Jul 11,2023 07:17

  • కేంద్రానికి అరాచక సంఘపరివార్‌ మూకలకు మధ్య చెరిగిపోతున్న గీత

సమాజంలో మతపరంగా చీలికలు తీసుకువచ్చి, తద్వారా రాజకీయ ఫలితాలు రాబట్టుకోవాలన్నదే ఆర్‌ఎస్‌ఎస్‌ - బిజెపి ఉద్దేశపూరిత కుట్రగా వుంది. ఎన్నికలు సమీపిస్తున్నందున, ఇటువంటి కార్యకలాపాలు మరింత వేగం పుంజుకుంటున్నాయి. ప్రభుత్వ అధికారాలను ఉపయోగించి, వారు పాలనా యంత్రాంగం లోని వివిధ విభాగాలు, అధికారుల ద్వారా తమ సైద్ధాంతిక ప్రభావాన్ని విస్తరిస్తున్నారు. తమ ప్రయోజనాలకు వారిని విధేయులుగా వుండేలా చేస్తున్నారు. ప్రపంచ దేశాల ప్రజలను ఆకర్షించడానికి ప్రజాస్వామ్యంపై, సహనంపై ప్రధాని చేసే వ్యాఖ్యలు, మైనారిటీలపై జరిగే ఈ దాడులను కప్పిపుచ్చలేవు.

        ఇటీవల అమెరికాలో పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్రమోడీ, కులం, మతం, వర్గం, వయస్సు లేదా భౌగోళిక ప్రాంతాల ప్రాతిపదికన భారతదేశంలో వివక్ష లేదని చెప్పుకొచ్చారు. కానీ అవన్నీ తప్పని ఆ వెంటనే రుజువైపోయింది. ఈద్‌ సందర్భంగా మైనారిటీలపై వరుసగా దాడులు, అటువంటి దాడులకు పాల్పడిన వారికి బహిరంగంగా లేదా రహస్యంగా ప్రభుత్వం రక్షణ కల్పించడం చూస్తుంటే, బిజెపి ప్రభుత్వం చెప్పే మాటలకు, చేతలకు అస్సలు పొంతన లేకపోవడం కనిపిస్తోంది.
         జూన్‌ 24న ప్రధాని ఈ వ్యాఖ్యలు చేసి 24 గంటలు కూడా గడవక ముందే, కాశ్మీర్‌ లోని పుల్వామా జిల్లా లోని జాదూరా గ్రామంలో గల మసీదులోకి భారత సైన్యానికి చెందిన ఒక మేజర్‌ నేతృత్వంలో సైనికులు ప్రవేశించారు. అక్కడున్న వారిచేత బలవంతంగా 'జై శ్రీరాం' అంటూ నినాదాలు చేయించారు. అదే గ్రామంలోని అతి పెద్ద జామియా మసీదును కూడా వారు ధ్వంసం చేశారని ఆరోపణలు వచ్చాయి. తద్వారా మత స్వేచ్ఛ హక్కును వారు అణచివేశారు. సైన్యం వంటి లౌకికవాద సంస్థ లౌకికవాద భావజాలంతో సంబంధం లేకుండా, ఇటువంటి పక్షపాత ధోరణితో వ్యవహరించడం, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం చూస్తుంటే... ప్రస్తుత ప్రభుత్వ నేతృత్వంలో ప్రభుత్వ సంస్థల తీరుతెన్నులెలా వున్నదీ స్పష్టంగా అర్థమౌతోంది.
         అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా విమర్శలు చేసిన నేపథ్యంలో మోడీని సమర్ధించడంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఒకవైపు బిజీగా వున్నారు. మరోపక్క ముంబయికి 150 కిలోమీటర్ల దూరంలో జూన్‌ 25న గొడ్డు మాంసం తీసుకెళుతున్నాడన్న కారణంతో ఒక యువకుడిని కొట్టి చంపడం ప్రభుత్వం పాటించే సంయమన విధానాలకు ప్రత్యక్ష సాక్షిగా వుంది. ముంబయి-నాసిక్‌ ప్రాంతాల మధ్య కేవలం 15 రోజుల వ్యవధిలో ఇటువంటి ఘటన జరగడం ఇది రెండవసారి. రెండు కేసుల్లోనూ దాడికి గురైంది పసమందా ముస్లింలే. ఈ రెండు ఘటనలు ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి ద్వంద్వ ప్రవృత్తిని తేటతెల్లం చేస్తున్నాయి. కానీ పసమందా ముస్లింల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నది తానేనని చెప్పుకోవడానికి, చూపించుకోవడానికి ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి పోటీపడుతున్నాయి. ఈ రెండు సంఘటనల్లోనూ బాధితులు రోజువారీ కూలీలు, నిరుపేద కుటుంబాలకు చెందినవారు. వీరు మాంసం, కూరగాయలు రవాణా చేస్తూ బతుకీడుస్తారు. గో రక్షకులుగా చెప్పుకునే పది, పదిహేను మంది గూండాలు వీరిపై దాడి చేశారు. రాష్ట్రీయ బజరంగ్‌ దళ్‌ నేతృత్వంలో వీరు పనిచేస్తారు.
