Jan 21,2023 08:59
  • పోరాటాలను ఉధృతం చేస్తామన్న ప్రతినిధులు

శ్యామల్‌ చక్రవర్తి నగర్‌ నుంచి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి : రాబోయే రోజుల్లో పోరాటాలను ఉధృతం చేయడం దారా సిఐటియును మరింత బలోపేతం చేస్తామని ప్రతినిధులు తెలిపారు. సిఐటియు మహాసభలో కార్యదర్శి నివేదికపై శుక్రవారం కూడ చర్చలు కొనసాగాయి. 23 రాష్ట్రాల నుండి హాజరైన ప్రతినిధులు చర్చల ప్రక్రియలో పాల్గొన్నారు. నూతన రంగాల్లో కార్మికులను ఐక్యం చేయాల్సిఉందని పలువురు అభిప్రాయ పడ్డారు. దేశంలో మతత్వశక్తులు అధికారంలో ఉండి కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
 

                                                     పోరాటాలతోనే మతత్వాన్ని అడ్డుకోగలం : నర్సింగరావు

బిజెపి దేశంలోని అన్ని ప్రాంతాల్లోకి మతత్వాన్నిజొప్పించే ప్రయత్నం చేస్తోందని, దీన్ని పోరాటాల ద్వారా అడ్డుకోగలమని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింగరావు అన్నారు సిఐటియు మహాసభ మూడవ రోజు శుక్రవారం జరిగిన చర్చల్లో ఆయన మాట్లాడుతూ బిజెపి ఏదోఒక రూపంలలో మతత్వాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే రకంగా ప్రయత్నం చేసిందని గుర్తు చేశారు. అయితే విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ ఉద్యమం మొదలయ్యాక బిజెపికి అడ్డుకట్ట పడిందన్నారు. పోరాటాల ద్వారా బిజెపికి అడ్డుకట్టవేయగలమన్నది దీనితో స్పష్టమవుతోందన్నారు. అన్ని ప్రాంతాల్లోనూ ప్రత్యేక ఆర్థిక మండళ్లు పరిశ్రమలు కొత్తగా వస్తున్నాయన్నారు. అక్కడ కార్మికుల సమస్యలపై జోక్యం చేసుకునేందుకు వీల్లేకుండా ప్రభుత్వాలు, పోలీసు యంత్రాంగం ముందుకొస్తోందన్నారు.
 

                                                     నిర్మాణంపై మరింత దృష్టి : ఎ.వి నాగేశ్వరరావు

రాష్ట్రంలో సంఘాన్ని మరింతగా నిర్మించడంపై దృష్టి సారింంచనున్నట్లు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎ.వి నాగేశ్వరరావు చెప్పారు. గత మూడేళ్లకాలంలో అనేక కొత్త సంఘాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. . రాబోయే రోజుల్లో వైద్యం, ఆరోగ్యం, పంచాయతీ, తదితర రంగాలపైనా దృష్టి సారించి సంఘాన్ని నిర్మాణంలో మరింత బలపడే విధంగా కృషి చేస్తామని అన్నారు.
 

                                                      నూతన ఒరవడితో ముందుకు : పాలడుగు భాస్కర్‌

తెలంగాణలో నూతన ఒరవడితో ముందుకు సాగుతున్నామని ఆ రాష్ట్ర సిఐటియు ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ పేర్కొన్నారు. పాదయాత్రలు, జీపుజాతాలు కొత్త సంబంధాలను తెచ్చిపెట్టాయన్నారు. 450 గ్రామాల్లో 6500 మంది వ్యవసాయేతర కార్మికుల దగ్గరకు వెళ్లి సర్వే ద్వారా వారి జీవన పరిస్థితులు, ఎదుర్కొంటున్న ఇబ్బందులను సేకరించామన్నారు.
 

                                               యువతను పక్కదోవ పట్టిస్తున్న బిజెపి : ఏ.ఏ రహీం

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం యువతను పక్కదోవ పట్టిస్తోందని డివైఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షులు ఏఏ.రహీం తెలిపారు. సిఐటియు అఖిల భారత మహాసభలో ఆయన మాట్లాడుతూ రెండు కోట్ల ఉద్యోగాల హామీని తుంగలో తొక్కారని విమర్శించారు. యువత సమస్యలపై పోరాటాల్లోకి రాకుండా మతం పేరుతో వారి మెదళ్లల్లో విషం నింపుతున్న దన్నారు. కేరళలో ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం ప్రత్యామ్నాయ విధానాలతో ముందుకు సాగుతున్న తీరును వివరించారు. యువతను చైతన్యపరిచేలా పోరాటాలను రూపొందిస్తున్నామని చెప్పారు.