'ఆ తీరికే ఉంటే నేను నా రెండు చేతులు ఎప్పుడో అతికించుకునేవాణ్ణి. ఆ తీరిక లేకే కనీసం అప్లికేషన్ కూడా ఇంతవరకు పెట్టలేకపోయాను. రోజుల తరబడి లీవులు పెట్టి, అందరూ చేతులు అతికించుకోవడం కోసం వెళ్తే నేను ఆఫీసు మూసుకోవాల్సిందే. అయినా ఇప్పుడు ఆ వెధవ చెయ్యి ఉండి ఏం ఉద్ధరించాలంటా.. మూసుకుని మొండిగా పని చెయ్యడం నేర్చుకో..' అన్నాడతను.
నిజమే. ఇదే కార్పొరేట్ కల్చర్. ఒక్కోసారి ఒక్కో అవయవం శరీరం నుంచి తెగిపడుతున్నా, నాది కాదులే.. అనుకుని ఉద్యోగులు పనిచేస్తుండాలి. నాకు చేయి లేదు కాబట్టి అందరూ చేతులు లేనివాళ్లే కనిపిస్తున్నారు. ఒకవేళ నాకు తల లేకపోయుంటే ఎంతమందికి తలల్లేవో తెలిసిపోయేది.
బాస్ చీదరింపుతో వచ్చి సీట్లో పడ్డాను. టైం చూసుకుంటే అప్పుడే ఒంటి గంటయిపోతోంది. ఆకలి చంపేస్తోంది. ఈ ఆకలిక్కూడా ఒక కాలు, ఒక చెయ్యి లేకుంటే బావుండేది. అప్పుడు తిండి బాధ కొంతైనా తగ్గేది. భోజనం బాక్సు పట్టుకుని లిఫ్టులోనే దిగి, క్యాంటిన్‌కెళ్లాను. ఓ కార్నర్‌లో ఉన్న టేబుల్‌ను చూసుకుని కూర్చున్నాను. బాక్స్ ఓపెన్ చేయబోయేంతలో వచ్చింది స్వీట్ బాక్సు పట్టుకుని హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంటులో పనిచేసే నా ఫ్రెండ్ సరయు.
రావడం రావడంతోనే 'గుడ్ న్యూస్..' అంటూ పెద్దగా అరుస్తూ లడ్డూ తీసి నా నోట్లో దూర్చింది. సగం లడ్డూ లోపలికెళ్లి పోగా మిగతాది కింద పడిపోకుండా పట్టుకుని 'ఏంటి సంగతి..?' అన్నాను నముల్తూనే.
'రాత్రి .. నా బేబి, నా ముద్దుల పట్టి, నా బంగారు తల్లి.. నన్ను మనస్ఫూర్తిగా క్షమించేసిందోచ్!' అంది.
'అవునా.. మనస్ఫూర్తిగానా? పిల్లల కోపం కాసేపేగా ఉండేది? ఇక క్షమించడం అనే మాట ఎక్కడిది? అసలు పాప మనస్ఫూర్తిగా క్షమించిందన్న సంగతి అంత కచ్చితంగా నీకెలా తెలిసింది?' అన్నాను.
ఆమె స్వీట్ బాక్స్ టేబుల్ మీద పెట్టి.. తన రెండు చేతులూ చూపించింది ఒకేసారి 'టట్టడోరు..' అంటూ.
ఎంత బావున్నాయో. ఉదయం నుంచి చేతుల్లేనివాళ్లను చూసి జీవితం బోరు కొట్టేసింది. ఆ చేతులు అతికించుకున్నవేమో అని అనుమానంగా చూశాను. కాదు అత్యంత సహజంగా ఉన్నాయి. హంసరెక్కల్లా ఉన్నాయి. మనసు ఆనందంగా అనిపించింది.
ఆవిడ మళ్లీ స్వీటుబాక్సు చేతుల్లోకి తీసుకుని, ఇంకెవరికో ఇవ్వడానికి వెళ్లిపోయింది. నాకు సడన్‌గా - ఆ రాత్రి నా చెయ్యి ఎందుకు పోయిందో స్ఫురించింది. దుఃఖం ఆపుకోలేక బడబడా ఏడ్చేశాను.
'ఒరే.. చాందూ.. నీ మీద చెయ్యెత్తిన నాకు.. క్షమాపణ ఉందా..?'
జాతీయ ఉత్తమకథా సంకలనంలో 'ఒంటిచేయి'!

జాతీయ స్థాయిలో అలోఫ్ బుక్ కంపెనీ ప్రచురించిన ఉత్తమ కథల సంకలనంలో వైఎస్సార్ జిల్లాకు చెందిన యువ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమి యువ పురస్కార గ్రహీత వేంపల్లె షరీఫ్ కథ 'ఒంటిచేయి' కి స్థానం లభించింది. ఉత్తమ సాహిత్య ప్రచురణ సంస్థగా దక్షిణాసియా దేశాల్లో ఎంతో ఆదరణ గల అలోఫ్ బుక్ కంపెనీ ఈ ఏడాది ప్రతిష్టాత్మకంగా ప్రచురించిన భారతీయ ఉత్తమ వర్తమాన కథల ఆంగ్ల సంకలనంలో తెలుగు నుంచి వేంపల్లె షరీఫ్ రాసిన 'ఒంటిచేయి' కథకు చోటు లభించింది. దేశంలోని వివిధ భాషల్లో 40 మంది ఉత్తమ వర్థమాన కథలతో ఆ కంపెనీ 'ఏ కేస్ ఆఫ్ ఇండియన్ మార్వెల్స్' పేరిట పుస్తకాన్ని ప్రచురించింది. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న పెంగ్విన్ ప్రచురణ సంస్థ సిఇఓ ఈ సంకలనానికి సంపాదకత్వం వహించారు. ఇక షరీఫ్ కథను బెంగళూరుకు చెందిన ప్రముఖ అనువాదకులు ఎన్‌ఎస్ మూర్తి 'క్రిపుల్డ్ వరల్డ్' పేరుతో అనువదించారు. కేంద్ర సాహిత్య అకాడమి ద్వైమాస పత్రిక 'ది ఇండియన్ లిటరేచర్' లో కూడా ఈ కథ ఆంగ్ల అనువాదం ప్రచురితమైంది.
సాక్షి ఫన్‌డే, 27 జూలై, 2014,
ది ఇండియన్ లిటరేచర్, ఇంగ్లీషు అనువాదం,
సెప్టెంబర్, 2015,
ఆల్ ఇండియా రేడియో, విజయవాడ, డిసెంబరు 15, 2016,
A Case of Indian Marveles, భారతీయ కథల సంకలనం, సెప్టెంబర్, 2022,
www.abahaman.com, బెంగాలీ అనువాదం, సెప్టెంబర్, 2022.
వేంపల్లి షరీఫ్
9603429366