          జంతువుల పట్ల క్రూరంగా వ్యవహరించడాన్ని నివారించే చట్టం కింద బాధితులపై మహారాష్ట్ర పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. అయితే ఇక్కడ వారు జంతువులను రవాణా చేయడంలేదన్నది వాస్తవం. ప్రభుత్వ యంత్రాంగంపైన, మత వివక్షను మరింత పెంచడంపైన సంఘ పరివార్‌ భావజాల ప్రభావం ఎలా వుంటుందో చెప్పడానికి మరో ఉదాహరణగా దీనిని చెప్పుకోవచ్చు. షిండే-ఫడ్నవిస్‌ ప్రభుత్వ హయాంలో, ఈ గోరక్షక ముఠాలు బరితెగిస్తున్నాయి. దాడులకు పాల్పడే గోరక్షకులు హంతకుల అవతారమెత్తారు. మహారాష్ట్రలో ఇలా జరగడమిదే ప్రథమం.
          రెండో సంఘటన జరిగిన రెండు రోజుల తర్వాత, మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ పోలీసులకు హుకుం జారీ చేసే వరకూ వెళ్లారు (అసలు ఆయనకు ఇలా ఆదేశాలు చేయడానికి అధికారమే లేదు). తప్పుడు ఆరోపణలపై గోరక్షకులను వేధించవద్దని ఆయన పోలీసులకు సూచించారు. ఇది విచారకరం. గో రక్షకుల వెనుక వీరి మద్దతు ఎలా వుందన్నది ఈ సంఘటనతో స్పష్టమవుతున్నది. వారిని కాపాడడం కోసం చివరకు తమ రాజ్యాంగ పదవులను కూడా దుర్వినియోగపరుస్తున్నారు.
          దేశవ్యాప్తంగా మైనారిటీలను ఇలా వేధించడం, కొట్టి చంపడం వంటి ఘటనలు జరుగుతున్న తీరు ఆందోళనకరం. మహారాష్ట్రలో ఈ సంఘటన జరిగిన కొద్ది రోజుల తర్వాత, బీహార్‌ లోని సరాన్‌ జిల్లాలో ఈద్‌ సందర్భంగా మరో దాడి జరిగింది. ఇక్కడ బాధితుడు 55 ఏళ్ళ వికలాంగుడైన ముస్లిం డ్రైవర్‌. సమీపంలోని ఫ్యాక్టరీకి జంతువుల ఎముకలను తీసుకెళుతుంటే ఆ డ్రైవర్‌ను కొట్టి చంపేశారు. మందులు తయారుచేసే ఫ్యాక్టరీలో ఉపయోగించడానికి ఈ ఎముకలను తీసుకెళుతున్నారు. ఈ ఫ్యాక్టరీ గత 50 ఏళ్ళుగా నడుస్తోంది.
          ఉత్తరాఖండ్‌లో, పురోలాలో ముస్లింల దుకాణాలను లక్ష్యంగా చేసుకుని, వాటిని మూసేయించేలా ఒత్తిడి తీసుకువచ్చారు. ఆ తర్వాత, మిగిలిన ముస్లింలను కూడా వెంటాడసాగారు. ఈద్‌ సందర్భంగా ఒకచోట గుమికూడి, నమాజ్‌లు చేయవద్దని, చివరకు వారి ఇళ్లలో కూడా చేయకూడదని విశ్వహిందూ పరిషత్‌, ముస్లింలను ఆదేశించింది. ఫలితంగా, ముస్లింలందరూ పురోలా, బార్కోట్‌ పట్టణాలకు దూరంగా దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో గల అడవుల్లో పండగ రోజున నమాజ్‌ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
          గుజరాత్‌ లోని ముంద్రాలో ఈద్‌ రోజున, ప్రైవేటు స్కూల్‌ ప్రిన్సిపాల్‌ను సస్పెండ్‌ చేశారు. విద్యార్థులు నెత్తిపై టోపీలు ధరించి, ఈద్‌-అల్‌-అదాపై నాటకాన్ని వేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్‌ అయింది. దాంతో ఆ స్కూలు ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకున్నారు. ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకునేలా జిల్లా విద్యాశాఖాధికారిపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ చర్యను సమర్ధించుకుంటూ జిల్లా ప్రాథమిక విద్యాధికారి, ముస్లింలు ధరించే టోపీలను హిందూ విద్యార్థులను పెట్టుకోమని కోరడం హీనమైన పనని వ్యాఖ్యానించారు. సమాజంలో మత విద్వేషం ఎంతలా పాతుకుపోయిందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. అంతకంటే ముఖ్యంగా, బిజెపి పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వ అధికారులు సైద్ధాంతికంగా ఎంతలా భ్రష్టు పట్టిపోయారనేది మరింత స్పష్టంగా తెలియచేస్తోంది.
          మత విద్వేష వ్యాప్తి కేవలం కొన్ని పరిధులకే పరిమితం కావడం లేదు. 'భారత్‌లోని పలువురు హుస్సేన్‌ ఒబామాల' గురించి జాగ్రత్త తీసుకోవడానికి తాము ప్రాధాన్యత ఇస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత్‌ బిశ్వ శర్మ వంటి వారు చెబుతున్నారంటే...కేంద్ర ప్రభుత్వానికి, ఆర్‌ఎస్‌ఎస్‌, బజరంగ్‌ దళ్‌ వంటి మత సంస్థలకు మధ్య గల విభజన రేఖ అదృశ్యమైపోతోంది. ముస్లింలు ఎంతమాత్రమూ సమానులు కారని ఆయన స్పష్టంగా చెబుతున్నారు. వారు కేవలం రెండో తరగతి పౌరులు మాత్రమేనని పేర్కొంటున్నారు.
         పైన చెప్పుకున్న ఘటనలన్నీ ఈద్‌ వేడుకల సందర్భంగా చోటుచేసుకున్నవే. అవేమీ యాదృచ్ఛికంగా జరిగినవి కావు. హిందూ ఉత్సవాలైనా, ముస్లిం పండగలైనా హిందూత్వ శక్తులు జరిపే దాడులు మైనారిటీలకు భీతిగొలిపే సందేశాన్ని ఇవ్వడానికి ఉద్దేశించే వుంటాయి. ''మీకు జీవించడానికి ఎలాంటి హక్కులూ లేవు, మా ఆదేశాలకు అనుగుణంగానే మీరు నడవాలి. మిమ్మల్ని రక్షించేది ఏదీ లేదు.'' అన్నదే ఆ సందేశం సారాంశం.
         సమాజంలో మతపరంగా చీలికలు తీసుకువచ్చి, తద్వారా రాజకీయ ఫలితాలు రాబట్టుకోవాలన్నదే ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి ఉద్దేశపూరిత కుట్రగా వుంది. ఎన్నికలు సమీపిస్తున్నందున, ఇటువంటి కార్యకలాపాలు మరింత వేగం పుంజుకుంటున్నాయి. ప్రభుత్వ అధికారాలను ఉపయోగించి, వారు పాలనా యంత్రాంగం లోని వివిధ విభాగాలు, అధికారుల ద్వారా తమ సైద్ధాంతిక ప్రభావాన్ని విస్తరిస్తున్నారు. తమ ప్రయోజనాలకు వారిని విధేయులుగా వుండేలా చేస్తున్నారు. ప్రపంచ దేశాల ప్రజలను ఆకర్షించడానికి ప్రజాస్వామ్యంపై, సహనంపై ప్రధాని చేసే వ్యాఖ్యలు, మైనారిటీలపై జరిగే ఈ దాడులను కప్పిపుచ్చలేవు. ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని పరిరక్షించాలంటే మైనారిటీలపై జరిగే ప్రతి దాడిని తప్పనిసరిగా వ్యతిరేకించాల్సిన, ప్రతిఘటించాల్సిన అవసరముంది. ఫాసిస్టు తరహా హిందూత్వ శక్తులు పాల్పడుతున్న హింసాత్మక చర్యలకు వ్యతిరేకంగా ప్రజలను సంఘటితపరచడానికి వామపక్ష, ప్రజాస్వామ్య శక్తులు నిరంతరంగా కృషి చేయాలి.

('పీపుల్స్‌ డెమోక్రసీ' సంపాదకీయం)